Begin typing your search above and press return to search.

స్టార్ సరదా ట్వీట్లు డబ్బులు తెచ్చిపెట్టాయి

By:  Tupaki Desk   |   17 April 2019 4:53 AM GMT
స్టార్ సరదా ట్వీట్లు డబ్బులు తెచ్చిపెట్టాయి
X
బిగ్ బి అమితాబ్ బచ్చన్ షూటింగ్స్ పరంగా ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియా వాడకంలో ఆయన్ని మించిన వారు ఎవరూ లేరని చెప్పొచ్చు. తన ఫాలోయర్స్ తగ్గిపోతున్నారని ట్విట్టర్ ని బెదిరించినా మంచి సినిమా హిట్ అయితే మీకు నోరు పెగలదా అంటూ తోటి నటీనటులను గదమాయించినా ఆయనకే చెల్లింది. అందుకే బచ్చన్ ట్వీట్స్ ని ఇష్టపడే వాళ్ళు కోట్లలో ఉంటారు.

ఇటీవల ఆయన నటించిన బదలా ఈ ఏడాది టాప్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. తాప్సి కీలక పాత్రలో అమితాబ్ లాయర్ గా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ 80 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఔరా అనిపించింది. దీని నిర్మాత షారుఖ్ ఖాన్. ఇటీవలే అమితాబ్ దీని గురించి ప్రస్తావిస్తూ ప్రొడ్యూసర్ సినిమా ఇంత పెద్ద హిట్ అయినా తనకు బోనస్ కానీ పార్టీ కానీ ఏమి ఇవ్వలేదని ఇదెక్కడి విడ్డూరం అంటూ సరదాగా ట్వీట్ చేశాడు

దానికి స్పందించిన షారుఖ్ మీ సినిమా మీ వల్ల ఆడితే మధ్యలో నేను చేసేది ఏముందంటూ మంచి కౌంటర్ ఇచ్చాడు. అంతే కాదు మీరే రివర్స్ లో పార్టీ ఇవ్వాలని ఇంటి బయట ఎదురు చూస్తుంటామని బదులిచ్చాడు. దానికి ధీటుగా బిగ్ బి కూడా సమాధానాల ప్రహసనం కొనసాగించారు. అయితే ఇప్పుడిది కొత్త మలుపు తిరిగింది. అమితాబ్ తమాషాగా అన్నా వచ్చిన లాభాల్లో అమితాబ్ తో పాటు దర్శకుడు సుజయ్ ఘోష్ కు అదనంగా వాటా ఇవ్వాలనే ఆలోచనలో షారుఖ్ ఉన్నట్టు బాలీవుడ్ ఫ్రెష్ అప్ డేట్.

అమితాబ్ అనే బ్రాండ్ లేకపోతే బదలాకు ఇంత ప్రమోషన్ జరిగేది కాదని ఇంత మంది చూసేవారు కాదన్న అభిప్రాయంతో ఏకీభవిస్తూ ఈ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. చూశారా సరదా ట్వీట్లు అప్పుడప్పుడు ఇలా లక్ష్మి దేవిని కూడా ఇంటికి తెస్తాయన్న మాట. ఏమైనా బిగ్ బి అనుభవంలోనే కాదు తెలివితేటల్లో కూడా సీనియర్ అని నిరూపించేశారు