Begin typing your search above and press return to search.

RRR.. అల్లూరి ఫ్యామిలీకి ఇది ముందే చెప్పారుగా!

By:  Tupaki Desk   |   6 March 2022 7:44 AM GMT
RRR.. అల్లూరి ఫ్యామిలీకి ఇది ముందే చెప్పారుగా!
X
ఇటీవ‌లి కాలంలో రిలీజ్ ముంగిట డైల‌మాలు కోర్టు గొడ‌వ‌లు వ‌గైరా భారీ పాన్ ఇండియా సినిమాల‌కు ఇబ్బందిక‌రంగా మారుతున్న సంగ‌తి తెలిసిందే. ఇంత‌కుముందు సంజ‌య్ లీలా భ‌న్సాలీ ప‌ద్మావ‌త్ కి ఈ త‌ర‌హా ఇబ్బంది ఎదురైంది. చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించారంటూ రాజ్ పుత్ లు ఈ మూవీ రిలీజ్ ని వ్య‌తిరేకించారు.

ఆ త‌ర్వాత తెలుగులో చిరంజీవి న‌టించిన సైరా-న‌ర‌సింహారెడ్డి రిలీజ్ ని న‌ర‌సింహారెడ్డి కుటుంబీకులు అడ్డుకున్నారు. చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించార‌ని ఆరోపిస్తూ చిరు ఇంటి ముందే ధ‌ర్నా చేశారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు చరిత్ర లోని యోధుల క‌థ‌తో రూపొందుతున్న ఆర్.ఆర్.ఆర్ కి ఇలాంటి ముప్పు ఎదురైంది. స్వాతంత్య్ర సమరయోధులు - అల్లూరి సీతారామ రాజు.. కొమరం భీమ్‌ల జీవితం నుండి ప్రేరణ పొందిన కల్పిత కథతో ఆర్.ఆర్.ఆర్ తెర‌కెక్కి విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.

ఈ చిత్రం స్వాతంత్య్రానికి పూర్వం 1920ల నాటి భారతదేశంలోని వీరుల క‌థ‌తో తెర‌కెక్కింది. RRRలో రామ్ చరణ్ .. ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన స్వాతంత్య్ర‌ సమరయోధుడు అల్లూరి సీతారామ రాజు పాత్ర‌లో న‌టించ‌గా .. తెలంగాణకు చెందిన కొమరం భీమ్ గా తార‌క్ న‌టించారు. ఆ ఇద్ద‌రు వీరుల‌ యువ రూపాలలో వారు అభిన‌యించారు.

సంచ‌ల‌నాల విప్ల‌వ‌వీరుడు.. నిజమైన దేశభక్తుడు అల్లూరి సీతారామ రాజు కుటుంబ సభ్యులు ఇప్పుడు మీడియా వేదిక‌గా RRR చిత్రంపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. భారీ పాన్ ఇండియా చిత్రం విడుదలకు ముందే ఇబ్బందుల్లో పడటం చాలా దురదృష్టకరం .. అల్లూరి బంధువులు అల్లూరి సీతారామ రాజు పరువు తీశారని ఆరోపించడం ద్వారా ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌పై విరుచుకుపడ్డారు.

ఇది అల్లూరి కుటుంబ సభ్యులు తిరిగి చెప్పడానికి ఆసక్తిగా ఉన్న కథ కాదని వాదిస్తున్నారు. తారక్ .. చరణ్ ల ఫ‌స్ట్ లుక్ ఫోటోలు వచ్చిన క్షణం నుండి ఇంటర్నెట్ లో క్యూరియాసిటీ రాజుకుంది. కానీ మేకర్స్ మాత్రం లాభం కోసం అల్లూరి గుర్తింపును దొంగిలిస్తున్నారని కుటుంబ సభ్యులు అంటున్నారు.

అల్లూరి సీతారామ రాజు మేనల్లుడు RRR ట్రైలర్ లో చూపించిన మూడు ప్రత్యేక సన్నివేశాల సంవిధానంలో నిజం లేద‌ని ఆరోపిస్తున్నారు. అల్లూరిని బ్రిటీష్ వారి కోసం పనిచేస్తున్న పోలీసుగా చిత్రీకరించారని ఆయన ఎత్తిచూపారు. కొమరం భీమ్ ని అరెస్టు చేయడం మరో తప్పు. వాస్తవానికి ఎలాంటి సంబంధం లేని ఈ ఇద్దరు వీరులు కలిసి ఉద్య‌మం కోసం పోరాడారంటూ చిత్రీకరించడాన్ని అల్లూరి కుటుంబ సభ్యులు తప్పుబట్టారు.

