Begin typing your search above and press return to search.

కొడుక్కి కాక ఇంకెవరికి పెడతారు బాస్-బన్నీ

By:  Tupaki Desk   |   11 April 2016 7:30 AM GMT
కొడుక్కి కాక ఇంకెవరికి పెడతారు బాస్-బన్నీ
X
గీతా ఆర్ట్స్ గురించి.. తన తండ్రి గురించి చెబితే.. సొంత విషయాలు మాట్లాడుకున్నట్లు అతిగా ఉంటుంది అంటూనే తన తండ్రిని ఆకాశానికి ఎత్తేశాడు అల్లు అర్జున్. తన తండ్రి తనను పెద్ద హీరోని చేయడానికి మొదట్నుంచి కష్టపడుతూనే ఉన్నారని.. తనతో ఎప్పుడు సినిమా చేసినా తన మార్కెట్ ను మించి ఖర్చు పెట్టేస్తున్నారని అన్నాడు బన్నీ. ఇలా అంటూనే.. కొడుక్కి కాకుండా ఇంకెవరికి ఖర్చు పెడతారు బాస్ అంటూ తనదైన శైలిలో చమత్కరించాడు బన్నీ.

‘‘మా నాన్నకు నన్ను పెద్ద హీరోగా చేయాలని కోరిక. అందుకేు నా మార్కెట్ ‘ఎక్స్’గా ఉంటే.. దాని మీద ఓ రూపాయి ఎక్కువే పెడతారు. కానీ కొడుక్కి కాకపోతే ఇంకెవరికి ఖర్చు పెడతారు? నా కోసం.. నన్ను పెద్ద హీరోను చేయడం కోసం.. నా మార్కెట్ పెంచడం కోసం ఎంతో చేస్తున్న ఆయనకు స్టేజ్ మీద ధన్యవాదాలు చెప్పుకుంటున్నా’’ అంటూ వినమ్రంగా చేతులు జోడించాడు బన్నీ. అతనిలా అంటున్నపుడు అల్లు అరవింద్ ముసి ముసి నవ్వులు నవ్వుతూ కనిపించారు.

ఇక తన దర్శకుడు బోయపాటి శ్రీను గురించి బన్నీ చెబుతూ.. ‘‘చాలామంది నాతో అన్నారు.. బోయపాటి కాంబినేషన్లో మీరు సినిమా చేస్తే మంచి క్రేజ్ వస్తుంది. కానీ మీరిద్దరూ కలిసి ఏం చేస్తారు? మీ సినిమాల్లో ఏమో ఫ్యామిలీ.. యూత్ ఫ్లేవర్ ఉంటుంది. కానీ బోయపాటి సినిమాలు మాస్ గా ఉంటాయి అని. కానీ అందరికీ చెబుతున్నా ‘సరైనోడు’ సినిమా చూడండి. మీకే తెలుస్తుంది. బోయపాటి అంటే కేవలం మాస్ కాదు. ఆయనెప్పుడూ హీరోను బట్టి క్యారెక్టర్ డిజైన్ చేస్తారు. ఆయన ఈ సినిమాతో ఆల్ రౌండ్ డైరెక్టర్ అనిపించుకుంటారు. సరైనోడు.. మాస్.. ఊర మాస్.. సినిమానే కాదు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా’’ అని బన్నీ అన్నాడు.