Begin typing your search above and press return to search.

కరోనా బాధితుల సహాయార్థం విన్నూత్న ఆలోచనతో వచ్చిన యాంకర్!

By:  Tupaki Desk   |   5 April 2020 7:05 AM GMT
కరోనా బాధితుల సహాయార్థం విన్నూత్న ఆలోచనతో వచ్చిన యాంకర్!
X
యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులుండరు. బుల్లితెరపై ఆమె ఓ సంచలనం. టీవీ తెరపై ఆమె ఓ లేడీ మెగాస్టార్. వెండితెరపై స్టార్ హీరోయిన్లు ఎవరన్నది కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది..కానీ బుల్లితెరపై యాంకర్ సుమ ఎప్పుడూ స్టార్ హీరోయిన్ రేంజే. ఆమె హోస్ట్ చేసిన ఏ కార్యక్రమం అయినా బంపర్ హిట్టే. ఇక సినిమా ఈవెంట్లు అయితే.. ఈమె డేట్స్ ఖాళీలేక ఆడియో - ప్రీ రిలీజ్ ఈవెంట్లను వాయిదా వేసుకుంటున్నారంటే సుమ హవా ఏ రేంజ్‌ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందాలను ఆరబోస్తూ యాంకరింగ్ చేయాలని అత్యుత్సాహం చూపించే కొంతమంది యాంకర్లలా కాకుండా తన మాటలనే పెట్టుబడిగా పెట్టి టాప్ యాంకర్‌ గా విరజిల్లుతోంది యాంకర్ సుమ. స్టేజ్ మీద తన మాటలతోనే కాకుండా కరోనా నేపథ్యంలో సాయం చేయడానికి ముందుకొచ్చి చేతల్లో కూడా చూపించింది.

కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. దీంతో చాలా మంది జనం ఇళ్లకే పరిమితం అయ్యారు. రెక్కాడితే కాని డొక్కాడని వాళ్లు తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వాలు వారికి సాయం చేసేందుకు వివిధ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నా ఆకలికేకలు మాత్రం ఆగడం లేదు. ఇక సినిమా - టీవీ ఇండస్ట్రీలోనూ ఇదే పరిస్థితి ఉంది. షూటింగ్‌‌ లు బంద్ కావడంతో పాటు.. థియేటర్స్ మూత పడటంతో వేల మంది సినీ కార్మికులు - కళాకారులు ఇళ్లకే పరిమితం అయ్యారు. వారిని ఆదుకునేందుకు ఇండస్ట్రీ ప్రముఖులు రంగంలోకి దిగి 'కరోనా క్రైసిస్ ఛారిటీ' ఏర్పాటు చేసి వారికి భరోసా కల్పిస్తున్నారు. చిరంజీవి - నాగార్జున - ప్రభాస్ - మహేష్ - ఎన్టీఆర్ - బాలయ్య - ఇలా స్టార్ హీరోలతో పాటు దర్శకులు, నిర్మాతలు తమకు చేతనైన సాయం చేస్తున్నారు. కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా పేద కళాకారులకు - కార్మికులకు ఉచితంగా నిత్యావసర వస్తువులు - కూరగాయలు - మందులు - కొంత ఆర్థిక సాయాన్ని పంపిణీ చేయనున్నారు.

ఈ నేపథ్యంలో వాళ్ళని ఆదుకోడానికి సుమ కనకాల విన్నూత్నమైన ఆలోచనతో ముందుకొచ్చింది. తన వద్ద ప్రత్యక్షంగా - పరోక్షంగా పనిచేసే వాళ్ల ఆకలి తీర్చేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నట్లు చెప్పింది. ఈ సందర్భంగా ఆమె పేస్ బుక్ వేదికగా ఒక పోస్టు పెట్టింది. ‘కోవిడ్-19 డొనేషన్స్ నేపథ్యంలో నేను ఓల్డేజ్ హోమ్‌ లతో పాటు డొనేట్ కార్డ్ అనే స్వచ్ఛంద సంస్థకు సాయం చేశాను. ఇక తెలుగు టెలివిజన్ ప్రొడ్యుసర్స్ కౌన్సిల్‌ లో నా వంతుగా డొనేట్ చేశా. నా దగ్గర డైరెక్టుగా - ఇన్ డైరెక్ట్‌గా పని చేస్తున్న ప్రొడక్షన్ బాయ్స్ - మేకప్ - లైటింగ్ ఇలా వివిధ క్రాఫ్ట్స్‌ లో పనిచేస్తున్న వాళ్ల లిస్ట్ తీసుకున్నా. వీళ్లందరికీ కొంత ఆర్థిక సాయం అందించాలని అనుకుంటున్నా. నేను లిస్ట్ తయారు చేస్తున్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది. ఇలాగే ఎవరికి వాళ్లు.. ఓ లిస్ట్ తయారు చేసుకుని వాళ్ల దగ్గర డైరెక్ట్‌ గా ఇన్ డైరెక్ట్‌ గా పనిచేస్తున్న వాళ్లకు సాయం చేస్తే చాలా వరకూ ఇండస్ట్రీలోని అందరికీ సాయం అందుతుంది. నేను ఇలా చేయాలని అనుకుంటున్నా.. మీరు కూడా చేయండి’ అంటూ తన ఆలోచనను షేర్ చేసుకున్నారు సుమ కనకాల.