Begin typing your search above and press return to search.

నాగ్ వద్దనలేదు.. నేనే తప్పుకున్నా

By:  Tupaki Desk   |   13 Aug 2015 10:47 PM GMT
నాగ్ వద్దనలేదు.. నేనే తప్పుకున్నా
X
నాగార్జునను పెళ్లాడే సమయానికి అమల బిజీ హీరోయిన్. ఇటు తెలుగు, అటు తమిళంలో మాత్రమే కాదు దక్షిణాది భాషలన్నింట్లో ఆమె ఫుల్ బిజీ. పెళ్లి తర్వాత కూడా ఆమె ఓకే అంటే సినిమాలు తీయడానికి అప్పట్లో చాలామంది దర్శక నిర్మాతలు రెడీగా ఉన్నారు. పెళ్లయ్యాక ఆమె ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ అమల ఓకే చేయలేదు. ఐతే పెళ్లి తర్వాత నటించకూడదని నాగ్ షరతులేమీ పెట్టలేదని.. నటనకు గుడ్ బై చెప్పాలన్నది తన నిర్ణయమే అని అమల ఓ ఇంటర్వ్యలో చెప్పింది. ‘‘నేను 13 ఏళ్ల వయసు నుంచే నాట్య ప్రదర్శనల కోసం దేశమంతా తిరగడం మొదలుపెట్టా. విదేశాలకూ వెళ్లా. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి తీరిక లేకుండా గడిపా. దశాబ్దంన్నర పాటు తీరిక లేకుండా పని చేసి అలసిపోయా. నాగార్జునతో పెళ్లవగానే నేను రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నా. సినిమాలకు దూరంగా ఉండనా.. అని నేనే అడిగా. ఆయన నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అన్నారు. అలా కొంత కాలం రెస్ట్ తీసుకుందాం అనుకుంటే.. అలా 20 ఏళ్లు గ్యాప్ వచ్చేసింది’’ అని అమల చెప్పారు.

జంతువులపై ప్రేమ పెంచుకోవడం.. రెడ్ క్రాస్ సొసైటీ కోసం పని చేయడం గురించి మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పుడు రోడ్డుపై ఓ కాకి రెక్కలు తెగి పడి ఉంటే తీసుకుని ఇంటికెళ్లా. సాధారణంగా అలాంటి పని చేస్తే అమ్మానాన్న తిడతారు. కానీ మా అమ్మ ప్రేమగా ఆ కాకిని దగ్గరికి తీసుకుని దానికి ఫస్ట్ ఎయిడ్ చేసింది. దాన్ని ఎలా చూసుకోవాలో చెప్పింది. అప్పుడే నాకు జంతువులపై ప్రేమ పుట్టింది. పెళ్లయి హైదరాబాద్ లో స్థిరపడ్డాక రోడ్డు మీద కుక్కో, గేదో గాయపడి ఉంటే నాకు మనసు చలించేది. అలా గాయపడ్డ జంతువులు ఒక్కోదాన్ని ఇంటికి తీసుకురావడం మొదలుపెట్టా. మా ఇంటి ఆవరణంతా వాటితోనే నిండిపోయింది. ఓసారి నాగ్ కారు పార్క్ చేయడానికి వెళ్తే అక్కడ ఓ గేదె ఉంది. ఆయనేం కోపం తెచ్చుకోలేదు. కారు రోడ్డు మీద పార్క్ చేసి.. వచ్చి ఇలాంటి ఎన్ని జీవాల్ని ఇంట్లో పెట్టుకుంటాం. దీని కోసం ఏదైనా వేరే ఏర్పాటు చేయొచ్చు కదా అన్నారు. ఆయనిచ్చిన ఐడియాతో రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటు దిశగా అడుగులేశాను. ఇన్నేళ్లోలో కొన్ని లక్షల మూగజీవాల్ని కాపాడానన్న సంతృప్తి ఉంది’’ అని అమల చెప్పింది.