Begin typing your search above and press return to search.

'ఇంతందంగా'.. 'గుడ్‌ లక్‌ సఖి' నుండి అద్భుతమైన మెలోడీ..!

By:  Tupaki Desk   |   2 Dec 2021 1:30 PM GMT
ఇంతందంగా.. గుడ్‌ లక్‌ సఖి నుండి అద్భుతమైన మెలోడీ..!
X
కీర్తి సురేష్ - ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో రూపొందిన తాజా చిత్రం ''గుడ్ లక్ సఖి''. ఓ గ్రామీణ యువతి అంతర్జాతీయ షూటర్‌ గా ఎలా మారిందనే కథాంశంతో ఈ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కుతోంది. ఇందులో కీర్తి రైఫిల్‌ షూటర్‌ గా కనిపించనుంది. కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని ఎట్టకేలకు డిసెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - 'బ్యాడ్ లక్ సఖీ' సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'గుడ్ లక్ సఖి' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా 'ఇంతందంగా' అనే మరో పాటను చిత్ర బృందం విడుదల చేసింది. 'ఓ రంగురంగు రెక్కలున్న సీతాకోక చిలుకల్లే చెంగు చెంగు మంటాందే మనసు.. తొంగి తొంగి చూసేటి మబ్బు సాటు మెరుపల్లే పొంగి పొంగి పోతాందే మనసు..' అంటూ సాగిన ఈ గీతం శ్రోతలను అలరిస్తోంది. ఇందులోని బంజారా లిరిక్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ 'ఇంతందంగా' పాటకు స్వరాలు సమకూర్చడమే కాకుండా.. స్వయంగా పాడారు. బంజారా సాకీని మంగిలి ఆలపించారు. గేయ రచయిత శ్రీమణి ఈ గీతానికి సాహిత్యం అందించగా.. కమల్ ఎస్లవత్ బంజారా లిరిక్స్ రాశారు. ఈ సాంగ్ కు విజయ్ బిన్నీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. కీర్తి సురేష్ వేసిన సింపుల్ స్టెప్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో కీర్తి - ఆది పినిశెట్టి ఇద్దరూ పల్లెటూరి యువతీయువకులుగా అలరించారు.

కాగా, విలక్షణ దర్శకుడు నగేష్ కుకునూర్ తెరకెక్కిస్తోన్న 'గుడ్ లక్ సఖి' చిత్రాన్ని తెలుగు తమిళ మలయాళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిరంతాన్ దాస్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు. దిల్ రాజ్ సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై సుధీర్ చంద్ర ఈ సినిమాని నిర్మించారు. శ్రావ్యా వర్మ దీనికి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.