Begin typing your search above and press return to search.

సుమ‌లో ఈ యాంగిల్ కూడా ఉందా?

By:  Tupaki Desk   |   1 Feb 2023 11:00 PM GMT
సుమ‌లో ఈ యాంగిల్ కూడా ఉందా?
X
టీవీ షోలలో కంటెంట్ వీక్ అయినా తనదైన‌ స్పాంటేనిటీ.. కామిక్ టైమింగ్.. పంచ్ లతో షోని ర‌క్తి క‌ట్టించ‌గ‌ల ఏకైక యాంక‌ర్ ఎవ‌రైనా ఉన్నారా? అంటే అది సుమ మాత్ర‌మే. బోర్ కొట్టే కార్య‌క్ర‌మాల‌తోను రంజింపజేసే ప్ర‌తిభ త‌న సొంతం. ప్రస్తుతం ఏ స్టార్ హీరో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కైనా సుమ మొద‌టి ఛాయిస్ అనడంలో సందేహం లేదు. అస‌లు సుమ‌ తేదీలు అందుబాటులో లేకపోతే సూపర్ స్టార్లు కూడా తమ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లను వాయిదా వేసుకున్న సంద‌ర్భాలున్నాయి. మూడు లేదా నాలుగు భాషల్లో అనర్గళంగా మాట్లాడగల సామర్థ్యం కూడా ఇతర యాంకర్ల తో పోలిస్తే సుమ‌లో ఉన్న అసాధార‌ణ ప్ర‌తిభ‌కు నిద‌ర్శ‌నం.

సుమ కనకాల సీరియల్ నటిగా తన నటనా జీవితాన్ని ప్రారంభించారు.. ఆమె తన అద్భుతమైన ప్రతిభతో యాంకర్ గా స్టార్ గా ఎదిగారు. తాను ఎంచుకున్న రంగంలో ఎలా విజయం సాధించాలో నిరూపించి తర్వాతి తరానికి రోల్ మోడల్ గా నిలిచారు. ఈ క్రమంలో ఆమె దాదాపు 15 ఏళ్ల పాటు ఈటీవీ షో `స్టార్ మహిళ‌`కి యాంకర్ గా వ్యవహరిస్తూ రికార్డు సృష్టించింది. తన ఇటీవలి షోలో యాంకర్ గా తన సుదీర్ఘ కెరీర్ కు విరామం ఇస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 31న ప్రసారం కానున్న ఈటీవీ `వేర్ ఈజ్ ది పార్టీ ప్రోమో` చివర్లో ఈ షాకింగ్ న్యూస్ వెల్లడైంది.

ఆమె పట్టుకుంటే ప‌ట్టు చీర‌- భలే ఛాన్స్ లే- ఉమ్మని మహారాణులు వంటి అనేక లేడీస్ షోలను సంవత్సరాల తరబడి బోర్ కొట్టకుండా నడిపింది. పాడుతా తీయ‌గా- స్వరాభిషేకం వంటి ప్రముఖ షోలకు యాంకర్ గా వ్యవహరించింది. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా కనిపించింది. ఇటీవ‌ల `జయమ్మ పంచాయితీ` చిత్రంలో కథానాయికగా నటించింది. అయితే ప్రస్తుతం 47 ఏళ్ల వయసులో ఉన్న సుమ యాంకరింగ్‌ నుంచి రిటైర్‌ కావాలని కోరుకుంటోందని క‌థ‌నాలొచ్చాయి.
గత ఇరవై ఏళ్లుగా నాన్ స్టాప్ గా పనిచేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. నిత్యం మాట్లాడుతుండడంతో గతంలో ఆమెకు గొంతు ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాస్త విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నారని తెలిసింది.

తెలుగువారు చూపుతున్న అభిమానం ప్రేమ వల్లనే నేను మలయాళీగా ఇక్కడ స్థిరపడ్డాను. లేకపోతే.. నేను ఉండను. దాన్ని నోట్ చేసుకోండి. అయితే నేను కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను అని ఆమె ఏడుస్తూ చెప్పారు. అయితే సినిమా ఫంక్షన్లు - ప్రచార ఇంటర్వ్యూల‌ను య‌థావిథిగా కొన‌సాగిస్తున్నారు.

సుమ గురించి అంత‌గా తెలియ‌ని ఒక గొప్ప విష‌యం ఉంది. తానొక గొప్ప సామాజిక క‌ర్త. నిస్స‌హాయంగా ఉన్న‌వారిని ఆదుకునే మంచి త‌త్వం ఉంది. ఇంత‌కుముందే తాను 30 మంది విద్యార్థులను దత్తత తీసుకున్నట్లు ప్రకటించిన సుమ.. వాళ్ల పూర్తి బాధ్యతలను తానే చూసుకుంటున్నాన‌ని వెల్ల‌డించారు. ఇటీవల చెన్నై కాలేజీలో జరిగిన ఓ కార్య‌క్ర‌మంలో దీని గురించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డించారు. టీచర్‌ అవుదామనుకుని యాంకర్‌ అయ్యానని ఈరోజు ఈ వృత్తిలో కొనసాగుతున్నానంటే దానికి కారణం మా అమ్మ అని సుమ తెలిపారు. ఆమె తెలుగు నేర్చుకొని నాకు నేర్పించింది. ఇందులో కొనసాగడానికి కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని చెప్పిన సుమ సమాజానికి తనవంతు సేవ చేస్తున్నానని వెల్ల‌డించారు.

సామాజిక సేవ‌లో భాగంగా `ఫెస్టివల్ ఫర్‌ జాయ్‌` అనే సంస్థను ప్రారంభించామ‌ని కూడా తెలిపారు. 30 మంది విద్యార్థులను దత్తత తీసుకుని వారిని చ‌దివించే బాధ్య‌త‌ల‌తో పాటు అన్ని బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ట్టు వెల్ల‌డించారు. విద్యార్థులంతా జీవితంలో స్థిరపడే వరకు స‌హాయం చేస్తుంటామ‌ని తెలిపారు. ఇది తెలిసాక అభిమానులు మ‌న‌సున్న యాంక‌ర్ అని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. మంచి ప‌ని చేస్తున్నావ‌ని ప్రోత్స‌హిస్తున్నారు. మునుముందు సుమ సామాజిక కార్య‌క్ర‌మాల‌ను విస్త‌రించాల‌ని కోరుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.