Begin typing your search above and press return to search.

'పుష్ప' లో పొగరుబోతు దాక్షాయనిగా అనసూయ పవర్ ఫుల్ లుక్..!

By:  Tupaki Desk   |   10 Nov 2021 5:25 AM GMT
పుష్ప లో పొగరుబోతు దాక్షాయనిగా అనసూయ పవర్ ఫుల్ లుక్..!
X
అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ''పుష్ప''. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమెది నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని.. సుక్కూ ఆ క్యారక్టర్ ని చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశారని ఇన్నాళ్లూ చెప్పుకున్నారు. వీటిని నిజం చేస్తూ మేకర్స్ తాజాగా అనసూయ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.

'పుష్ప' చిత్రంలో దాక్షాయని అనే పాత్రలో అనసూయ కనిపించనుంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ లో ఆమె డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఊర మాస్‌ లుక్‌ లో ఉంది. నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకొని, ఒంటి నిండా నగలు ధరించి గంభీరంగా కనిపిస్తోంది. ఆమె భయంకరమైనది.. ఎవరికీ భయపడదని.. అంతకు మించి అహంకారి అని.. పొగరుబోతు అని చిత్ర బృందం పేర్కొంది.

'రంగస్థలం' సినిమాలో అనసూయకు రంగమ్మత్త వంటి గుర్తుండి పోయే పాత్ర ఇచ్చిన సుకుమార్.. ఇప్పుడు 'పుష్ప' చిత్రంలో ఆమె కెరీర్ లోనే వైవిధ్యమైన రోల్ చేయించినట్లు ఫస్ట్ లుక్ చూస్తే అర్థం అవుతోంది. ఇందులో ఆమె చిత్తూరు యాసలో మాటలు పలకబోతోందని సమాచారం. గతంలో 'క్షణం' సినిమాలో అనసూయ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఇప్పుడు దాని కంటే భిన్నమైన విలన్ క్యారక్టర్ లో గ్లామరస్ యాంకర్ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

ఇకపోతే 'పుష్ప' చిత్రంలో బన్నీ సరసన హీరోయిన్ గా శ్రీవల్లి అనే పాత్రలో రష్మిక మందన్నా నటిస్తోంది. ప్రతినాయకులు భన్వర్ సింగ్ షెకావత్ గా ఫహాద్ ఫాజిల్.. మంగళం శ్రీను గా సునీల్.. జాలీ రెడ్డి గా ధనుంజయ్ కనిపించనున్నారు. లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో ఊర మాస్ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నారు.

కాగా, గంధపు చెక్కల అక్రమ రవాణా నేపథ్యంలో రూపొందుతున్న 'పుష్ప' చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఫస్ట్ పార్ట్ 'పుష్ప: ది రైజ్' పేరుతో డిసెంబర్ 17న విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా.. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.