Begin typing your search above and press return to search.

ఆ పుస్తకం బాయ్ ఫ్రెండ్ గురించి కాదు బాబోయ్!

By:  Tupaki Desk   |   26 Dec 2019 1:25 PM GMT
ఆ పుస్తకం బాయ్ ఫ్రెండ్ గురించి కాదు బాబోయ్!
X
సెలబ్రిటీలకు ఉండే గుర్తింపు.. వారి సంపాదన చూస్తే అందరికీ వారిలా ఉండాలనే ఆశ కలుగుతుంది. కానీ ఎంతచెట్టుకు అంత గాలి అన్నట్టుగా ప్రతి ఒక్కరికీ వారికి తగ్గ ఇబ్బందులు ఉంటాయని మాత్రం అర్థం చేసుకోరు. మూడు రాజధానులపై ఎవరైనా టాలీవుడ్ స్టార్ ఓపెన్ గా అభిప్రాయం చెప్పగలరా? ఇప్పటివరకూ చెప్పారా? చెప్పలేదు.. చెప్పలేరు. ఎందుకంటే సమర్థిస్తే ఒక గోల.. విమర్శిస్తే మరో గోల మెడకు చుట్టుకుంటాయి. లాక్కోలేక పీక్కోలేక చావాలి. అందుకే 'సర్వ దరిద్రాలకు ఎకైక ఔషధం మౌనం' అనే సూత్రం గుడ్డిగా పాటిస్తారు. పాపం ఈమధ్య హీరోయిన్ ఆండ్రియా జెరేమియాకు ఇలాంటిదే ఒక గోల ఎదురైంది.

ఈమధ్య ఆండ్రియా ఒక సందర్భంలో ఓపెన్ గా తన మాజీ ప్రియుడి గురించి ప్రస్తావించింది. ఆ సమయంలో తను ఒక సెలబ్రిటీ అనే విషయం మర్చిపోయి సాధారణ అమ్మాయిలాగా మాట్లాడేసింది. కానీ ఆ 'టాక్' కు మసాలా కలిపి టిక్ టాక్ చేయడంతో రచ్చ రంబోలా అయింది. ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా ఉన్న ఓ నటుడితో ఆండ్రియాకు సంబంధం అంటగట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేశారట. సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే ఎన్ని ఇబ్బందులు వస్తాయో ఇప్పుడు అర్థం అయిందని అంటోంది ఆండ్రియా.

"నేను బ్రోకెన్ వింగ్ అనే ఒక పుస్తకం రాశాను. అందులో చాలా పద్యాలు ఉంటాయి. ఒక సారి బెంగుళూరులో జరిగిన లిటరరీ ఫెస్ట్ కు వెళ్తే అక్కడ ఆ పద్యాలు ఎవరిని ఉద్దేశించి రాశారని అడిగారు. నా మాజీ ప్రియుడి గురించి అని బదులిచ్చాను. అయితే అదే తప్పైపోయింది. నిజానికి ఈ పుస్తకం నేను పదేళ్ళ క్రితం రాశాను. కానీ నేను ఓపెన్ గా మాట్లాడడం వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది" అంటూ వాపోయింది. నిజానికి ఆ పుస్తకం రాసింది తనకోసమని.. మాజీ ప్రియుడి కోసం కాదని చెప్పింది. అయితే అనవసరంగా రాజకీయాల్లో ఉన్న ఒక సినీ నటుడితో తనకు సంబంధం అంటగట్టారని బాధ పడింది. ఆ వార్తలపై ఎలా స్పందించాలో తెలియలేదట. మొత్తానికి ఆండ్రియాకు ఈ ఆండ్రాయిడ్ జెనరేషన్ లో ఎలా ఉండాలి అనేది క్లారిటీ వచ్చినట్టే ఉంది.