Begin typing your search above and press return to search.

వైరల్ పిక్: 'పుష్ప' నుంచి అనసూయ లుక్ లీక్..!

By:  Tupaki Desk   |   5 Aug 2021 7:00 PM IST
వైరల్ పిక్: పుష్ప నుంచి అనసూయ లుక్ లీక్..!
X
అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ''పుష్ప''. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గంధపు చెక్కల అక్రమ రవాణా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో యాంకర్ అనసూయ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తోందని.. సుక్కూ ఆ క్యారక్టర్ ని చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశారని టాక్ ఉంది. ఈ క్రమంలో లేటెస్టుగా 'పుష్ప' చిత్రంలో అనసూయ లుక్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు లీకై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

'పుష్ప' లో అనసూయ పాత్ర గురించి ఇన్నాళ్లూ వస్తున్న వార్తలన్నీ నిజమే అని ఈ ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో న్యూ లుక్ లో కనిపిస్తున్న అనసూయ.. నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకొని, ఒంటి నిండా నగలు ధరించి ఉంది. 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు కూడా ఈ పిక్ లో కనిపిస్తున్నాడు. మొత్తం మీద 'రంగస్థలం' సినిమాలో అనసూయకు రంగమ్మత్త వంటి మంచి పాత్ర ఇచ్చిన సుకుమార్.. 'పుష్ప' చిత్రంలో ఆమె కెరీర్ లోనే గుర్తుండి పోయే ప్రాధాన్యత ఉన్న రోల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫోటో ద్వారా డైరెక్టర్ బుచ్చిబాబు కూడా తన గురువు చిత్రానికి తనవంతు సహాయం చేస్తున్నాడనే విషయం స్పష్టం అవుతోంది.

ఇకపోతే 'పుష్ప' చిత్రంలో విలన్ గా నటిస్తున్న సునీల్ భారీగా అనసూయ కనిపించనుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఇందులో గ్లామరస్ యాంకర్ చిత్తూరు యాసలో డైలాగ్స్ పలకనుందట. ఇప్పటికే ఆమెకు సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. ఇప్పుడు బయటకు వచ్చిన పిక్ కూడా ఆ సందర్భంగా తీసినదే అని తెలుస్తోంది. మరి పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న 'పుష్ప' సినిమా అనసూయకు ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుందో చూడాలి.

కాగా, బుల్లితెరపై యాంకర్ గా హవా కొనసాగిస్తున్న అనసూయ.. వెండితెరపై కూడా సత్తా చాటుతోంది. 'క్షణం' 'కథనం' 'ఎఫ్ 2' 'సోగ్గాడే చిన్నినాయనా' 'రంగస్థలం' 'మీకుమాత్రమే చెప్తా' 'థాంక్ యు బ్రదర్' వంటి చిత్రాలతో మెప్పించింది. ప్రస్తుతం 'ఖిలాడి' 'రంగమార్తాండ' 'ది చేజ్' సినిమాలలో నటిస్తోంది. ఈ క్రమంలో 'పుష్ప' లో నటిస్తోంది. 'పుష్ప: ది రైజ్' సినిమా క్రిస్మస్ కానుకగా 2021 డిసెంబర్ లో విడుదల కానుంది. ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక హీరోయిన్ గా కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.