Begin typing your search above and press return to search.

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చిన 'సర్కారు వారి పాట'..!

By:  Tupaki Desk   |   2 Jun 2022 8:30 AM GMT
సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చిన సర్కారు వారి పాట..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు - మహానటి కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ''సర్కారు వారి పాట''. పరశురాం పెట్లా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. 12 రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్ లోకి చేరి ప్రాంతీయ చిత్రాల్లో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు.

నేటితో 'సర్కారు వారి పాట' సినిమా మూడు వారాల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో 'మురారి బావ' అనే మాస్ మెలోడీని అదనంగా జత చేసినట్లు చిత్ర బృందం బుధవారం తెలిపారు. లాంగ్ రన్ లో మరిన్ని కలెక్షన్స్ రాబట్టాలనే మేకర్స్ ఈ ప్లాన్ చేశారని అందరూ భావించారు. అయితే ఇప్పుడు సైలెంట్ గా మహేష్ సినిమాని ఓటీటీలోకి తీసుకురావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇటీవల కాలంలో ఎంత పెద్ద హీరో సినిమా అయినా మూడు లేదా నాలుగు వారాల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 'పుష్ప' 'రాధేశ్యామ్' 'ఆచార్య' వంటి సినిమాలు మూడు వారాల్లోనే డిజిటల్ వేదిక మీదకు వచ్చేస్తే.. 'ఆర్.ఆర్.ఆర్' వంటి భారీ చిత్రం 50 రోజులకు ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ క్రమంలో 'సర్కారు వారి పాట' సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి కూడా వార్తలు వచ్చాయి.

SVP డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్యాన్సీ రేటుకి దక్కించుకుంది. నెల రోజుల థియేట్రికల్ రన్ తర్వాత అంటే జూన్ 10 లేదా జూన్ 24న ఓటీటీ రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు అంతకంటే ముందుగానే ఈరోజు నుంచే ప్రైమ్ వీడియో మహేశ్ సినిమాని స్ట్రీమింగ్ కి తీసుకొచ్చింది.

కాకపోతే 'సర్కారు వారి పాట' ను అందరికీ అందుబాటులోకి తీసుకురాలేదు. పే పర్ వ్యూ రెంటల్ విధానంలో ఈ చిత్రాన్ని డిజిటల్ రిలీజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో సాధారణ సబ్ స్క్రిప్షన్ కలిగివున్న వినియోగదారులు.. అదనంగా డబ్బులు చెల్లించి ఈ సినిమా చూడాల్సి ఉంటుంది.

ఇటీవల 'కేజీఎఫ్: చాప్టర్ 2' చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో ఇలానే పే పర్ వ్యూ మోడల్ లో స్ట్రీమింగ్ చేశారు. కొన్ని రోజుల తర్వాత సాధారణ సబ్ స్క్రైబర్స్ అందరికీ అందుబాటులో ఉంచారు. ఇప్పుడు 'సర్కారు వారి పాట' సినిమాకి కూడా ఇదే ఫాలో అవుతున్నారని అర్థం అవుతుంది. ఇంకా థియేటర్లలో ప్రదర్శించబడుతున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి.

కాగా, ప్రస్తుత బ్యాంకింగ్ వ్యవస్థ నేపథ్యంలో ఆర్ధిక నేరగాళ్లు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని ఎగ్గొడితే.. అది లోన్లు తీసుకున్న సామాన్యుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది 'సర్కారు వారి పాట' సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. ఇందులో మహేష్ - కీర్తి లతో పాటుగా సముద్రఖని - నదియా - సుబ్బరాజు - బ్రహ్మాజీ - వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటించారు.

మైత్రీ మూవీ మేకర్స్ - GMB ఎంటర్టైన్మెంట్ - 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో SVP చిత్రాన్ని నిర్మించారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చగా ఆర్ మాది సినిమాటోగ్రఫీ అందించారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వర్క్ చేశారు.