Begin typing your search above and press return to search.

రాళ్లు వేయడానికి ట్రై చేయవద్దు: అల్లు అరవింద్

By:  Tupaki Desk   |   1 Sep 2022 9:30 AM GMT
రాళ్లు వేయడానికి ట్రై చేయవద్దు: అల్లు అరవింద్
X
చిరంజీవి స్వయంకృషితో అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఆయన తోటి వాళ్లంతా ఈ విషయాన్ని ప్రత్యక్షంగా చూస్తూ వచ్చినవారే. అయితే అల్లు రామలింగయ్య కూతురు సురేఖను చిరంజీవి వివాహం చేసుకున్న తరువాత, బావమరిదిగాను .. నిర్మాతగాను చిరంజీవి సాధించిన విజయాల్లో అల్లు అరవింద్ కీలకమైన పాత్రను పోషిస్తూ వచ్చారు. చిరంజీవి దగ్గరికి వచ్చిన కథలను వినడం దగ్గర నుంచి, తన బ్యానర్లో ఘన విజయాలను అందించడం వరకూ అల్లు అరవింద్ ప్రముఖమైన పాత్రను పోషించారు.

చిరంజీవి తన సినిమాలకి సంబంధించిన విషయాల్లో అల్లు అరవింద్ లేకుండా నిర్ణయాలను తీసుకునేవారు కాదని అంటారు. ఆయన ఓకే చెప్పిన తరువాతనే ఆయా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవారని చెబుతారు. చిరంజీవికి వరుస ఫ్లాపులుపడుతూ వచ్చిన ప్రతిసారి, ఆయన కోసం గీతా ఆర్ట్స్ నుంచి ఒక సినిమా వచ్చేది. ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ ను సాధించిన చిరూ, అక్కడి నుంచి మరికొంతకాలం తన ప్రభంజనాన్ని కొనసాసగిస్తూ వెళ్లేవారు. చిరూ కథలపై అల్లు అరవింద్ జడ్జిమెంట్ మెగాస్టార్ చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేసిందనే వారున్నారు.

అటు చరణ్ కీ ... ఇటు బన్నీకి స్టార్ స్టేటస్ వచ్చేవరకూ ఇదే పద్ధతి కొనసాగుతూ వచ్చింది. చరణ్ సొంత బ్యానర్ ను ఏర్పాటు చేయడం .. ఈ బ్యానర్ పై కథల విషయంలో అల్లు అరవింద్ కి ఎలాంటి ప్రాధాన్యతను ఇవ్వకపోవడం .. గీతా ఆర్ట్స్ లో చిరంజీవి సినిమా చేసే అవకాశాన్ని చరణ్ ఇవ్వకపోవడం ఒక కారణమైతే, మెగా ఫ్యామిలీ బ్రాండ్ నుంచి పక్కకి రావడానికి బన్నీ ప్రయత్నించడం .. పవన్ కల్యాణ్ గురించి తాను మాట్లడనని ఒక స్టేజ్ పై కాస్త ఘాటుగానే స్పందించడం .. మెగాస్టార్ అంటూ తన ఫ్యాన్స్ తనని సంభోదిస్తూ ఉంటే ఖండించకపోవడం రెండు కుటుంబాల మధ్య గ్యాప్ పెరగడానికి కారణమనే అభిప్రాయాలు ఉన్నాయి.

ఈ రెండు కుటుంబాల వారు ఈ మధ్య పెద్దగా కలుసుకోవడం లేదనే టాక్ మరింత బలపడుతూ వచ్చింది. చిరంజీవి బర్త్ డే నుంచి ఈ ప్రచారం మరింత వేగాన్ని పుంజుకుంది. మెగా సంబరాలలో అల్లు వారి సందడి కనిపించలేదనే గుసగుసలు వినిపించాయి. సోషల్ మీడియాలో ఇదే టాపిక్ పై చర్చలు నడిచాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అరవింద్ స్పందించారు. "మెగా ఫ్యామిలీతో అల్లు ఫ్యామిలీకి చెడిందని ఎవరికి తోచినట్టుగా వాళ్లు రాస్తున్నారు. కానీ నేను వందశాతం చెప్పగలను .. ఇందులో ఎంతమాత్రం నిజం లేదు. మా రెండు ఫ్యామిలీల మధ్య ఇంతవరకూ ఉంటూ వచ్చిన అనుబంధమే ఇప్పుడూ ఉంది. .. ఇకపై ఉంటుంది కూడా.

రెండు ఫ్యామిలీస్ కి చెందిన పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉంటున్నారు. ఎవరి ప్రత్యేకతను వారు చాటుకుని నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందువలన తరచూ కలుసుకోలేకపోవచ్చు. ఏదైనా సందర్భం వచ్చినప్ప్పుడు మాత్రం మా ఇంటికి వారు ... వాళ్లింటికి మేము వెళ్లి వస్తూనే ఉంటాము.

మా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయనేది కేవలం పుకారు మాత్రమే. ఇది కొంతమంది కావాలని చేస్తున్న ప్రచారం మాత్రమే. పెద్ద ఫ్యామిలీలపై రాళ్లు వేయడానికి కొంతమంది ఎప్పుడూ రెడీగానే ఉంటారు. పనిగట్టుకుని ప్రచారం చేసే అలాంటివారికి ఇంతకంటే వివరంగా చెప్పవలసిన అవసరం లేదేమో" అంటూ తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.