Begin typing your search above and press return to search.

విల‌క్ష‌ణ న‌టుడు అమ్రీష్ పూరీ బ‌యోపిక్

By:  Tupaki Desk   |   9 Dec 2022 4:31 AM GMT
విల‌క్ష‌ణ న‌టుడు అమ్రీష్ పూరీ బ‌యోపిక్
X
విలక్షణ నటుడు అమ్రీష్ పూరిపై బయోపిక్ తెర‌కెక్క‌నుందా? అంటే అవున‌నే స‌మాచారం. దివంగ‌త న‌టుడిపై మనవడు వర్ధన్ పూరి సినిమా తీయబోతున్నారు. ''అమ్రిష్ పూరి- నామ్ తో సునా హాయ్ హోగా'' అనేది టైటిల్. మ‌రిన్ని వివ‌రాల్లోకి వెళితే..

దేశ‌వ్యాప్తంగా అత్యంత పాపులారిటీ ఉన్న న‌టుడిగా అమ్రిష్ పురి సుప‌రిచితులు. అత‌డు విల‌న్ గా న‌టించిన‌ సినిమాల‌న్నీ బాగా ఆడాయి. అమ్రిష్ భారతీయ సినిమాకి చేసిన సేవ‌లు అస‌మానం. మిస్టర్ ఇండియా- కోయిలా- కరణ్ అర్జున్- దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే వంటి మరపురాని చిత్రాల్లో ఆయ‌న న‌ట‌న అద్భుతం.

వీట‌న్నిటినీ మించి అత‌డు తెలుగు ప్రేక్ష‌కుల్లోను విప‌రీత‌మైన ఆద‌ర‌ణ అభిమానం ద‌క్కించుకున్నారు. 90ల‌లో మెగాస్టార్ చిరంజీవి న‌టించిన కొండ‌వీటి దొంగ - జగ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో విల‌న్ గా త‌న‌దైన విల‌క్ష‌ణ న‌ట‌న ఆహార్యంతో ఆక‌ట్టుకున్నారు. చిరు పాత్ర‌తో నువ్వా నేనా? అంటూ ఢీకొట్టే విల‌న్ గా న‌టించి మెగాభిమానుల మెప్పును పొందారు.

నిజానికి అమ్రిష్ పూరీని చూసాక విల‌న్ అంటే ఇలా ఉండాలి అని ఎవ‌రైనా అంగీక‌రించాల్సిందే. నెగెటివ్ పాత్ర‌ల్లో అతని డామినేటింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ - భీక‌ర‌మైన స్వ‌రం అతడికి గొప్ప‌ పాపులారిటీని తెచ్చి పెట్టాయి. నాటి రోజుల్లో విల‌న్ అంటే ఇలా ఉండాలి అని చ‌ర్చించుకునేంత‌గా ప్ర‌భావితం చేసారు. ప్ర‌తిసారీ ఏదో ఒక కొత్త‌ద‌నాన్ని ప‌రిచయం చేసి ఫిల్మ్ ఇండస్ట్రీలోని గొప్ప విలన్ లలో ఒకరిగా చ‌రిత్ర సృష్టించారు. 1987 శేఖర్ కపూర్ బ్లాక్ బస్టర్ చిత్రం 'మిస్టర్ ఇండియా'లో భయంకరమైన మొగాంబో పాత్ర‌లో న‌టించారు. ఆయన గురించి తలచుకున్నప్పుడల్లా ''మొగాంబో ఖుష్ హువా'' ఇప్పటికీ అంద‌రి మదిలో ప్రతిధ్వనిస్తుంది. ఆ త‌ర్వాత ఆయ‌న మ‌ర‌ణం ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటుగా మారింది.కానీ చాలా కాలానికి మొగాంబో అభిమానులందరికీ శుభవార్త అందింది.

