Begin typing your search above and press return to search.

ఒక్క క్షణం.. తుపాను చల్లారింది

By:  Tupaki Desk   |   19 Dec 2017 3:15 PM GMT
ఒక్క క్షణం.. తుపాను చల్లారింది
X
కొన్ని రోజుల కిందట రిలీజైన ‘ఒక్క క్షణం’ టీజర్ టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అయింది. పారలల్ లైఫ్ కాన్సెప్టుతో చాలా ఆసక్తికరంగా ఈ టీజర్ తీర్చిదిద్దాడు దర్శకుడు వీఐ ఆనంద్. ఐతే ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర ఇదే కాన్సెప్టుతో తెరకెక్కిన ‘పారలల్ లైఫ్’ అనే కొరియన్ మూవీ రీమేక్ రైట్స్ తీసుకుని ‘2 మేమిద్దరం’ అనే సినిమా నిర్మించడంతో కాపీ రైట్ గొడవ తలెత్తింది. అనిల్ సుంకర ఈ చిత్ర బృందానికి కాపీ రైట్ చట్టం కింద నోటీసు పంపినట్లు వార్తలొచ్చాయి. ‘ఒక్క క్షణం’ విడుదలను ఆపించే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు గుసగుసలు వినిపించాయి. ఐతే ఇంతలో ‘ఒక్క క్షణం’ టీం తరఫున హీరో అల్లు శిరీష్ స్పందించాడు. తమది కాపీ సినిమా కాదని.. ఒరిజినల్ అని వివరణ ఇచ్చుకున్నాడు.

ఐతే ఇంతకీ ఈ వివాదం విషయంలో చివరికి అనిల్ ఏ స్టాండ్ తీసుకుంటాడు.. ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుంది అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు అనిల్ ఈ వివాదం విషయమై ఓపెనయ్యాడు. తాను ‘ఒక్క క్షణం’ దర్శకుడు వీఐ ఆనంద్.. నిర్మాత చక్రి చిగురుపాటిలతో మాట్లాడానని.. అన్ని సమస్యలూ సమసిపోయాయని చెప్పాడు. అంతే కాక ‘ఒక్క క్షణం’ కాన్సెప్ట్.. కథ మొత్తం తాను తెలుసుకున్నానని.. ఈ చిత్రం కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని.. ఈ చిత్ర బృందంతో పని చేయడానికి ఆసక్తిగా ఉన్నానని కూడా అన్నాడు అనిల్. వెంటనే శిరీష్ కూడా స్పందించాడు. అనిల్ కు థ్యాంక్స్ చెప్పాడు. మొత్తానికి టీ కప్పులా తుపానులా మారిన ఈ వివాదం త్వరగానే సమసిపోయింది.