Begin typing your search above and press return to search.

నేను స్ఫూర్తిగా తీసుకునే దర్శకుడు ఆయనే: అనిల్ రావిపూడి

By:  Tupaki Desk   |   17 March 2021 2:30 AM GMT
నేను స్ఫూర్తిగా తీసుకునే దర్శకుడు ఆయనే: అనిల్ రావిపూడి
X
టాలీవుడ్ లో అపజయమెరుగని దర్శకుడిగా అనిల్ రావిపూడికి మంచి క్రేజ్ ఉంది. ఆయన కథల్లో కామెడీ పాళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఆయన సినిమాల్లో కామెడీ ఎపిసోడ్స్ కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాయి. రచయితగా ఆయన కొన్ని సినిమాలకు పనిచేశాడు .. ఆ తరువాతే మెగాఫోన్ పట్టుకున్నాడు. అందువల్లనే ఇప్పుడు ఆయన తన సినిమాలకు తానే కథ .. స్క్రీన్ ప్లే .. మాటలు రాసుకుంటూ ఉంటాడు. ప్రస్తుతం ఆయన 'ఎఫ్ 3' సినిమాకి సంబంధించిన పనులతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన శ్రీవిష్ణుతో కలిసి 'ఆలీతో సరదాగా' వేదికను పంచుకున్నాడు.

ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ .. "చిన్నప్పటి నుంచి కూడా నాకు సినిమాలంటే చాలా ఇష్టం. అప్పట్లో మా ఊళ్లో ఒక టెంట్ హాల్ ఉండేది. మా అమ్మానాన్నలు పొలం పనులకు వెళుతూ, ఆ థియేటర్లో తెలిసినవాళ్ల దగ్గర నన్ను వదిలేసి వెళ్లేవారు. వాళ్లు తిరిగి వచ్చేవరకూ సినిమాలు చూస్తూ కూర్చునేవాడిని. అలా సినిమాల పట్ల ఇష్టం పెరిగిపోతూ వచ్చింది. నాకు సినిమాల పట్ల ఒక అవగాహన వచ్చేసరికి మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారు దర్శకుడిగా ఇండస్ట్రీలో ఉన్నాడు. 'తమ్ముడు' దర్శకుడు ఆయనే. బాబాయ్ ఉన్నాడనే ధైర్యంతోనే ఇటువైపు వచ్చేశాను.

నా సినిమాల్లో కామెడీ ఎక్కువగా ఉంటుంది .. ఎందుకంటే నాపై జంధ్యాలగారి ప్రభావం ఉంది. జంధ్యాలగారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. జంధ్యాలగారు మంచి రచయిత .. ఆయన కథలను సిద్ధం చేసుకునే తీరు .. పాత్రలను మలిచే విధానం .. కామెడీ టైమింగును ఆయన సెట్ చేసే పద్ధతి నాకు బాగా నచ్చుతాయి. ఆయన సినిమాల్లో చిన్న వేషానికి కూడా ప్రాముఖ్యత .. ప్రయోజనం ఉంటాయి. ప్రతి పాత్ర ఊరికే వచ్చి వెళ్లదు .. ఏదో ఒకటి చేసే వెళుతుంది. పాత్రలకి మేనరిజమ్స్ సెట్ చేయడంలో ఆయన తరువాతనే ఎవరైనా. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన నాకు స్ఫూర్తి" అని చెప్పుకొచ్చాడు.