Begin typing your search above and press return to search.

316 ఎక‌రాల్లో వైజాగ్ ఫిలింహ‌బ్‌?

By:  Tupaki Desk   |   22 Aug 2018 4:10 AM GMT
316 ఎక‌రాల్లో వైజాగ్ ఫిలింహ‌బ్‌?
X
వేకువ‌ఝాము కోడి కూయ‌క‌ముందే దిన‌ప‌త్రిక‌లు చ‌దివిన‌వారికి గుండె ఝ‌ల్లుమ‌నే వార్త‌! నిన్న‌టి సాయంత్రం నుంచే వాట్సాప్‌ లో హ‌ల్‌ చ‌ల్ చేసిన ఆ మెసేజ్ సారంశం ఏమంటే హైద‌రాబాద్ ఫిలింఇండ‌స్ట్రీకి ధీటుగా వైజాగ్‌ లో అదిరిపోయే ఫిలింఇండ‌స్ట్రీ సెట‌ప్‌ కు స‌న్నాహాలు సాగుతున్నాయ‌న్న‌ది ఆ వార్త సారాంశం. చిన్న సినిమాల‌కు వ‌రాలు కురిపిస్తూనే, ఇక మీద‌ట బీచ్ సొగ‌సుల వైజాగ్‌ ని అతి పెద్ద ఫిలింహ‌బ్‌గా త‌యారు చేసే ఒక కీల‌క‌మైన జీవో గురించి ఏపీ ప్ర‌భుత్వం - బెజ‌వాడ ఎఫ్‌ డీసీ సాక్షిగా వెలువ‌రించింది. ఈ వార్త ఇటు హైద‌రాబాద్‌ ఫిలింమీడియాలోనూ ప్ర‌కంప‌నాలు రేపింది.

వైజాగ్ ప‌రిస‌రాల్లో దాదాపు 316 ఎక‌రాల్లో భారీ స్టూడియోల నిర్మాణానికి జీవోని జారీ చేయ‌నుంది ఏపీ ప్ర‌భుత్వం. ఆ మేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌రించింది. అయితే ఈ స్టూడియోల నిర్మాణం ఎక్క‌డ సాగ‌నుంది? అన్న‌దానికి ప్ర‌భుత్వం ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. అస‌లింత‌కీ ఎక్క‌డ క‌డ‌తారు స్టూడియోలు? అంత భూమి విశాఖ బీచ్ వెంబ‌డి ఉందా? అంటే ఉంద‌నేది ఏపీ ప్ర‌భుత్వం ఇచ్చిన క్లారిటీ.

ఇప్ప‌టికే విశాఖ ఆర్‌కె బీచ్ నుంచి అటు భీమిలీ బీచ్‌ ల వ‌ర‌కూ వేల కోట్లు పెట్టుబ‌డులు వెద‌జ‌ల్లుతూ సువిశాల‌మైన రోడ్ల‌ను నిర్మిస్తోంది ప్ర‌భుత్వం. ఆ రోడ్‌ ను ఆనుకుని రుషికొండ బీచ్ దాటాక రామానాయుడు స్టూడియోస్ కొలువుదీరిన కొండ‌లు ద‌ర్శ‌న‌మిస్తాయి. ఆ కొండ‌ల్ని ఆనుకుని వంద‌ల ఎక‌రాల భూమి ఉంది. అది కాపులుప్పాడ విలేజ్ స‌హా కొన్ని విలేజీల్ని క‌లుపుకుని ఉంటుంది. కైలాస గిరి దాటాక‌.. రామానాయుడు కొండ‌లు మొద‌లుకుని అటు కాపులుప్పాడ‌, భీమిలి వ‌ర‌కూ వ‌రుస‌గా స్టూడియోలు నిర్మిస్తున్నారా? ఈ స్టూడియోల నిర్మాణానికి ఎవ‌రు ముందుకొస్తున్నారు? అన్న‌ది తేలాల్సి ఉందింకా. ఇప్ప‌టికే అగ్ర‌నిర్మాత‌ కేఎస్ రామారావు ఎఫ్ ఎన్‌ సీసీ ప్రారంభించారు. ఇదివ‌ర‌కూ ఫిలింఛాంబ‌ర్‌ కి కాపులుప్పాడ ప‌రిస‌రాల్లోనే పునాది రాయి వేశారు. అయితే నిర్మాణాలు జ‌ర‌గాల్సి ఉంది. ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వ స‌న్నివేశం చూస్తుంటే ఇక‌మీద‌ట వైజాగ్ ఫిలింఇండ‌స్ట్రీ ఏర్పాటుపై సీరియ‌స్‌ గానే ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. అయితే ప్ర‌తిసారీ ప్ర‌క‌టించే స‌ర‌దా ప్ర‌క‌ట‌నలా కాకుండా దీనిని సీరియ‌స్‌గా క‌ల్పించుకుని పూర్తి చేయ‌గ‌లిగితే, అది కూడా వేగంగా డెవ‌ల‌ప్ చేయ‌గ‌లిగితే ఆంధ్రా ఊటీని త‌ల‌పించే అర‌కు నుంచి వైజాగ్ వ‌ర‌కూ ఫిలిం ఇండ‌స్ట్రీ పాదుకునే ఛాన్స్ ఉంటుంది. దీనివ‌ల్ల ఉత్త‌రాంధ్ర నాలుగు జిల్లాలు - గోదారి జిల్లాల్లోని వేలాది మందికి ఈ కొత్త ఫిలింఇండ‌స్ట్రీ వ‌ల్ల ఉపాధి చాలా ద‌గ్గ‌రగా ల‌భిస్తుంద‌న‌డంలో సందేహం లేదు.