Begin typing your search above and press return to search.

పదేళ్లుగా సాగుతున్న పాటల ప్రయాణం!

By:  Tupaki Desk   |   17 Nov 2021 11:30 AM GMT
పదేళ్లుగా సాగుతున్న పాటల ప్రయాణం!
X
సినిమా అనేది కోట్ల రూపాయల బిజినెస్ .. కొత్తవారిని ప్రోత్సహించాలనే దృఢ సంకల్పంతో ఇక్కడికి ఎవరూ రారు. తమ ప్రయాణంలో టాలెంట్ పరంగా నమ్మదగిన వ్యక్తులకు అవకాశాలు ఇస్తూ వెళ్లడం జరుగుతూ ఉంటుంది అంతే. అలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంపైనే ఆ తరువాత కెరియర్ ఆధారపడి ఉంటుంది. గెలుస్తాను .. సాధిస్తాను అనే వారి అరుపులను ఎవరూ పట్టించుకోరు. గెలిచి సాధించినవారి మాటలనే ఈ లోకం పట్టించుకుంటుంది .. వారు చెప్పింది పాటిస్తుంది. అలా ముందస్తుగా ఎలాంటి ప్రకటనలు లేకుండా ప్రకంపనలు సృష్టించిన సంగీత దర్శకుడిగా అనిరుధ్ కనిపిస్తాడు.

సాధారణంగా ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత ఒక మంచి పాట చేసే ఛాన్స్ ఎప్పుడు దొరుకుంతుందా .. పాప్యులర్ చేసే పాట ఎప్పుడు పడుతుందా అని చాలామంది సంగీత దర్శకులు ఎదురుచూస్తుంటారు. కానీ తొలిపాటతోనే పాప్యులర్ అయిపోయి, సంగీత దర్శకుడు ఎవరు? అని జనాలచేతనే సెర్చ్ చేయించిన సంగీత దర్శకుడిగా అనిరుధ్ కనిపిస్తాడు. ఏ భాషలో చేసిన పాటను ఆ భాషలోని వారే ఆస్వాదిస్తూ ఉంటారు. ఆ ప్రాంతం వరకూ మాత్రమే ఆ పాట పాప్యులర్ అవుతూ ఉంటుంది. కానీ '3' సినిమా కోసం అనిరుధ్ చేసిన 'వై దిస్ కొలవరి' పాట భాషతో పనిలేకుండా సరిహద్దులు దాటేస్తూ జనంలోకి దూసుకుపోయింది. పిల్లలను కూడా ఈ పాట విశేషంగా ఆకట్టుకుంది.

ధనుశ్ - శ్రుతి హాసన్ జంటగా నటించిన '3' సినిమా పెద్దగా ఆడకపోయినా, పాటల పరంగా మంచి మార్కులే కొట్టేసింది. "కుర్రాడు కొత్తగా వచ్చాడు .. ఆ మాత్రం ఉత్సాహం ఉంటుంది .. అది ఎక్కువకాలం ఉండాలి గదా" అని చాలామంది అనుకున్నారు. అలాంటివారికి తన పదేళ్ల ప్రయాణాన్ని సమధానంగా చెప్పాడు అనిరుధ్. తమిళనాట స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నవారు .. తమ సినిమాలకు అనిరుధ్ పనిచేయాలనే కండిషన్ పెట్టే స్థాయికి ఆయన చేరుకున్నాడు. రజనీ సినిమాకు పనిచేయడమే ఒక రేంజ్ కి వెళ్లారని చెప్పడానికి కొలమానం. ఆ టార్గెట్ ను అనిరుధ్ ఆల్రెడీ అందుకున్నాడు.

తెలుగులో 'అజ్ఞాతవాసి' సినిమాతో ఆయన ఎంట్రీ ఇచ్చాడు. అయితే తమిళ సినిమాలతో బిజీగా ఉండటం వలన తెలుగు సినిమాలు ఎక్కువగా చేసే అవకాశం లేకుండా పోతోందని చెబుతున్నాడు. సంగీత దర్శకుడిగా తన పదేళ్ల ప్రయాణం పూర్తయిన సందర్భంగా ఆయన యూత్ కి గూస్ బంప్స్ వచ్చే ఒక వీడియోను రిలీజ్ చేశాడు. తెలుగు సినిమాల మినహా మిగతా సినిమాలను గురించి ఆ వీడియోలో అనిరుధ్ ప్రస్తావించాడు. 30 ఏళ్లు వచ్చేనాటికి తాను సంగీత దర్శకుడిని కావాలని అనుకున్నాననీ, కానీ పదేళ్ల ముందే తన కల నెరవేరిందని చెప్పాడు. ఒక పాటతో తన లైఫ్ మారిపోయిందని అన్నాడు. ఇంతవరకూ సాగిన అద్భుతమైన తన ప్రయాణం ఇంతటితో ఆగిపోలేదనీ .. అయిపోలేదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఆయన చేతిలో 'బీస్ట్' .. 'విక్రమ్' .. 'ఇండియన్ 2' వంటి భారీ సినిమాలు ఉన్నాయి.