Begin typing your search above and press return to search.

ఈమెకు రాజుగాడైనా బ్రేకిస్తాడా??

By:  Tupaki Desk   |   14 April 2018 5:17 AM GMT
ఈమెకు రాజుగాడైనా బ్రేకిస్తాడా??
X
టాలీవుడ్ లో సత్తా చాటేందుకు ముంబై భామ అమైరా దస్తూర్ బాగానే కష్టపడుతోంది. కొన్నేళ్లుగా ఈమెను టాలీవుడ్ లో దించడం గురించి వార్తలు వస్తుండగా.. ఇప్పటికి యంగ్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తోంది. సందీప్ కిషన్ హీరోగా.. ఘట్టమనేని మంజుల దర్శకత్వంలో రూపొందిన మనసుకు నచ్చింది చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేసింది అమైరా.

కానీ ఈ చిత్రం ఫ్లాప్ కావడంతో.. తెలుగు సినీ పరిశ్రమలో కుదురుకునే ఛాన్స్ దక్కలేదు. కానీ అప్పటికే మరో తెలుగు సినిమాను కూడా చేస్తోంది అమైరా దస్తూర్. రాజ్ తరుణ్ హీరోగా సంజనా రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న రాజుగాడు చిత్రంలో ఈమె హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ఈ చిత్రం ద్వారా సక్సెస్ అందుకుని తెలుగులో పాతుకుపోవాలన్నది ఈమె ఆలోచన. అందుకోసం సుదీర్ఘ కాలంపాటే ఈ చిత్రానికి డేట్స్ కేటాయించింది. ఇక్కడ షూటింగ్ చేసినన్ని రోజులు.. ప్యాకప్ చెప్పగానే.. రోజుకో రకం చొప్పున హైద్రాబాదీ స్పెషల్ ఫుడ్ ఐటెమ్స్ ను లాగించేసేదాన్నని చెప్పింది అమైరా.

టాలీవుడ్ లో అమైరా సెటిల్ కావాలంటే మే 11న విడుదలకు షెడ్యూల్ అయిన రాజు గాడు సక్సెస్ కావడం చాలా ముఖ్యం. మరోవైపు.. రాజ్ తరుణ్ కూడా ఇప్పుడు కచ్చితంగా మంచి హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన రంగుల రాట్నం నిరాశపరచగా.. గతేడాదికూడా చెప్పుకోదగ్గ హిట్ ఏదీ ఈ హీరోకు దక్కలేదు. అందుకే రాజుగాడు పై అమైరాతో పాటు రాజ్ తరుణ్ కూడా చాలానే హోప్స్ పెట్టుకున్నాడు.