Begin typing your search above and press return to search.

రాను రానంటున్న అనసూయ

By:  Tupaki Desk   |   5 March 2018 11:28 AM GMT
రాను రానంటున్న అనసూయ
X
సెలబ్రిటీగా ఉన్నప్పుడు కావాలని చేసినా పొరపాటున జరిగినా ప్రతి ఇష్యూ కి సమాధానం చెప్పే పరిస్థితి ఇప్పుడు ఉంది. దీనికి మీడియా ఒక కారణం అయితే క్షణాల్లో సమాచారాన్ని ఉచితంగా అరచేతిలో స్మార్ట్ ఫోన్ లోకి తెచ్చిపారేస్తున్న టెక్నాలజీ మరో కారణం. ఇది యాంకర్ అనసూయకు బాగా అనుభవం . ఆ మధ్య ఒక చిన్న కుర్రాడి సెల్ ఫోన్ నేలకేసి కొట్టిన సంఘటనలో ఎంత రచ్చ జరిగిందో అందరూ చూసారు. తన వెర్షన్ పూర్తిగా వినకుండా వీడియో రూపంలో ఆధారం దొరకటంతో అనసూయ మీద నెటిజెన్లు కామెంట్ల దాడి చేసారు. తన వంతు ప్రయత్నం తను చేసినప్పటికీ తన మీద విమర్శల పర్వం ఆగకపోవడంతో మొత్తం సోషల్ మీడియా ఎకౌంట్ల నుంచి క్విట్ అవుతున్నాను అని చెప్పి వెళ్ళిపోయిన అనసూయ కోసం తన ఫాలోయర్స్ అయితే ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు.

ఇక అనసూయకు బాగా సన్నిహితంగా ఉండే వాళ్ళు తనను వెనక్కు రమ్మని కోరుతున్నా రాను రాను అనేస్తోందట. ఇంకో మూడు నాలుగు నెలల తర్వాత అప్పుడు మూడ్ ని బట్టి డెసిషన్ తీసుకుంటాను అని చెప్పిందట. రంగస్థలంలో మంగమ్మగా కొత్త తరహా పాత్ర చేసిన అనసూయ దాని విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. జబర్దస్త్ ఎంత పాపులారిటీ తెచ్చినా ఇలాంటి సినిమాల్లో కనక పేరు వస్తే ఆ కిక్కే వేరు. గతంలో సోగ్గాడే చిన్ని నాయనలో ఇలాగే బాగానే పేరు తెచ్చుకుంది. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా అంతకు పదిరెట్లు పేరిస్తుందని అనసూయ నమ్మకం. పైగా తన పేరు మీద ఒక పాట కూడా ఉన్నట్టు టాక్. మూడో సాంగ్ గా దాన్నే త్వరలో విడుదల చేయబోతున్నారు.

సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉన్నా వ్యక్తిగతంగా ట్రెండ్స్ - న్యూస్ తెలుసుకోవడానికి సోషల్ మీడియాను అనసూయ రెగ్యులర్ గా ఫాలో అవుతూనే ఉందట. కాని అది తన పేరు మీద ఉందా లేక ఏదైనా మారు పేరుతో కొనసాగుతోందా అనేది మాత్రం సస్పెన్స్. ఆ మధ్య గాయత్రి సినిమాలో జర్నలిస్ట్ పాత్ర వేసిన అనసూయకు అది సక్సెస్ కాకపోవడంతో ఆశలన్నీ రంగస్థలం మీదే పెట్టుకుంది.