Begin typing your search above and press return to search.

'సాహో' టికెట్ ధర పెంచేందుకు ఒప్పుకోని ఏపీ గవర్నమెంట్

By:  Tupaki Desk   |   29 Aug 2019 9:22 AM GMT
సాహో టికెట్ ధర పెంచేందుకు ఒప్పుకోని ఏపీ గవర్నమెంట్
X
సాహో సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు మ‌రికొద్ది గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఓవ‌ర్సీస్‌ లో గురువార‌మే ప్రీమియ‌ర్లు భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ హంగామా స్టార్ట్ అయ్యింది. ఏపీ - తెలంగాణ రెండు చోట్లా ప్రీమియ‌ర్ షోలు వేసుకునేందుకు - టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు సాహో నిర్మాత‌లు ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ప్ర‌త్యేకంగా విజ్ఞ‌ప్తులు పెట్టుకున్నారు.

తెలంగాణ‌లో కేసీఆర్ స‌ర్కార్ ఈ విష‌యంలో ముందు నుంచి ఎవ్వ‌రి ఒత్తిళ్ల‌కు త‌లొగ్గ‌డం లేదు. దీంతో తెలంగాణ‌లో టిక్కెట్ల రేట్లు పెంపు కాదు క‌దా... క‌నీసం గురువారం అర్ధ‌రాత్రి ప్రీమియ‌ర్లు కూడా వేసే ప‌రిస్థితి లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే శుక్ర‌వారం ఎర్లీ మార్నింగ్ షోల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉందంటున్నారు. ఇక ఏపీలో త‌మ ఛానెల్ ద్వారా సాహో నిర్మాత‌లు రాష్ట్ర ప్ర‌భుత్వానికి అద‌న‌పు షోల‌తో పాటు టిక్కెట్ల రేట్ల పెంపుపై విన్న‌వించుకున్నా వీరికి కొంత మోదం.. కొంత ఖేదం క‌లిగింది.

వారం రోజుల పాటు రోజుకు రెండు షోలు అద‌నంగా వేసుకునేందుకు ఓకే చెప్పిన జ‌గ‌న్ స‌ర్కార్ టిక్కెట్ రేట్ల పెంపు విష‌యంలో మాత్రం షాక్ ఇచ్చింది. రిలీజ్‌కు గంట‌ల మాత్ర‌మే టైం ఉండ‌డంతో ఏపీ అధికారులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సాహో సినిమా టికెట్ల ధర పెంపు అంశాన్ని సీఎం జ‌గ‌న్ వ‌ద్ద‌నే నేరుగా ప్ర‌స్తావించారు. దీంతో జ‌గ‌న్ ఇందుకు సుముఖ‌త వ్య‌క్తం చేయ‌లేద‌ని తెలిసింది.

ఒక్కో సినిమాకు ఒక్కో రేటు వ‌ద్ద‌ని... సినిమా అనేది అంద‌రి వినోద‌పు హ‌క్కు అని.. ఈ నేప‌థ్యంలో టిక్కెట్లు అన్ని సినిమాల‌కు ఒకేలా ఉండాల‌ని సింగిల్ మాట‌తో ఈ చ‌ర్చ‌కు ఫుల్‌ స్టాప్ పెట్టేశార‌ట‌. దీంతో ఏపీలో సాహో సినిమా టికెట్ల ధరపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. అన్ని సినిమాల‌కు ఒక్క‌టే రేటు అని చెప్ప‌డంతో అన‌ధికారికంగా ఎక్కడైనా టిక్కెట్ల రేట్లు పెంచినా అధికారికంగా మాత్రం ఆ ఛాన్స్ లేదు. అయితే ఇప్ప‌టికే కొన్ని మ‌ల్టీఫ్లెక్స్‌ లు పెంచిన రేట్ల‌తో ఆన్‌ లైన్‌ లో టిక్కెట్లు అమ్ముతున్నారు. ఇక ఇదే అంశంపై ప్ర‌ముఖ నిర్మాత న‌ట్టికుమార్ కూడా హైకోర్టులో కేసు వేసిన సంగ‌తి తెలిసిందే.