Begin typing your search above and press return to search.

'అమ్ము' ట్రైలర్: భర్తకు బుద్ధి చెప్పడానికి భార్య చేసిన పోరాటం..!

By:  Tupaki Desk   |   11 Oct 2022 8:34 AM GMT
అమ్ము ట్రైలర్: భర్తకు బుద్ధి చెప్పడానికి భార్య చేసిన పోరాటం..!
X
ఐశ్వర్య లక్ష్మి - నవీన్‌ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం "అమ్ము". ఇందులో సింహా కీలక పాత్రలో నటించారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ వదిలిన టీజర్ ఆకట్టుకోగా.. ఈరోజు ఆసక్తికరమైన ట్రైలర్ తో వచ్చారు.

'అమ్మూ.. నువ్వు నిజంగానే పక్కింటి రవి అంకుల్ ని పెళ్లి చేస్తుకుంటున్నవా? నీకు అతను నచ్చాడా?' అని ఓ పాప అడగ్గా.. 'నచ్చాడనే అనుకుంటున్నాను' అని ఐశ్వర్య లక్ష్మీ చెప్పే వాయిస్ ఓవర్ తో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. మంచి భర్త దొరకాలని.. అతనితో సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కలలు గనే మధ్యతరగతి అమ్మాయి అమ్ము.

ఎన్నో ఆశలతో పోలీసాఫీసర్ అయిన రవి (నవీన్ చంద్ర) ని అమ్ము వివాహం చేసుకుంది. వివాహం అనేది ఒక అద్భుత కథ అని నమ్మిన అమ్ము లైఫ్ లో ఏదీ సరిగ్గా జరగడం లేదు. కొన్నాళ్ల పాటు భార్యాభర్తలు అన్యోన్యంగా కాపురం చేసినప్పటికీ.. కోపిష్ఠి పోలీసైన రవి కారణంగా గొడవలు మొదలయ్యాయి.

ఈ క్రమంలో చీటికీ మాటికీ అమ్ము మీద అతను చెయ్యి చేసుకోవడంతో సమస్య తీవ్ర స్థాయికి వెళుతుంది. రవి వైఖరితో విసిగిపోయిన అమ్ము.. తన మనసు ముక్కలు చేసి తీవ్ర వేదనకు గురి చేసిన భర్తపై తిరిగి పోరాడాలని నిర్ణయించుకుంది. తన భర్తకు బుద్ధి చెప్పాలని.. ఆయనెంతో అందరికీ తెలిసేలా చేయాలని.. లైఫ్ లో ఇంకెవరి మీదా చెయ్యి ఎత్తకుండా చేయాలని డిసైడ్ అవుతుంది.

ఇక్కడ ట్విస్టు ఏమిటంటే, అమ్ము తన భర్తకు గుణపాఠం చెప్పడానికి పోలీసు డిపార్ట్‌మెంట్‌ ను ఉపయోగిస్తుంది. అలానే ఓ ఖైదీ (సింహా) సహాయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమ్ము ఎదుర్కొన్న పరిస్థితులేంటి? తన భర్తకు గుణపాఠం చెప్పిందా లేదా? ఆమె జీవిత పోరాటం ఎలా ముగిసింది? అనేది తెలియాలంటే 'అమ్ము' సినిమా చూడాల్సిందే.

ఇందులో కోపిష్ఠి అయిన టఫ్ పోలీస్ గా నవీన్ చంద్ర ఆకట్టుకున్నాడు. మధ్యతరగతి యువతిగా.. భర్త చిత్రహింసలు భరించే సగటు భార్యగా ఐశ్వర్య లక్ష్మీ ఎమోషనల్ పెర్ఫార్మన్స్ తో మెప్పించింది. 'గాడ్సే' సినిమాతో తెలుగులో ప్లాప్ అందుకున్న ఐశ్వర్య.. ఈసారైనా హిట్టు దక్కుతుందేమో చూడాలి.

"అమ్ము" చిత్రానికి చారుకేష్ శేఖర్ దర్శకత్వం వహించారు. కల్యాణ్‌ సుబ్రహ్మణ్యం మరియు కార్తికేయ సంతానం సంయుక్తంగా నిర్మించారు. అక్టోబర్‌ 19న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబోతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.