Begin typing your search above and press return to search.

బిగ్ న్యూస్: డిస్నీ+హాట్ స్టార్ లో 'అల్లు' వారి 'మహాభారతం'

By:  Tupaki Desk   |   10 Sep 2022 7:33 AM GMT
బిగ్ న్యూస్: డిస్నీ+హాట్ స్టార్ లో అల్లు వారి మహాభారతం
X
పురాతన భారతీయ ఇతిహాసం 'మహాభారతం' ఆధారంగా ఇప్పటికే అనేక భాషల్లో సినిమాలు తెరకెక్కాయి. హిందువులకు పంచమ వేదంగా పరిగణించే మహాభారతంలోని అధ్యాయాలను తీసుకొని వివిధ పేర్లతో సినిమాలు చేశారు. ఎన్ని చిత్రాలు తీసినా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు.

ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత భారీ బడ్జెట్ తో మహాభారతాన్ని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు కొందరు ఫిలిం మేకర్స్. అయితే ఇంతవరకూ ఎవరూ మొత్తం భారతాన్ని తెరపైన చూపించలేకపోయారు. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ డిస్నీ + హాట్ స్టార్ ఆ దిశగా అడుగులు వేస్తోంది.

కాలిఫోర్నియాలోని అనాహైమ్‌ లో జరుగుతున్న డిస్నీ D23 ఎక్స్‌పోలో శుక్రవారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ ప్రకటన చేసింది. తమ అత్యంత ప్రతిష్టాత్మక అతిపెద్ద ప్రాజెక్ట్‌ "మహాభారతం" ను అధికారికంగా ప్రకటించింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా ఈ బిగ్ ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నారు.

బాలీవుడ్ నిర్మాత మధు మంతెన మైథోవర్స్ స్టూడియోస్ మరియు అల్లు ఎంటర్‌టైన్‌మెంట్‌ లతో కలిసి ఈ ప్రాజెక్ట్‌ ను రూపొందించనున్నారు. "గ్రేటెస్ట్ ఇతిహాసం- మునుపెన్నడూ చూడని స్థాయిలో తిరిగి చెప్పబడుతుంది!. ఒక అద్భుతమైన దృశ్యం కోసం చూస్తూ ఉండండి. 'మహాభారత్' త్వరలో రాబోతోంది" అని డిస్నీ హాట్ స్టార్ పేర్కొంది. ఈ సందర్భంగా మహాభారతం ఆర్ట్ వర్క్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకుంది.

"మహాభారతం" ఇతిహాసాన్ని వెబ్ సిరీస్ గా మలచడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇన్నాళ్లకు అది ధృవీకరించబడింది. దాదాపు 2500 కోట్ల బడ్జెట్ తో భారీ స్థాయిలో విజువల్ వండర్ గా ఈ సిరీస్ ను నిర్మించనున్నారని టాక్.

తెలుగు హిందీ ఇంగ్లీష్ లతో పాటుగా పలు ఇతర ప్రధాన భారతీయ భాషల్లో ఈ సిరీస్ ని రూపొందించనున్నారట. స్టార్ క్యాస్టింగ్ - అగ్రశ్రేణి సాంకేతిక బృందం ఈ ప్రాజెక్ట్ లో భాగం కానున్నారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో 'మహాభారతం' ను డీల్ చేసే దర్శకుడు మరియు లీడ్ యాక్టర్స్ ను ప్రకటించనున్నారు.

ఇకపోతే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సైతం మహా భారతాన్ని డ్రీమ్ ప్రాజెక్ట్ గా పేర్కొన్నారు. ఎప్పటికైనా ఈ ఎపిక్ డ్రామాని బిగ్ స్క్రీన్ మీదకు తీసుకొస్తానని చెబుతూ వస్తున్నారు. అయితే అంతకంటే ముందే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'మహాభారతం' ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది.

నిజానికి నిర్మాతలు అల్లు అరవింద్ - మధు మంతెన గతంలో 'రామాయణం' ఇతిహాసాన్ని రూపొందించనున్నట్లు ప్రకటించారు. బాలీవుడ్ డైరెక్టర్స్ తో కలిసి మూడు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఎందుకనో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ళలేదు. కానీ ఇప్పుడు 'రామాయణం' పక్కనపెట్టి 'మహాభారతం' బాధ్యత తీసుకున్నారు. ఈ సిరీస్ ఓటీటీ వరల్డ్ లో ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.