Begin typing your search above and press return to search.

`ప‌ఠాన్` కి మ‌ద్ద‌తుగా అమితాబ్ వ్యాఖ్య‌లు!

By:  Tupaki Desk   |   16 Dec 2022 12:30 PM GMT
`ప‌ఠాన్` కి మ‌ద్ద‌తుగా అమితాబ్ వ్యాఖ్య‌లు!
X
దేశ వ్యాప్తంగా బాలీవుడ్ న‌టి దీపికా ప‌దుకొణే ధ‌రించిన బికినీ పై ఏ రేంజ్ లో చ‌ర్చ సాగుతుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ప‌ట్ట‌ణం నుంచి ప‌ల్లె వ‌ర‌కూ దీపిక‌పై బికినీ హాట్ టాపిక్ గా మారింది. `ప‌ఠాన్` వివాదంలో భాగంగా తెర‌పైకి వ‌చ్చిన అంశం అటుపై షారుక్ దిష్టిబొమ్మల్ని త‌గ‌ల‌బెట్టే వ‌ర‌కూ వెళ్లింది. దీపిక బికినీ రంగు బీజేపీలో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. కాషాయ వీరులంతా దీపిక‌పై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

మా పార్టీ జెండా రంగు మీకు బికినీలా ప‌నికొస్తుందా? అంటూ మండిప‌డుతున్నారు. ఈవేడిలో తాజాగా కొల్ క‌త్తా అంత‌ర్జాతీయ ఫిలిం పెస్టివ‌ల్స్ లో పాల్గొన్న బాలీవుడ్ లెజెండ్ అమితాబ‌చ్చ‌న్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా పెద్ద దుమారం రేపుతున్నాయి. ఇంత‌కీ ఆయ‌న ఏమ‌న్నారంటే?.. ఇప్ప‌టికీ పౌర హ‌క్కులు..భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ పై ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయ‌ని అన్నారు. స‌రిగ్గా ప‌ఠాన్ వివాదం జ‌రుగుతోన్న స‌మ‌యంలో అమితాబ్ ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం రెండు పార్టీల నాయ‌కులు త‌న్నుకున్నంత స‌న్నివేశం క్రియేట్ చేసింది.

అమితాబ్ ఆ వ్యాఖ్య‌లు చేసిన స‌మ‌యంలో రాష్ర్ట ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కూడా అక్క‌డే ఉన్నారు. ఈ వ్యాఖ్యాల‌పై బీజేపీ ఐటీ విభాగం హెడ్ అమిత్ మాల్వియా స్పందిస్తూ.. మ‌మ‌తా బెనర్జీ వేదిక‌పై ఉండ‌గా...అమితాబ‌చ్ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌వ‌చ‌నాత్మ‌కంగా ఉండ‌వు. నిరంకుశుల‌కు అద్దం ప‌ట్టిన‌ట్లుగానే ఉంటాయి అని..బెంగాల్ ప్రీతిష్ట‌ను మ‌మ‌తా బెన‌ర్జీని దిగ‌జారుస్తున్నార‌ని` ఉద్దేశించి కామెంట్ చేసారు.

దీంతో తృణ‌మూల్ ఎంపీ నుశ్ర‌త్ జ‌హాన్ ట్విట‌ర్ లో అంతే ధీటుగా బ‌ధులిచ్చారు. సినిమాల‌పై నిషేధం విధించ‌డం... జ‌ర్న‌లిస్టుల ను నిర్భంధించ‌డం..నిజం మాట్లాడినందుకు సామాన్యుల‌ను శిక్షించ‌డం.. ఇవే నిరంకుశ పాల‌న‌కు సంకేతాలు. భావ వ్య‌క్తీక‌ర‌ణ స్వేచ్ఛ‌పై ప‌రిమితిలు విధించ‌డం కూడా ఆ పాల‌న‌కు నిద‌ర్శ‌న‌మే. ఇదంతా బీజేపీ హ‌యాంలోనే జ‌రుగుతోంది.

కానీ అమిత్ మాల్వియా మాత్రం ఇత‌రుల‌ను నిందించ‌డంలో బిజీగా ఉన్నార‌ని స్పందించారు. ఆర‌కంగా అమితాబ‌చ్చ‌న్ వ్యాఖ్య‌లు రెండు పార్టీల మ‌ధ్య చిచ్చు రేపాయి. అలాగే ఈ వ్యాఖ్య‌లు ప‌ఠాన్ కి మ‌ద్దతుగానే క‌నిపిస్తున్నాయి. మ‌రి `ప‌ఠాన్` వివాదం సినిమా రిలీజ్ అయ్యే లోపు ఇంకెంత దూరం వెళ్తుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.