Begin typing your search above and press return to search.

100% మేడ్ ఇన్ ఇండియా మూవీ 'పుష్ప'...!

By:  Tupaki Desk   |   10 May 2020 5:30 PM GMT
100% మేడ్ ఇన్ ఇండియా మూవీ పుష్ప...!
X
ప్రస్తుతం టాలీవుడ్ లో డైలీ ఏదొక న్యూస్ తో సినీ అభిమానుల్లో తిరుగుతూ ఉన్న సినిమా 'పుష్ప'. స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ - అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. బన్నీ - సుక్కు కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో అందరి కళ్ళు ఇప్పుడు ఈ సినిమాపైనే ఉన్నాయి. అంతేకాకుండా 'రంగస్థలం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ రూపొందిస్తున్న సినిమా కావడం.. 'అల వైకుంఠపురంలో' సినిమా తర్వాత బన్నీ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం కేరళ వెళ్లాలని ప్లాన్ చేయగా.. కరోనా వచ్చి అన్నిటిని తారుమారు చేసింది. శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ అంచనాలను పెంచేసింది. రాయలసీమ చిత్తూరు యాస, భాషతో పాటు బన్నీ ఊర మాసు.. మొరటు కుర్రాడిగా కనిపించనున్నాడు. కాగా ఈ సినిమా మన నేటివిటీకి దగ్గరగా సహజత్వం ఉట్టిపడేలా పాత్రలు పండాలంటే లోకల్‌‌ గానే షూటింగ్ చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయ్యిందంట. వీటికి సంబంధించిన కొన్ని విషయాలను ప్రముఖ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేస్తూ.. ''అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా మలచబోతోన్నారు.. పుష్పలో 6 నిమిషాల ఓ యాక్షన్ సీన్ కోసం 6 కోట్లు ఖర్చు పెట్టబోతోన్నారు. అంతేకాకుండా భారత సినీ శ్రామికులకు ఉపాధి కల్పించేందుకు 100 శాతం ఇండియాలోనే షూట్ చేయబోతోన్నారు'' అని తెలిపాడు. దీంతో ఇప్పటి దాకా వస్తున్న రూమర్స్ కొట్టిపడేస్తూ 'పుష్ప' మన లొకేషన్స్ లో తెరకెక్కబోతున్న లోకల్ సినిమా అని అర్థం అవుతోంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. సుక్కు ఆస్థాన సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ 'పుష్ప'కి సంగీతాన్ని అందిస్తున్నారు. 'పుష్ప' సినిమాని తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు. పాన్ ఇండియా మూవీ కావడంతో పలువురు ఇతర ఇండస్ట్రీల నటీనటులు కూడా 'పుష్ప'లో నటిస్తున్నారని సమాచారం. కరోనా లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశాలున్నాయి.