Begin typing your search above and press return to search.

సూర్య VS భరత్-ఒకరు తగ్గండి బాస్

By:  Tupaki Desk   |   21 Feb 2018 8:23 AM GMT
సూర్య VS భరత్-ఒకరు తగ్గండి బాస్
X
ఒకేరోజు రెండు సినిమాలు విడుదల కావడం కొత్తేమి కాదు కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టార్ హీరోలకు ఓపెనింగ్స్ చాలా కీలకంగా మారాయి. ఈ నేపధ్యంలో అనవసర పంతాలకు పోయి క్లాష్ కావడం ఎందుకని సాధ్యమైనంత వరకు రాజీ ఫార్ములా పాటించడానికే ఇష్టపడుతున్నారు. కాని దానికి అవకాశమే లేదు అన్న రీతిలో నా పేరు సూర్య - భరత్ అనే నేను ఏప్రిల్ 26నే రావడానికి పట్టుదలగా ఉండటంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదటి షో ఆడుతుండగానే టాక్ బయటికి వస్తున్న ట్రెండ్ లో ఇలా ఒకరిమీద ఒకరు పోటీకి దిగటం పట్ల ఖంగారు పడుతున్నారు. ఇలా వచ్చినా కూడా వర్క్ అవుట్ చేసుకునే అవకాశం ఒక్క సంక్రాంతికి మాత్రమే ఉంటుంది. కాని ఏప్రిల్ అలా కాదు. వేసవి సెలవులు ఉన్నప్పటికీ మాడు పగిలిపోయే ఎండ కాచుకుని ఉంటుంది.

అలాంటి వాతావరణంలో థియేటర్ దాకా ప్రేక్షకులు రావాలి అంటే ఎక్కువ ఆప్షన్స్ ఉండకూడదు. అలా కాదని ఇలా రెండు క్రేజ్ ఉన్న సినిమాలు ఒకేసారి వచ్చేస్తే ఒకటి బాగుండి రెండోది యావరేజ్ అనే టాక్ వచ్చినా ఇబ్బంది తప్పదు. దీన్ని ఇద్దరు నిర్మాతలు కలిసి కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకోలేరా అంటే ప్రస్తుతానికి అయితే ఆ సూచనలు కనిపించడం లేదు. అందుకే కొందరు పరిశ్రమ పెద్దలు రంగంలోకి దిగి ఇరు వర్గాలతో మంతనాల ద్వారా రాజీ చేసే ప్రయత్నం చేస్తున్నారట.నా పేరు సూర్య ముందుకు రావడమా లేక భరత్ అనే నేను డేట్ మార్చడమా ఏదో ఒకటి తేలే దాకా చర్చలు జరుగుతాయని టాక్.

ఇవి ఫలప్రదం అయ్యి ఒక ఒప్పందానికి వస్తే మంచిదే. దీనికి తోడు రజనికాంత్ కాలా కూడా మరుసటి రోజే పొంచి ఉంది కాబట్టి మొత్తంగా ఒకరివల్ల మరొకరికి వసూళ్ళ పరంగా ప్రభావం చెందటం ఖాయం. గత ఏడాది ఆగస్ట్ లో ఒకే తేదిన నేనే రాజు నేనే మంత్రి - జయ జానకి నాయక - లై సినిమాలు వచ్చి ఓపెనింగ్స్ పరంగా కొంత కోల్పోయిన మాట నిజం. మీడియం రేంజ్ హీరోలకే అలా ఉంటె ఇక స్టార్ హీరోలు తలపడితే ఎలా ఉంటుందో చెప్పాలా. మరి సూర్య - భరత్ లలో ఎవరు ఎవరి మాట వింటారో వేచి చూడాలి.