Begin typing your search above and press return to search.

మీడియా యాంగిల్ ఏమిటో చెప్పేసిన రంగ‌మ్మ‌త్త‌!

By:  Tupaki Desk   |   5 April 2018 11:33 AM IST
మీడియా యాంగిల్ ఏమిటో చెప్పేసిన రంగ‌మ్మ‌త్త‌!
X
కొంత‌మంది సెల‌బ్రిటీల‌కు.. న‌టుల‌కు మీడియా ఒక ప‌ట్టాన న‌చ్చ‌దు. త‌మ‌ను అనునిత్యం పొగ‌డాలే కానీ.. చిన్న త‌ప్పును కూడా ఎత్తి చూపించొద్దంటారు. ఏ మీడియా కార‌ణంగా ఇమేజ్ సంపాదించుకుంటారో.. అదే మీడియా మీద చిర్రుబుర్రులాడుతుంటారు. తమ‌లాంటి తోపుల్ని త‌క్కువ చేస్తుందా? అంటూ క‌న్నెర్ర కూడా చేస్తుంటారు.

అయితే.. మీడియాకు త‌ర త‌మ భేదాలేమీ ఉండ‌వ‌ని.. త‌ప్పు చేస్తే ఎత్తి చూపించ‌టం.. మంచి చేస్తే దాన్ని అభినందించ‌టం అల‌వాటే. కొంద‌రు సెల‌బ్రిటీలు.. ప్ర‌ముఖ‌ల మాదిరి ఎప్పుడూ చిర్రుబుర్రులాడ‌టం తెలీదు. ఆ విష‌యం రంగ‌మ్మ‌త్త‌.. అదేనండి మ‌న అన‌సూయ‌కు అర్థ‌మైపోయింద‌ట‌.

బుల్లితెర మీద నాలుగు మాట‌లు చెప్పుకుంటూ షోలు చేసేసుకునే అన‌సూయ‌కు గ్లామ‌ర్ వ‌చ్చిందంటే అది మీడియా.. సోష‌ల్ మీడియా పుణ్య‌మే. ఆమె వ‌గ‌లు.. చిన్నెల్ని స‌రదా.. స‌ర‌దాగా చెప్ప‌టం.. అవి కాస్తా పెరిగి.. పెరిగి ఈ రోజు స్టార్ యాంక‌ర్ హోదా వ‌ర‌కూ వెళ్ల‌ట‌మే కాదు.. ఆమెకు సినిమా అవ‌కాశాల్ని ఇచ్చాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

తాజాగా ఆమె న‌టించిన రంగ‌స్థ‌లంలో రంగ‌మ్మ‌త్త‌గా అల‌రించిన ఆమె.. ద‌శాబ్దాల‌కు ఒక‌సారి వ‌చ్చే క్యారెక్ట‌ర్ లో ఇట్టే ఒదిగిపోయారు. మీడియాను అదే ప‌నిగా ఏసుకునే అన‌సూయ‌ను.. అదే మీడియా ఆకాశానికి ఎత్తేయ‌ట‌మే కాదు.. ఆమెలోని న‌టి కోణాన్ని ప్ర‌త్యేకంగా చెప్పింది.

తమ మీద చిర్రుబుర్రులాడ‌టం.. తాము ఫోన్లు చేస్తే స‌రిగా రియాక్ట్ కాని అన‌సూయ తీరును ఆమె ప్ర‌తిభ‌తో ముడిపెట్ట‌కుండా రంగ‌స్థ‌లంలో ఆమె పోషించిన పాత్ర‌.. అందులో ఎంత‌గా జీవించిందో మీడియా చెప్పినంత బాగా అన‌సూయ కూడా చెప్పుకోలేదేమో?

ఈ విష‌యాన్ని గుర్తించిన‌ట్లుంది. దీనికి నిద‌ర్శ‌నంగా ఆమె తాజా చెప్పిన మాట‌లే. మీడియాకు తాను చెప్పే మాట‌లు అస్స‌లు న‌చ్చ‌లేవ‌న్న మాట చెబుతూనే.. ఈసారి త‌న‌కు మీడియా యాంగిల్ ఏమిటో అర్థ‌మైంద‌ని చెప్పింది. అన‌సూయ‌కు పెళ్ల‌య్యింది.. పిల్ల‌లు ఉన్నారు.. ఇలాంటి పాత్ర‌లు చేస్తోందేంటి? అన్నార‌ని.. ఆ మాట‌ల‌కు త‌న‌కు చాలా కోపం వ‌చ్చింద‌న్నారు. అయితే.. ఈసారి తాను మీడియా కోణం నుంచి ఆలోచించాన‌ని.. త‌న‌ను వాళ్లింట్లో అమ్మాయిగా అనుకుంటున్నారు కాబ‌ట్టే తాను న‌చ్చ‌లేద‌ని స‌ర్దిచెప్పుకున్నాన‌ని చెప్పింది. మీడియాను అర్థం చేసుకోవ‌టంలో రంగ‌మ్మ‌త్త ఇంకా వెనుక‌బ‌డే ఉందే!