ట్రైలర్ లో చూపించిన అటువంటి సంఘటనలకు చారిత్ర‌క ఆధారాలు లేవు. ఇద్దరు వీరులు ఎప్పుడూ కలుసుకోలేదు... అని వాదిస్తున్నారు. ``మీ ఊహలను రుద్దడం .. అల్లూరి సీతారామరాజును పోలీసు అధికారిగా చూపించడం చాలా తప్పు. ప్రపంచానికి తెలియని వాటిని చూపించండి. లేనిది కాదు`` అని అతని వారసులను ఉటంకించారు.

అయితే ఇప్పుడు కుటుంబ స‌భ్యుల ఆరోప‌ణ‌లు రాక మునుపే.. ఈ మూవీని తెర‌కెక్కించేందుకు సెట్స్ కి వెళుతున్న క్ర‌మంలో ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి .. ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఆర్.ఆర్.ఆర్ హిస్ట‌రీ నుంచి స్ఫూర్తి పొందిన క‌ల్పిత క‌థ‌తో రూపొందుతుంద‌ని స్ప‌ష్ఠంగా చెప్పారు.

1920 నాటి నేపథ్యంలో భారతదేశంలోని బ్రిటిష్ వారితో పోరాడిన ఇద్దరు తిరుగుబాటుదారుల బాల్యం య‌వ్వ‌నంలోని జీవితాన్ని తెర‌పైకి తెస్తున్నామ‌ని.. అయితే ఆ ఇద్ద‌రూ క‌లిసార‌న్న‌ది క‌ల్పిత‌మ‌ని కూడా అప్పుడే చెప్పారు.

ఈ సినిమా క‌థ‌ను ఏనాడూ జ‌క్క‌న్న దాచ‌లేదు. నిజ క‌థ‌కు ఊహ‌ను జోడించామ‌ని చాలా క్లారిటీగా ఆనాడే చెప్పారు. ఆ విష‌యం అప్ప‌టి పార్క్ హ‌య‌త్ ప్రెస్ మీట్ ని యూట్యూబ్ లో ప‌రిశీలిస్తే అర్థ‌మ‌వుతుంది.
ప్రెస్ మీట్ సందర్భంగా రాజమౌళి ఈ చిత్రం గురించి చెప్పాడు. ది మోటార్ సైకిల్ డైరీస్ (2004) .. RRR స్ఫూర్తితో విప్లవకారులు అల్లూరి సీతారామ రాజు .. కొమరం భీమ్ లు అడ్డదిడ్డంగా మారే అవకాశాలను అన్వేషించే కల్పిత కథ అంటూ త‌ర్వాత కూడా క‌థ‌నాలు వ‌చ్చాయి.

దేశం కోసం పోరాడిన తమ పూర్వీకుల చరిత్రను ఈ భారీ బడ్జెట్ చిత్రంతో తెరపైకి తీసుకురావడం విశేషం. అయితే చారిత్రక వాస్తవాల చిత్రణ పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. తప్పుగా పేర్కొన్న వాస్తవాలను మేము అంగీకరించము అని అల్లూరి కుటుంబీకులు ఖండించారు.

సినిమాను విడుదలకు ముందే చూపించాలని లేకుంటే లీగల్ గా వెళ్తామని కుటుంబ సభ్యులు మేకర్స్ ని డిమాండ్ చేశారు. ఈ సినిమా ద్వారా చూపబడిన తప్పుదారి పట్టించే లేదా చారిత్రక విరుద్ధమైన వాస్తవాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే క‌ల్పిత క‌థ‌తో తీస్తున్నామ‌ని సినిమా సెట్స్ కెళ్ల‌క ముందే రాజ‌మౌళి టీమ్ ప్ర‌క‌టించింది. అప్పుడు ఎలాంటి అభ్యంత‌రాలు చెప్ప‌ని అల్లూరి ఫ్యామిలీ ఇప్పుడే ఎందుకు అభ్యంత‌రం లేవ‌నెత్తిన‌ట్టు? అంటూ కొంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.