Begin typing your search above and press return to search.

ఎవ‌ర్ గ్రీన్ ల‌వ్ స్టోరీకి 20 ఏళ్లు!

By:  Tupaki Desk   |   10 Oct 2022 3:52 PM GMT
ఎవ‌ర్ గ్రీన్ ల‌వ్ స్టోరీకి 20 ఏళ్లు!
X
కొన్ని ప్రేమ‌క‌థ‌లు ఇప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్ ల‌వ్ స్టోరీస్ గా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానాన్ని ఏర్ప‌ర‌చుకుని ఇప్ప‌టికీ గుర్తొస్తూనే వుంటాయి. అలాంటి ప్రేమ‌క‌థ‌ల్లో ల‌వ‌ర్ బాయ్ త‌రుణ్‌, శ్రియ జంట‌గా న‌టించిన రొమాంటిక్ ల‌వ్ స్టోరీ `నువ్వే నువ్వే` ఒక‌టి. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ స్రవంతి మూవీస్ బ్యాన‌ర్ పై స్ర‌వంతి ర‌వికిషోర్ నిర్మించిన ఈ మూవీ విడుద‌లై స‌రిగ్గా ఈ అక్టోబ‌ర్ 10కి 20 ఏళ్లు పూర్త‌య్యాయి.

2012 అక్టోబ‌ర్ 10న విడుద‌లై త‌రుణ్ కెరీర్ లోనే మ్యూజిక‌ల్ హిట్ గా నిలిచింది. కోటి సంగీతం అందించిన ఈ సినిమాలోని పాట‌లు ఇప్ప‌టికీ ఎక్క‌డో ఓ చోట ఆటోల్లోనూ.. వినిపిస్తూ గుర్తు చేస్తుంటాయి. ఇందులో శ్రియ‌కు తండ్రిగా విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ న‌టించ‌గా త‌రుణ్ కు తండ్రిగా జోవియ‌ల్ పాత్ర‌లో చంద్ర‌మోహ‌న్‌, సుధ‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, ధ‌ర్మ వ‌ర‌పు సుబ్ర‌హ్మ‌ణ్యం, ఎమ్మెస్ నారాయ‌ణ‌, రాజీవ్ క‌న‌కాల‌, సునీల్ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు.

నువ్వే కావాలి, స్వ‌యంవ‌రం, చిరున‌వ్వుతో, నువ్వునాకు న‌చ్చావ్ వంటి సినిమాల‌తో మాట‌ల మాంత్రికుడిగా ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న త్రివిక్ర‌మ్ ఈ మూవీతో తొలిసారి మెగా ఫోన్ ప‌ట్టారు. ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు.

తొలి సినిమాతో ద‌ర్శ‌కుడిగా స‌త్తా చాటిన త్ర‌విక్ర‌మ్ ఈ మూవీ త‌రువాత ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఈ సినిమాలోనూ త్రివిక్ర‌మ్ క‌లంతో మెస్మ‌రైజ్ చేశారు. ఇప్ప‌టికీ ఈ మూవీలోని డైలాగ్ లు యూట్యూబ్ లో, సోష‌ల్ మీడియాలో ఎక్క‌డో ఒ చోట వినిపిస్తూనే వున్నాయి.

అమ్మ‌..ఆవ‌కాయ్.. అంజ‌లి..ఎప్పుడూ బోర్ కొట్ట‌వు.. తాజ్ మ‌హ‌ల్‌.. చార్మినార్‌.. నా లాంటి కుర్రాడు చూడ‌టానికే కొన‌డానికి మీలాంటి వాళ్లు స‌రిపోరు`అంటూ త‌రుణ్ చెప్పే డైలాగ్ లు ఇప్ప‌టికీ వినిపిస్తూనే వుంటాయి. ఇక కోటి అందించిన పాట‌లు కూడా యూత్ కి ఎవ‌ర్ గ్రీన్ హిట్స్ గా నిలిచి ఇప్ప‌టికీ రింగ్ టోన్స్ గా, ఫేవ‌రేట్ ఆల్బ‌మ్ గా నిలిచిపోయింది. `కంప్యూట‌ర్లు... నా మ‌న‌సుకేమ‌యింది..నువ్వే నువ్వే కావాలంటుంది.. ఐయామ్ వెరీ సారీ.. అమ్మాయి న‌చ్చేసింది.. నిద్దుర పోతున్న రాతిరిన‌డిగా.. అంటూ సాగే పాటలు ఇప్ప‌టికీ వినిపిస్తూనే వున్నాయి.

ప్రేమ, ఫ్యామిలీ ఎమోష‌న్స్ కు వినోదాన్ని జోడించి ఓ తండ్రీ కూతుళ్లు అనుబంధం నేప‌థ్యంలో త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన మూవీ ఇది. కూతురిపై తండ్రి ప్రేమ‌..ఆ ప్రేమ‌ని మ‌రిపించే ప్రేమికుడు.. అయినా స‌రే తండ్రి మాట‌ని జ‌వ‌దాట‌లేక‌.. ప్రియుడిపై ప్రేమ‌ని చంపుకోలేక ఇద్ద‌రి మ‌ధ్య న‌లిగే యువ‌తి క‌థ‌గా చ‌క్క‌ని భావోద్వేగాల స‌మాహారంగా ఈ సినిమాని తెర‌పై చ‌క్క‌గా ఆవిష్క‌రించారు. ఆ కార‌ణంగానే ఓ అంద‌మైన ప్రేమ‌క‌థాగా రూపొందిన ఈ మూవీ ఇప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్ ల‌వ్ స్టోరీస్ లో ఒక‌టిగా నిలిచి ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.