Begin typing your search above and press return to search.

బిగ్ బీ పెద్ద‌మ‌న‌సు: వల‌స కార్మికుల త‌‌ర‌లింపున‌కు మూడు విమానాలు బుక్‌

By:  Tupaki Desk   |   10 Jun 2020 5:00 PM GMT
బిగ్ బీ పెద్ద‌మ‌న‌సు: వల‌స కార్మికుల త‌‌ర‌లింపున‌కు మూడు విమానాలు బుక్‌
X
మ‌హ‌మ్మారి వైర‌స్ ప్ర‌భావంతో దాని క‌ట్ట‌డి కోసం విధించిన‌దే లాక్‌డౌన్. ఈ లాక్‌డౌన్‌తో పేద‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా వలస కార్మికులు త‌ట్టాబుట్టా స‌ర్దుకుని త‌మ సొంత ప్రాంతాల‌కు అలుపెరుగ‌ని బాట‌సారులుగా పాద‌యాత్ర‌గా వెళ్తున్న ప‌రిణామాలు భార‌త‌దేశాన్ని క‌ల‌వ‌రానికి గురి చేసింది. అలాంటి వారికి సెల‌బ్రిటీలు కొంత‌లో కొంత ఉప‌శ‌మ‌నం క‌లిగించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే సోనుసూద్ త‌న‌కు తోచిన విధంగా స‌హాయం చేస్తూ మొత్తం దేశం దృష్టిని ఆక‌ర్షించాడు. ఇప్పుడు అదే మాదిరి బాలీవుడ్ బిగ్‌బాస్ అమితాబ్‌ బచ్చన్ ముందుకువ‌చ్చారు. వ‌ల‌స కార్మికుల‌ను సొంత ప్రాంతాల‌కు త‌ర‌లించేందుకు ఏకంగా మూడు విమానాల‌ను బుక్ చేశార‌ని స‌మాచారం.

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన దాదాపు 500 మంది కార్మికులను మూడు విమానాల్లో తరలించేందుకు బాలీవుడ్ మెగాస్టార్‌ టికెట్లు బుక్‌ చేశారని ఆయన సన్నిహితులు బుధవారం తెలిపారు. ప్ర‌స్తుతం వ‌స్తున్న వార్త‌ల‌ ప్రకారం.. వలస కార్మికుల కష్టాలు చూసి అమితాబ్ మ‌న‌సు క‌రిగిపోయి వారికోసం ఏదైనా చేయాలని నిశ్చ‌యించుకున్నారు. ఆ క్ర‌మంలోనే మొత్తం 180 మంది వ‌ల‌స కార్మికుల‌ను వారణాసికి తరలించేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానంలో టికెట్లు బుక్‌ చేశారని తెలిసింది. ఆ విమానం బుధ‌వారం ఉదయం బయల్దేరిందని స‌న్నిహితులు ఓ మీడియాకు తెలిపారు. వలస కార్మికులు పొద్దున ఆరు గంటలకే అక్కడికి చేరుకున్నారని చెప్పారు. వారిని త‌ర‌లించేందుకు రైళ్లు అనుకోగా, అది కుద‌ర‌క‌పోవ‌డంతో మొత్తం 500 మందిని మూడు విమానాల్లో త‌ర‌లిస్తున్న‌ట్లు వివ‌రించారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని వారణాసితో పాటు పశ్చిమ బెంగాల్‌, బిహార్‌, తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల వలస కార్మికులను తరలించేందుకు అమితాబాబ్ ఏర్పాట్లు చేస్తున్నారని బాలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తున్న వార్త‌. అయితే అంత‌కుముందే వారం కింద‌ట ముంబై నుంచి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు వలస కార్మికులను 10 బస్సుల్లో తరలించినట్లు తెలిసింది. బిగ్ బీ స‌హాయ కార్య‌క్ర‌మాలు చేస్తుంటారు. కానీ ఎక్కువ‌గా ప్ర‌చారం చేసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌రు. గ‌తంలో రైతులకు ఆర్థిక సాయం చేయ‌డ‌మే కాకుండా వారి అప్పులను తీర్చారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు భారీ సాయం అందించారు.