Begin typing your search above and press return to search.

రెండు బంపరాఫర్లు కొట్టేసిన తెలుగు పాప

By:  Tupaki Desk   |   29 July 2015 6:20 PM GMT
రెండు బంపరాఫర్లు కొట్టేసిన తెలుగు పాప
X
రెండేళ్ల కిందట అంజలి పరిస్థితి చూస్తే ఇక ఆమె పనైపోయిందేమో అన్న సందేహాలు కలిగాయి జనాలకు. లేని పోని వివాదాలతో ఆమె కెరీర్ ఎంతగా దెబ్బతిందంటే అప్పటిదాకా తమిళనాట ఆమె డేట్ల కోసం క్యూలో నిలుచున్న నిర్మాతలు.. అంజలితో పెట్టుకుంటే ఆ సినిమా పూర్తవడం కష్టం బాబోయ్ అనుకుని పారిపోయే పరిస్థితి తలెత్తింది. ఐతే ఈ గ్యాప్ లో తెలుగు సినిమాలతో కాలక్షేపం చేసిన అంజలి.. ఏడాది నుంచి నెమ్మదిగా తమిళ కెరీర్ ను మళ్లీ దిద్దుకునే పనిలో పడింది. తెలుగులోనూ అవకాశాలున్నప్పటికీ.. ఇక్కడ ఎంతైనా కొంచెం గ్లామర్ దెబ్బతినగానే పక్కనబెట్టేస్తారన్న అంచనాతోనో ఏమో.. కోలీవుడ్ కెరీర్ ను అంత తేలిగ్గా తీసుకోవట్లేదు అంజలి.

ఇప్పటికే విమల్ సరసన మాప్పిల సింగం - జయం రవికి జంటగా సకల కళావల్లవన్ సినిమాలు చేసిన అంజలి.. తాజాగా రెండు బంపరాఫర్లు పట్టింది. అవి రెండూ కోలీవుడ్ పై బలమైన ముద్ర వేసిన ఇద్దరు డైరెక్టర్లు తీస్తున్న సినిమాలు. పిజ్జా - జిగర్ తాండా సినిమాలతో జూనియర్ మణిరత్నం అంటూ జాతీయ స్థాయిలో పేరు సంపాదించిన కార్తీక్ సుబ్బరాజ్ తన మూడో ప్రయత్నంగా తీస్తున్న మల్టీస్టారర్ తరహా సినిమా ‘ఇరైవి’లో అంజలి ముఖ్య పాత్ర పోషిస్తోంది. కార్తీక్ సినిమాల్లో ప్రతి క్యారెక్టరూ చాలా బలంగా ఉంటుంది కాబట్టి అంజలి కెరీర్ కు ఇది బ్రేక్ ఇచ్చే పాత్ర అనుకోవచ్చు. మరోవైపు ‘తంగ మీన్గల్’ సినిమాతో జాతీయ అవార్డు సాధించిన రామ్ డైరెక్షన్లోనూ అంజలి ఓ సినిమాకు ఓకే చేసింది. ఈ రెండు సినిమాలు కూడా అంజలి టాలెంట్ చూపించడానికి అవకాశమిస్తున్నవే. ఈ దెబ్బతో మళ్లీ కోలీవుడ్ దృష్టిని తనవైపు తిప్పుకుంటానని కాన్ఫిడెంట్ గా ఉంది అంజలి. తెలుగులో ప్రస్తుతం ఆమె డిక్టేటర్ - చిత్రాంగద సినిమాల్లో నటిస్తోంది.