Begin typing your search above and press return to search.

ఈసారీ అదే అయితే కష్టమే బన్నీ..

By:  Tupaki Desk   |   8 Jun 2017 7:39 AM GMT
ఈసారీ అదే అయితే కష్టమే బన్నీ..
X
ఈ రోజుల్లో రొటీన్ మాస్ మసాలా సినిమాలు ఆడటం కొంచెం కష్టంగానే ఉంది. ఒక ఫార్ములా ప్రకారం తెరకెక్కిన కమర్షియల్ ఎంటర్టైనర్లు గత కొన్నేళ్లలో చాలానే దెబ్బ తిన్నాయి. దీంతో రామ్ చరణ్ లాంటి రొటీన్ మాస్ సినిమాలు చేసే మాస్ హీరో కూడా రూటు మార్చాడు. ‘ధృవ’ లాంటి కొత్త తరహా సినిమా చేశాడు. అతనకొక్కడే కాదు.. చాలామంది స్టార్ హీరోలు మాస్ మసాలాలు వదిలేసి కొత్త కథల మీద దృష్టిపెట్టారు. ఐతే డిఫరెంట్ మూవీస్ రాజ్యమేలుతున్నప్పటికీ గత ఏడాది ‘సరైనోడు’ లాంటి ఫార్ములా సినిమా చేసి మెప్పించాడు అల్లు అర్జున్. ప్రేక్షకుల అభిరుచి మారి.. కొత్త తరహా సినిమాల వైపు చూస్తున్న నేపథ్యంలో అలాంటి మాస్ మసాలా సినిమా అంత బాగా ఆడేస్తుందని ఎవరూ అనుకోలేదు. ఈ చిత్రానికి రివ్యూలు.. టాక్ యావరేజ్ గా వచ్చినా సరే.. సినిమా మాత్రం అంచనాల్ని మించిపోయి అనూహ్యమైన వసూళ్లు రాబట్టింది. అది చూసి అల్లు అర్జున్ మామూలోడు కాదురా అనుకున్నారంతా.

ఐతే ‘సరైనోడు’ ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్లేనేమో.. మరోసారి ఫార్ములా సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు బన్నీ. అతడి కొత్త సినిమా ‘దువ్వాడ జగన్నాథం’ ట్రైలర్ చూస్తే దీని నుంచి కొత్తదనం ఆశించడం కష్టమే అనిపిస్తోంది. హీరో ఓవైపు అమాయకుడిలా మామూలు జీవితం సాగిస్తూ.. మరోవైపు మర్డర్లవీ చేయడం.. అతడికో ఫ్లాష్ బ్యాక్ ఉండటం.. ఇదంతా ఎప్పట్నుంచో చూస్తున్న వ్యవహారమే. అందుకే ‘జెంటిల్ మన్’ దగ్గర్నుంచి రకరకాల సినిమాలతో ‘డీజే’ను పోలుస్తున్నారు జనం. మరి ఇలాంటి ఫార్ములా కథతో జనాల్ని హరీష్-బన్నీ జోడీ ఏమేరకు మెప్పిస్తుందన్నది సందేహం. మరీ రొటీన్ కథ అయి.. ప్రేక్షకులకు ఎలాంటి కొత్తదనం పంచుకుండా.. సర్ ప్రైజులు ఇవ్వకుండా బండి లాగించేయడం అంటే ఇప్పుడు చాలా కష్టం. ‘సరైనోడు’ లాంటి మ్యాజిక్స్ అన్నిసార్లూ జరగవు. కాబట్టి హరీష్ ఎలాంటి సర్ ప్రైజింగ్ ప్యాకేజీ వస్తాడో చూడాలి. ప్రేక్షకుల్ని ఏదో రకంగా అవాక్కయ్యేలా చేయకుంటే మాత్రం ‘డీజే’ బండి ముందుకు సాగడం కష్టం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/