Begin typing your search above and press return to search.

అల్లు వారి కొత్త యాపారం?

By:  Tupaki Desk   |   23 Oct 2019 12:03 PM IST
అల్లు వారి కొత్త యాపారం?
X
ఇటీవలే తన 70వ పుట్టిన రోజును పురస్కరించుకుని టాలీవుడ్ అగ్ర నిర్మాత, మెగా ఫ్యామిలీ పిల్లర్లలో ఒకడైన అల్లు అరవింద్ తన పిల్లలకు ఆస్తి పంపకాలు చేసినట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నిర్మాణ సంస్థ బాధ్యతల్ని ప్రధానంగా తన పెద్ద కొడుకు అల్లు వెంకటేష్ అలియాస్ బాబీ చేతికి అప్పగిస్తున్నట్లుగా గుసగుసలు వినిపించాయి. తన కలల మెగా ప్రాజెక్టు 'రామాయణం'ను అనుకున్నట్లుగా తెరపైకి తీసుకొచ్చి అరవింద్ రిటైర్ అవుతారని కూడా అన్నారు. అయితే తాను కొంచెం వెనక్కి తగ్గి నెమ్మదిగా ప్రొడక్షన్ బాధ్యతల్ని సంతానానికి అప్పగిస్తే అప్పగించొచ్చు కానీ.. అరవింద్ పూర్తిగా సినిమాలకు దూరమవుతాడని మాత్రం అనుకోలేం. అంతటి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ తన అనుభవాన్ని ఉపయోగించకుండా ఉండడు.

ఐతే ప్రొడక్షన్ సంగతి అలా ఉంచితే.. అరవింద్ ఇప్పుడు ఓ కొత్త సినీ వ్యాపారాన్ని మొదలుపెట్టబోతున్నట్లుగా వార్తలొస్తుండటం విశేషం. అమేజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ తరహాలో ఆన్ లైన్ డిజిటల్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్‌ను ఆయన మొదలుపెట్టబోతున్నాడట. మరీ వాటి స్థాయిలో కాదు కానీ.. టాలీవుడ్ రేంజికి తగ్గట్లు ఓ మోస్తరు స్థాయిలోనే ఈ ప్రాజెక్టును అరవింద్ మొదలుపెట్టనున్నట్లు సమాచారం. హిందీలో నిర్మాత ఏక్తా కపూర్ ఇప్పటికే ఇలాంటి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ మొదలుపెట్టింది. భవిష్యత్ డిజిటల్ మీడియందే అన్న అంచనాల నేపథ్యంలో ఇండియాలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌ వేగంగా విస్తరిస్తున్నాయి. మున్ముందు ఇది చాలా పెద్ద బిజినెస్‌గా మారొచ్చన్న అంచనాతో అరవింద్ కూడా టాలీవుడ్ నుంచి మొదటగా ఈ రంగంలోకి అడుగు పెట్టాలని చూస్తున్నారట. మరి ఇదే నిజమైతే ఈ బిజినెస్‌ను ఆయనెలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి.