Begin typing your search above and press return to search.

రష్మి.. అనసూయ నాగబాబుకు థ్యాంక్స్ చెప్పారుగా!

By:  Tupaki Desk   |   4 Feb 2019 4:01 PM GMT
రష్మి.. అనసూయ నాగబాబుకు థ్యాంక్స్ చెప్పారుగా!
X
మహిళల వస్త్రధారణ ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని కట్టుబాట్లు దాదాపు ప్రతి సమాజంలోనూ ఉన్నాయి. కానీ మారిన పరిస్థితులకనుగుణంగా వారి వస్త్రధారణలో కూడా మార్పులొచ్చాయి. కానీ ఈ మార్పులను కొంతమంది సంప్రదాయవాదులు అంగీకరించరు. మహిళలు ఫలానావిధంగా దుస్తులు వేసుకోవాల్సిందే అని ఈ సంప్రదాయవాదులు చెప్తారు.దానికి సపోర్ట్ గా దేశంలో మహిళలపై జరుగుతున్నా నేరాలకు కారణం ఈ పాశ్చాత్య వస్త్రధారణ అని వాదిస్తారు. సరిగ్గా ఈ విషయంపైనే మన మెగా ఫైర్ బ్రాండ్ నాగబాబు స్పందించారు.

ఈ సమాజం మీద.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద తన అభిప్రాయాలను తన యూట్యూబ్ ఛానల్ లో 'నాయిష్టం' అంటూ వెల్లడిస్తున్నారాయన. తాజాగా మహిళల వస్త్రధారణపై ఒక వీడియో పోస్ట్ చేశారు. అమ్మాయిలకు.. మహిళలకు తమకు నచ్చిన దుస్తులు వేసుకొనే హక్కు ఉంటుందని.. అది ఎక్స్ పోజింగ్ అయినా లేదా సంప్రదాయంగా ఉన్నా.. ఎలా అయినా అది వారిష్టం అన్నారు. మగవాళ్ళను ఇలా దుస్తులు వేసుకోండి అని మహిళలు రూల్స్ పెట్టనప్పుడు.. మగవాళ్ళు ఆడవాళ్లకు ఎందుకు రూల్స్ పెడుతున్నారని ప్రశ్నించాడు. మారాల్సింది వారి వస్త్రధారణ కాదని.. మగవాళ్ళ నీచమైన బుద్ది అని మండిపడ్డారు. ఒకవేళ మహిళలు తమ పరిధి దాటి నగ్నంగా తిరిగితే వాళ్ళను కంట్రోల్ చేయడానికి చట్టాలున్నాయని.. అందుకని వాళ్ళ వస్త్రధారణపై ఊరికే ఆంక్షలు పెట్టే బూజుపట్టిన సంప్రదాయాలను వదిలిపెట్టాలని సూచించారు.

ఈ నాగబాబు వీడియో కు భారీ స్పందన దక్కుతోంది. ఈ వీడియోపై ప్రముఖ యాంకర్లు రష్మి గౌతమ్.. అనసూయ భరద్వాజ్ లు స్పందించారు. అనసూయ తన ట్విట్టర్ ఖాతా ద్వారా నాగబాబు వీడియోను షేర్ చేసి.. "మీ పట్ల గౌరవం పెరిగింది నాగబాబు సర్" అని ట్వీట్ చేశారు. మరోవైపు రష్మి కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా నాగబాబు వీడియో షేర్ చేసి "ఆడవారైనా మగవారైనా.. కేవలం వారు పైన వేసుకునే దుస్తులను బట్టి కాకుండా వారి టాలెంట్ ను బట్టి చూడండి. ఒక పుస్తకాన్ని కవర్ ను బట్టి జడ్జ్ చేయడం సరికాదు. నాగబాబు గారు మాకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు" అంటూ ట్వీట్ చేసింది.