అమ్రిష్ పూరి జీవిత చరిత్రను ప్ర‌స్తుతం వెండితెర‌కెక్కిస్తున్నారు. ఆయ‌న సినిమాల్లో క‌నిపించే దానికి భిన్నంగా ఎంతో గొప్ప‌ వ్యక్తిత్వం ఉన్న ఆద‌ర్శ‌పురుషుడిగా ప‌రిశ్ర‌మ‌లోను వ్య‌క్తిగ‌త జీవితంలోను పేరు తెచ్చుకున్నారు. అత‌డు అమరత్వం పొందేందుకు అర్హమైన జీవితాన్ని గడిపినందున త‌న‌పై బయోపిక్ తెర‌కెక్కించ‌డం గొప్ప ఆలోచ‌న అన్న అభిప్రాయం అభిమానుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. ముంబై మీడియా సోర్స్ ప్ర‌కారం.. మనవడు వర్ధన్ పూరి తన దివంగ‌త‌ తాతగారైన అమ్రిష్ పూరిపై బయోపిక్ తీయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ''దేశంలో అత్యంత ఇష్టమైన విలన్ పై బయోపిక్ ఇది. ఇటీవ‌లే పని ప్రారంభమైంది..'' అని వ‌ర్ధ‌న్ వెల్ల‌డించారు.

మొగాంబో పాత్ర‌తోనే కాదు.. షారూక్‌- కాజోల్ జంట న‌టించిన సంచ‌ల‌న చిత్రం 'దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే'లో క‌థానాయిక తండ్రి బల్దేవ్ సింగ్ పాత్రలో అమ్రిష్ పూరి తన ఇతర పాత్రలకు సమానంగా ప్రశంసలు అందుకున్నాడు. 1995లో విడుదలైన కరణ్ అర్జున్ లో దిగ్గజ నటుడు దుర్జన్ సింగ్ గా నటించాడు. విజేత-ఘటక్-చోరీ చోరీ చుప్కే చుప్కే-ముఝే కుచ్ కెహనా హై-జూత్ బోలే కౌవా కాటే వంటి చిత్రాలలో అద్భుత న‌ట‌న‌కు ప్రశంసలు అందుకున్నారు. 1967 మరియు 2005 మధ్య అమ్రిష్ పూరి నటుడిగా 450కి పైగా సినిమాల్లో కనిపించారు. అమ్రిష్ పూరి 12 జనవరి 2005న తుది శ్వాస విడిచారు. అతను 27 డిసెంబర్ 2004న హిందూజా ఆసుపత్రిలో చేరిన తర్వాత బ్లడ్ క్యాన్సర్ లో అరుదైన రూపమైన మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ (మెదడుకి) కు శస్త్రచికిత్స చేయించుకున్నాడు.

వర్ధన్ పూరి ఎవరు?అమ్రిష్ పూరి మనవడు వర్ధన్ పూరి కూడా నటుడే. అతడు 'యే సాలి ఆషికి' (2019)తో తెరంగేట్రం చేసాడు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇదే కాకుండా వర్ధన్ పూరి తదుపరి దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి 'నౌతంకి'లో.... అనుపమ్ ఖేర్- సతీష్ కౌశిక్- పల్లవి జోషితో కలిసి నటించనున్నారు. అతను జియో స్టూడియోస్ తో రెండు చిత్రాలు చేస్తున్నాడు. వీటిలో ఒక‌దానికి కునాల్ కోహ్లీ దర్శకత్వం వహించ‌గా.. మరొకటి సరిమ్ మోమిన్ - ఎండెమోల్ షైన్ తో క‌లిసి ఒక సైకలాజికల్ థ్రిల్లర్ చేయాల్సి ఉంది. దీనితో పాటు, అతను ప్రస్తుతం ఒక ప్రముఖ స్టూడియో నిర్మంచే చిత్రంలో న‌టిస్తాడు. జాతీయ అవార్డు-విజేత దర్శకుడు శంతను అనంత్ తాంబే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా షూటింగ్ సాగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.