Begin typing your search above and press return to search.

సరైనోడు అలా ఫిక్సయ్యాడు

By:  Tupaki Desk   |   18 March 2016 3:00 PM IST
సరైనోడు అలా ఫిక్సయ్యాడు
X
సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుక ఈ ఆదివారం అంగరంగ వైభవంగా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ‘సర్దార్..’ వచ్చిన రెండు వారాలకే బాక్సాఫీస్ బరిలో దిగబోతున్న ‘సరైనోడు’దే ఇక తర్వాతి వంతు. అల్లు అరవింద్ ఈ విషయంలో పక్కా ప్లానింగ్‌ తోనే ఉన్నాడు. ఏప్రిల్ 3న విశాఖపట్నంలో ఆడియో వేడుక చేయాలని ఆయన ఫిక్సయ్యారు. తెలుగు సినిమాల ఆడియో ఫంక్షన్లు చేస్తే హైదరాబాద్ లో చేస్తారు. లేదంటే విజయవాడకు వెళ్తారు. కానీ అరవింద్ మాత్రం వెరైటీగా సాగర తీరాన్ని ఎంచుకున్నారు. అక్కడ భారీ స్థాయిలో ఆడియో వేడుక నిర్వహించడానికి ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టేశారు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సరైనోడు’లో అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ - కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటించారు. తమన్ సంగీత దర్శకుడు. ఇటీవలే బొలీవియాలో రెండు పాటలు చిత్రీకరించడంతో దాదాపుగా సినిమా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మార్చి చివరికల్లా వర్క్ మొత్తం ఫినిష్ అయిపోతుందని సమాచారం. ఏప్రిల్ 3న ఆడియో వేడుక నిర్వహించి ఆ తర్వాత ప్రమోషన్ మీద దృష్టిపెట్టబోతున్నారు. ఇంతకుముందు బన్నీతో చేసిన హ్యాపీ - బద్రీనాథ్ నిరాశపరిచిన నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్టు కొట్టి తీరాలని పట్టుదలతో ఉన్నాడు అరవింద్. స్క్రిప్టు దగ్గర్నుంచి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాకు రూ.70 కోట్ల దాకా బిజినెస్ జరగడం విశేషం. నెల కిందట రిలీజైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.