Begin typing your search above and press return to search.

అనసూయ నోట మాటరాని క్షణం

By:  Tupaki Desk   |   5 July 2017 12:40 PM IST
అనసూయ నోట మాటరాని క్షణం
X
ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ.. తన మాటలతో మాయ చేసి మెప్పించడం టీవీ యాంకర్ అనసూయకు కొత్తేం కాదు. అలాంటి అనసూయను మాట్లాడమన్నా పెదవి విప్పి ఒక్క మాట చెప్పలేక నిశ్శబ్దంగా నిలుచుండిపోయిందంటే అస్సలు నమ్మబుద్ధి కాదు. ఓపెన్ డయాస్ పై బ్రహ్మాండంగా మాట్లాడగలిగే అనసూయకు కంటినిండా నీటితో నోటివెంట మాటే రాని క్షణం ఎదురైంది. అదీ ఆమె రీసెంట్ గా చేసిన క్షణం సినిమా వల్లే.

యాంకర్ గా టీవీల్లో ఎంతో పాపులరైన అనసూయ క్షణం సినిమాలో లేడి పోలీస్ ఆఫీసర్ పాత్ర చేసింది. ముందు సాఫ్ట్ గా కనిపిస్తూ చివరకు నెగిటివ్ గా మారే పాత్ర ఇది. దీనికి గాను సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) లో ఆమెకు బెస్ట్ ఫీమేల్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు లభించింది. అనసూయ జీవితంలో అందుకున్న తొలి సినిమా అవార్డు ఇదే కావడం విశేషం. జ్యూరీ ఆమె పేరు అనౌన్స్ చేయగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయింది. స్టేజీ పైకి వచ్చేసరికి ఆమె కళ్లన్నీ ఆనందంతో తడిసిపోయాయి. అవార్డు అందుకోవడంపై మీ ప్రతిస్పందన ఏమిటని ఈ ప్రోగ్రాంకు హోస్ట్ చేసిన ఆలీ ఆమెను అడిగినా ఆమె నోటి వెంట మాట రాలేదు. తన ఫీలింగ్ మొత్తం కళ్లతోనే చూపించింది.

సినిమా ఫీల్డ్ లో గుర్తింపు తెచ్చుకోవాలన్న అనసూయ తపనకు క్షణంతో గుర్తింపు లభించింది. అందుకే ఈ అవార్డు అందుకున్న క్షణాన అంతగా కదిలిపోయింది. కొన్నిసార్లు అంతే.. మనసు ఆనందంతో నిండిపోతే పెదవి అంచుల్లో ఉన్న మాట కూడా బయటకు రాదు. ఆ ఫీలింగ్ ఏంటో ఇప్పుడు అనసూయకు బాగానే తెలిసింది. ఏమైనా అనసూయ సినిమాల్లో ఇంకా షైన్ అవ్వాలంటే ఆమె ఖాతాలో ఓ బిగ్ హిట్ పడాలి. అందుకు తగ్గ ఉత్సాహం ఈ అవార్డుతో లభించే ఉంటుందని ఆశిద్దాం.