Begin typing your search above and press return to search.
నా అభిమాని మీద చెయ్యేశావో-బన్నీ
By: Tupaki Desk | 23 Oct 2015 11:29 AM GMTపబ్లిక్ లోకి వచ్చి అభిమానులతో డీల్ చేయడం చిన్న విషయం కాదు. సెలబ్రెటీలు కనిపిస్తే ఆగలేరు సామాన్య జనం. అలాంటి సందర్భాల్లో అభిమానంతో మీద పడిపోయేవాళ్ల మీద చిర్రెత్తిపోతుంటారు సెలబ్రెటీలు. కానీ అల్లు అర్జున్ మాత్రం అభిమాని మీద చెయ్యేసిన వ్యక్తిపైన కోపంతో ఊగిపోయాడు. నా అభిమాని మీద చెయ్యేస్తావా అంటూ అతణ్ని కొట్టడానికి దూసుకెళ్లిపోయాడు. దసరా వేడుకల సందర్భంగా బన్నీ తన అత్తారింటికి వెళ్లగా.. అక్కడ ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఎప్పుడూ దసరా వేడుకల్ని హైదరాబాదులోనే చేసుకునే బన్నీ.. ఈ పండక్కి మాత్రం భార్య స్నేహారెడ్డితో కలిసి ఆమె తాతయ్య వాళ్లింటికి వెళ్లాడు. నల్లగొండ జిల్లాలోని చింతపల్లి అనే చిన్న పల్లెటూరులో వేడుకలు చేసుకున్నాడు. బన్నీ ఊర్లోకి వచ్చాడని తెలియగానే ఆ గ్రామస్థులే కాక.. చుట్టుపక్కల ఊళ్ల నుంచి కూడా అభిమానులు భారీ ఎత్తున ఆ ఇంటికి తరలి వచ్చేశారు.
విషయం తెలిసి బన్నీ కూడా భార్యతో కలిసి బయటికొచ్చాడు. అభిమానులందరికీ అభివాదం చేశాడు. వారి ముందు బాణసంచా కాల్చాడు. ఆ తర్వాత అభిమానుల కోరిక మేరకు గోన గన్నారెడ్డి మేనరిజమ్స్ చూపించి.. కొన్ని డైలాగులు కూడా పేల్చాడు. ఈ సందర్భంగా బన్నీతో కరచాలనం చేయడానికి అభిమానులు ఎగబడ్డారు. కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఓ కుర్రాడిని ఓ వ్యక్తి నెట్టేయడానికి చూస్తుంటే బన్నీకి కోపం వచ్చింది. ఆ కుర్రాడి మీద చెయ్యెందుకు వేశావ్, అతణ్నెందుకు నెట్టావ్ అంటూ కోపం తెచ్చుకున్నాడు బన్నీ. ఐతే ఆ వ్యక్తి ఏదో సర్దిచెప్పడంతో వ్యవహారం సద్దుమణిగింది.