Begin typing your search above and press return to search.

ఆహా ఆఫీస్ ని విజిట్ చేసిన ఐక‌న్ స్టార్

By:  Tupaki Desk   |   20 Aug 2021 2:31 PM GMT
ఆహా ఆఫీస్ ని విజిట్ చేసిన ఐక‌న్ స్టార్
X
లైఫ్ లో ఆహా ఉండాలి! అంటూ అల్లు అర్జున్ చేసిన ప్ర‌చారం గురించి తెలిసిందే. గాళ్ ఫ్రెండ్ తో ఆహా ఎలా ఉండాలో బ్రీఫ్ గానే ఇంట్ర‌డ‌క్ష‌న్ ఇచ్చి మ‌న‌సు దోచాడు బ‌న్ని. ఈ వేదిక కోసం త‌పిస్తూ ఉన్న‌ బాస్ అల్లు అర‌వింద్ సోద‌రుడు శిరీష్ కి బ‌న్ని అండ‌దండ‌లు అంతా ఇంతా కాదు. ఓవైపు ఏఏ బ్రాండ్ ని విస్త‌రిస్తూనే ఆహా ఓటీటీని ప‌రుగులు పెట్టించేందుకు బ‌న్ని చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. ఆహా ఓటీటీ ప్రాంతీయ ఓటీటీల్లోనే ది బెస్ట్ కంటెంట్ తో మెరిపిస్తోంది. దీనికోసం అల్లు అరవింద్ వంద‌ల కోట్ల పెట్టుబ‌డుల్ని వెద‌జ‌ల్లుతూ ఒరిజిన‌ల్ కంటెంట్ ని సృష్టిస్తున్నారు. అలాగే ఇరుగు పొరుగు భాష‌ల్లో విజ‌య‌వంత‌మైన చిత్రాల్ని అనువ‌దిస్తూ తెలుగు వారికి అద్భుత కంటెంట్ ని అందిస్తున్నారు. ఇండ‌స్ట్రీలో ముందు చూపున్న‌ ది గ్రేట్ బిజినెస్ మేన్ గా స‌త్తా చాటుతున్నారు.

ఇక ఆహా కోస‌మేనా? అన్న‌ట్టుగా ఇప్ప‌టికే క‌రోనా రంగ ప్ర‌వేశం చేసి విడిచిపెట్ట‌డం లేదు. మ‌హ‌మ్మారీ థియేట్రిక‌ల్ రంగాన్ని దెబ్బేసినా ఓటీటీల‌కు బాగా క‌లిసొచ్చింది. ఈ రెండు సీజ‌న్ల‌లోనూ ఆహా కావాల్సినంత ఎదిగింది. తెలుగు జ‌నం ఆహాకు అడిక్ట్ అయ్యారు. అమెజాన్ ప్రైమ్.. నెట్ ఫ్లిక్స్ లాంటి కార్పొరెట్ దిగ్గ‌జాలు ఈ రంగంలో ఉన్నా తెలుగు కంటెంట్ ప‌రంగా ఆహాకు ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్కుతోంది.

తాజాగా ఆహా-ఓటీటీ ఆఫీస్ లో స్టైలిష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. ఆయ‌న అలా స్టైల్ గా వైట్ ష‌ర్ట్ బ్లాక్ ఫార్మ‌ల్ ఫ్యాంట్ ధ‌రించి ఆహా అనిపించే లుక్ లో ఆఫీస్ కి రాగానే ఆ ప్రాంగ‌ణం అంతా ఒక్క‌సారిగా తేజోమ‌యం అయ్యింది. బ‌న్ని ఓవైపు పుష్ప చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటూనే చిన్న పాటి గ్యాప్ లో అలా విజిట్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అభిమానుల సోష‌ల్ మీడియాల్లోనూ జోరుగా వైర‌ల్ అవుతోంది.

మినీ సినిమాల‌తో ఇక‌పైనా జోరు

తాజాగా చిన్న నిర్మాణ సంస్థ‌ల నుంచి `ఆహా` కోసం కంటెంట్ ని అదే స్థాయిలో కొనుగోలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. యూవీ క్రియేష‌న్స్ చిన్న సినిమాల నిర్మాణం కోసం యూవీ కాన్సెప్ట్స్ అనే కొత్త బ్యాన‌ర్ ఓపెన్ చేసి మినీ సినిమాల నిర్మాణానికి ప్రాముఖ్య‌త‌నిస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అలాగే ద‌ర్శ‌కుడు మారుతి సొంత బ్యాన‌ర్ `మాస్ మూవీ మేక‌ర్స్` లోనూ ఆహాకు కంటెంట్ రూపొందుతోంది. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా `మంచి రోజులు వ‌చ్చాయి` అనే చిన్న సినిమాని తెర‌కెక్కించి ఆహా కు విక్ర‌యించారు. గోపిచంద్ తో మారుతి తీస్తున్న ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్.. సంతోష్ శోభ‌న్ సినిమాని క‌లిపేసి గంప‌గుత్త‌గా డీల్ కుదిరింద‌ని క‌థ‌నాలొచ్చాయి.

యువితో .. జీఏ2 సంస్థ‌తో మారుతి ఇలాంటి జాయింట్ వెంచ‌ర్ల రూపంలో మ‌రిన్ని చిత్రాల‌ను ఓటీటీ కోసం తెర‌కెక్కిస్తార‌ని స‌మాచారం. నిజానికి ల‌క్ష‌ల్లో బ‌డ్జెట్ తోనే గొప్ప యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ల‌ను తెర‌కెక్కించే స‌మ‌ర్థులైన యువ‌ద‌ర్శ‌కులు మ‌న‌కు కొద‌వేమీ లేదు. అయితే ట్యాలెంట్ ని స‌ద్వినియోగం చేయ‌డంలోనే ఉంది అస‌లు లాజిక్కు. ఇటీవ‌ల ట్యాలెంట్ కి ఆహా ఓటీటీ పెద్ద దారి చూపిస్తోంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా వీక్ష‌ణ‌కు థియేట‌ర్ల‌కు వెళ్లడం ఒక మార్గం అనుకుంటే ఓటీటీల్లో సినిమాలు చూడ‌డం నిరంత‌ర మార్గంగా మారింది. ఈ సూత్రాన్ని బాస్ అర‌వింద్ గ్ర‌హించి తెలివైన పెట్టుబ‌డుల‌తో దిగ్విజయంగా ముందుకు వెళుతున్నారు.