Begin typing your search above and press return to search.

నయన్ సినిమాకు అరుదైన గౌరవం

By:  Tupaki Desk   |   16 Nov 2017 7:25 AM GMT
నయన్ సినిమాకు అరుదైన గౌరవం
X
గత శుక్రవారం తమిళంలో రిలీజైన నయనతార సినిమా ‘అరామ్’కు చాలా మంచి రివ్యూలు వచ్చాయి. అందుకు తగ్గట్లే కలెక్షన్లు కూడా బాగా వస్తున్నాయి ఈ సినిమాకు. ‘అరామ్’ గురించి నెగెటివ్‌గా మాట్లాడిన వాళ్లే లేరు. ఎవరు చూసినా ఈ సినిమా అద్భుతమనే అంటున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ వెబ్ సైట్లన్నీ 5కు 3.25 నుంచి 4 మధ్య రేటింగ్స్ ఇచ్చాయి. ఐతే ఇవన్నీ ఒకెత్తయితే తమిళ సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మక భావించే ‘ఆనంద విగటన్’ మ్యాగజైన్ ఈ చిత్రానికి 100కు 60 మార్కులివ్వడం ఇప్పుడు కోలీవుడ్లో చర్చనీయాంశమవుతోంది. కోలీవుడ్ జనాలందరూ ఈ మ్యాగజైన్ రేటింగ్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారు.

దశాబ్దాల చరిత్ర ఉన్న ‘ఆనంద విగటన్’ గొప్ప గొప్ప సినిమాలకు కూడా 50 మార్కులు ఇవ్వడం కష్టం. ఇప్పటిదాకా తమిళ సినీ చరిత్రలో ఆ మ్యాగజైన్ 60 అంత కంటే ఎక్కువ మార్కులు ఇచ్చిన సినిమాలు 8 మాత్రమే. నయనతార సినిమా తొమ్మిదోది కావడం విశేషం. ‘ఆనంద విగటన్’ అత్యధిక మార్కులు ఇచ్చిన సినిమా భారతీరాజా తీసిన ‘16 వయదినిలే’ (పదహారేళ్ల వయసు ఒరిజినల్). దానికి 62.5 మార్కులు దక్కాయి. ఆ తర్వాత ‘ముల్లు మలరుమ్’ 61 మార్కులతో రెండో స్థానంలో ఉంది. గత ఏడాది ధనుష్ నిర్మాణంలో వచ్చిన ‘విసారణై’ కూడా 61 మార్కులు తెచ్చుకుంది. అది కాక కమల్ సినిమాలు ‘హేరామ్’, ‘నాయగన్’, ‘మహానది’లకు కూడా 61 మార్కుల గౌరవం దక్కింది. ‘ఉదిరిపూకల్’ అనే సినిమా కూడా 61 మార్కులు తెచ్చుకుంది. రెండేళ్ల కిందట ధనుష్ నిర్మాణంలోనే వచ్చిన ‘కాకాముట్టై’కి 60 మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఈ ఘనత సాధించిన సినిమా ‘అరామ్’యే కావడం విశేషం.