Begin typing your search above and press return to search.

చూసుకోవాల్సింది బన్నీ

By:  Tupaki Desk   |   8 April 2018 5:36 PM GMT
చూసుకోవాల్సింది బన్నీ
X
కొన్ని సార్లు మన ప్రమేయం నేరుగా లేకపోయినా మన పేరున్నప్పుడు విమర్శలకు బదులు చెప్పాల్సి ఉంటుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి తన బర్త్ డే రోజునే ఈ అనుభవం ఎదురైంది. ఈ రోజు ఉదయం విడుదల చేసిన నా పేరు సూర్య డైలాగ్ ఇంపాక్ట్ టీజర్ లో సౌత్ నార్త్ అంటూ ఏమి ఉండవని ఉన్నది ఒకటే ఇండియా అని బన్నీ చెప్పడం బాగా వైరల్ అయ్యింది. ఫీడ్ బ్యాక్ కూడా బాగానే వచ్చింది. కానీ ఇవాళ ఉదయం గీత ఆర్ట్స్ ఆఫీస్ దగ్గర జరిగిన బన్నీ పుట్టిన రోజు వేడుకల్లో ఏర్పాటు చేసిన బ్యానర్లు కట్ చేయడానికి సిద్ధం చేసిన కేకు మీద సౌత్ ఇండియన్ స్టైలిష్ స్టార్ అంటూ బన్నీని ఉద్దేశించి పెట్టడంతో సరిగ్గా ఆ పాయింట్ దగ్గర నెటిజెన్లు పట్టేసుకున్నారు. ముందు పేరులో సౌత్ ఇండియన్ స్టార్ అనే ట్యాగ్ పెట్టుకుని నార్త్ సౌత్ అంటూ ఏవి లేవని చెబితే ఎలా ఉంటూ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు.

దీని మీద ట్రాలింగ్ ఇమేజెస్ కూడా సిద్ధం చేసేసారు యాంటీ ఫాన్స్. సౌత్ నార్త్ ఒకటే అయినప్పుడు పేరు ముందు మాత్రం సౌత్ స్టార్ అని ఎందుకు పెట్టుకున్నావని ప్రశ్నించారు. నిజానికి ఇందులో అల్లు అర్జున్ ఉద్దేశపూర్వకంగా చేసాడు అని చెప్పలేం. ఎందుకంటే నా పేరు సూర్య కథ పరంగా హీరో క్యారెక్టరేజేషన్ డిమాండ్ మేరకు ఆ డైలాగ్ చెప్పాడు తప్ప బయట ప్రెస్ మీట్ లోనో లేక టీవీ ఛానల్ లోనో అదే పనిగా సౌత్ నార్త్ లేవు అంటూ చెప్పుకోలేదు. ఆ మాటకొస్తే సినిమాల పరంగానే కాదు చాలా విషయాల్లో సౌత్ నార్త్ మధ్య కొన్ని విషయాల్లో భేదాలు ఉంటాయి. అది సహజం. రజనీకాంత్ అంతటివాడిని సైతం కోలీవుడ్ సూపర్ స్టార్ అంటారు కాని ఖాన్ ద్వయాన్ని లేక అమితాబ్ ను మించిన స్టార్ అనరు కదా.

ఏదైతేనేం మరో టాపిక్ దొరికేసరికి దీని మీద పెద్ద చర్చే జరిగింది. మే 4న విడుదల కానున్న నా పేరు సూర్య కోసం బన్నీ కూడా ఎగ్జైటింగ్ గా ఉన్నాడు. కష్టపడి మేకోవర్ చేసుకోవడమే కాక ఫిజికల్ గా కూడా కొత్తగా తీర్చిదిద్దుకున్నాడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ రాయలసీమలో చేసే ఆలోచనలో ఉంది యూనిట్. ఇంకా దానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.