Begin typing your search above and press return to search.

తాతగారి సినీఅభిరుచి మా అంద‌రికీ అబ్బింది

By:  Tupaki Desk   |   1 Aug 2021 6:33 AM GMT
తాతగారి సినీఅభిరుచి మా అంద‌రికీ అబ్బింది
X
మెగాస్టార్ త‌న ట్వీట్ లో ఎంతో ఎమోష‌న‌ల్ అయ్యారు. ``అల్లు రామలింగయ్య గారు భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన నేర్పిన జీవితసత్యాలు ఎప్పటికీ మార్గదర్శకంగా వుంటాయి. ఒక డాక్టర్ గా.. యాక్టర్ గా.. ఫిలాసఫర్ గా .. ఓ అద్భుతమైన మనిషిగా.. నాకు మావయ్య గా ఆయన ఎల్లప్పుడూ మా స్మృతుల్లో ఉంటారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలు మరోసారి నెమరువేసుకుంటున్నాం..`` అని తెలిపారు. అల్లు రామ‌లింగ‌య్య ఫోటోని పూల‌మాల‌లో అలంక‌రించి న‌మ‌స్కారం చేస్తున్న ఓ ఫోటోని చిరు షేర్ చేసారు.

``నా తాత అల్లు రామలింగయ్య గారి వర్ధంతి సందర్భంగా న‌మ‌స్సులు. రైతు.. దిగ్గజ నటుడు అయిన తాతగారికి సినిమాలపై ఉన్న‌ అభిరుచి మా అంద‌రికీ అబ్బింది. ఆయన ప్రయాణం మా(అల్లు కుటుంబం)లో చాలా మందికి స్ఫూర్తిదాయకం. ఆయన మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు`` అని బ‌న్ని ఎమోష‌న‌ల్ గా సోష‌ల్ మీడియాల్లో పోస్ట్ చేశారు.

అల్లు రామ‌లింగ‌య్య స్వ‌గ‌తం..

క్లాసిక్ డేస్ తెలుగు సినిమాకి ఆయ‌న ఆది గురువు. హాస్య పాత్రలకు ఔన్నత్యం తెచ్చిన మహానటుడు ఆల్లు రామలింగయ్య. పుట్టిల్లు అనే చిత్రంతో తెలుగు సినీ ఇంట‌ అడుగు పెట్టిన అల్లు అనతి కాలంలోనే తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఆయ‌న పోషించిన‌ ప్రతి పాత్రా ఆణిముత్యమే. అంతగా వాటిలో ఆయన వొదిగి పోయారు. జీవించారు.. అలాగే జీవం పోశారు. ఆయన నటనను విశ్లేషించడానికి మాటలు చాలవు. చిన్న పాత్ర అయినా ఆయన నటన సినిమాకు ప్రాణమే. ముత్యాలముగ్గు.. శంకరాభరణం సినిమాలు చాలు అల్లు ఏమిటో చెప్పడానికి.. త‌న అసామాన్య‌మైన‌ ఆహార్యంతో ఎన్నో సినిమాలకు జీవం పోశారు. ఆ పాత్రలను సజీవంగా నిలిపారు. ప్రతిఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు.

అల్లు అంటే సినీ వెలుగు. హాస్యానికి హరివిల్లు. ఆయన ముఖమే హాస్యానికి చిరునామా. ఏ బావాన్న‌యినా ఇట్టే పలికించగల నటనా వైదుష్యం ఆయనది. చూపులోను నటనే.. నవ్వులోను నటనే. హాస్య నటరాజుగా వెలుగులు తెచ్చిన ప్ర‌ముఖుడు. తెర‌పై ప్రతి భావం పండల్సిందే. పాత్ర మెరవల్సిందే.. అనేది ఆయ‌న ఫిలాస‌ఫీ. ప్రేక్షకుల పొట్ట‌ చెక్కలు కావాల్సిందే అనేంత‌గా న‌వ్వించేవారు.

మరపు రాని నటనా అల్లుది. సినిమాతో పెన వేసుకుని హాస్యంతో అల్లుకు పోయిన తెలుగు సినిమా హాస్య చరిత్రలో ఓ మైలు రాయి. తనివితీరని హాయి. అల్లు అంత‌ర్థాన‌మైనా.. ఆయ‌న‌ మనమధ్య‌ లేకపోవడం ఎమిటి.. ఆయన గుర్తు రాని రోజు వుంటే కదా. నటన నుడికారం వున్నంత వరకు అల్లు ముద్ర వుంటుంది. నటనలో అక్షరాభ్యాయం చేయిస్తూనే వుంటుంది. ఎందుకంటే నవరసాల్లో హాస్య రసానికి ఆయన పెద్దబాల శిక్ష. ఆయన అడుగు జాడల్లో నడవడమే ప్రామాణిక హాస్యానికి రక్ష.