Begin typing your search above and press return to search.

'రాజ రాజ చోర' హిట్ నుంచి తప్పించుకోలేడు: అనిల్ రావిపూడి

By:  Tupaki Desk   |   16 Aug 2021 2:46 AM GMT
రాజ రాజ చోర హిట్ నుంచి తప్పించుకోలేడు: అనిల్ రావిపూడి
X
శ్రీవిష్ణు కథానాయకుడిగా హసిత్ గోలి దర్శకత్వంలో 'రాజ రాజ చోర' సినిమా రూపొందింది. అభిషేక్ అగర్వాల్ - విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. టైటిల్ ను బట్టే ఈ సినిమాలో హీరో 'దొంగ' అనే విషయం అర్థమైపోతుంది. అయితే ఎలాంటి పరిస్థితుల్లో దొంగగా మారవలసి వచ్చింది? అలా మారడం వలన ఆయనకి ఎదురయ్యే పరిణామాలు ఎలాంటివి? అనేది కథ. ఆసక్తికరమైన మలుపులతో హాస్యభరితంగా సాగిపోయే ఈ సినిమా, ఈ నెల 19వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది.

ఈ వేడుకకి అనిల్ రావిపూడి .. బాబీ .. శ్రీవాస్ .. వివేక్ ఆత్రేయ .. నారా రోహిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ, "ఏ దర్శకుడికైనా ఫస్టు సినిమా కెరియర్ కి పునాది అవుతుంది. ఫస్టు సినిమా ఎంతటి ముఖ్యమైనదనేది నాకు బాగా తెలుసు. అలా దర్శకుడు హసిత్ గోలికి ఇది ఫస్టు సినిమా. కచ్చితంగా ఈ సినిమా హసిత్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. నవ్వించడమనేది అంత తేలికైన విషయమేం కాదు. ఈ విషయంలోను కొత్త దర్శకులు కొత్తదనాన్ని చూపుతూ వస్తున్నారు.

అలాగే హసిత్ గోలి కూడా కామెడీ విషయంలో కొత్త ప్రయోగం చేసిన తీరు నన్ను ఆకట్టుకుంది. వివేక్ సాగర్ సంగీతం .. వేద రామన్ కెమెరా పనితనం నాకు బాగా వచ్చాయి. కథానాయికలు మేఘ ఆకాశ్ - సునైన చాలా బాగా యాక్ట్ చేశారు. ఇక శ్రీవిష్ణు విషయానికొస్తే 'అప్పట్లో ఒకడుండేవాడు' నుంచి మొదలైన ఆయన జర్నీలో ప్రతిసారి నేను జాయిన్ అవుతూనే ఉన్నాను. కథలను ఆయన ఎంచుకునే విధానం నాకు నచ్చుతుంది. కొత్తగా ఎవరైనా కథను తయారు చేసుకుని ఎవరితో చేస్తే బాగుటుందనే ఆలోచన చేసినప్పుడు, వాళ్లకి ముందువరుసలో శ్రీవిష్ణు కనిస్తాడు. రిజల్టుతో సంబంధం లేకుండా తాను ట్రై చేస్తూనే ఉంటాడు.

ఈ సినిమా ఆయన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలవాలని కోరుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో వచ్చిన అన్ని ట్రైలర్లలోకి ఈ సినిమా ట్రైలర్ నాకు బాగా నచ్చింది. మిగతావారికి తప్పకుండా అలాగే అనిపించి ఉంటుందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అంటూ తనదైన స్టైల్లో ఆయన చెప్పిన తీరు అక్కడున్న వాళ్లందరినీ అలరించింది.

ఇక దర్శకుడు బాబీ మాట్లాడుతూ .. "ఈ సినిమా టీజర్ చూశాను .. చాలా బాగుంది. విజువల్స్ .. ఆడియో రెండూ కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి. శ్రీవిష్ణు ఫేస్ చూస్తే చాలా అమాయకుడిలా కనిపిస్తాడు. ఎవరైనా మోసం చేసేస్తారేమోనని అనిపిస్తుంది. అలాంటి ఆయన తానే ఓ నలుగురిని మోసం చేసే పాత్రను ఎంచుకోవడం విశేషం. అందుకోసం ఆయన చాలానే కష్టపడి ఉంటాడు. ఈ సినిమా తప్పకుండా హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు.