Begin typing your search above and press return to search.

'2 సెకన్ల ఫేమ్ కోసమే ఇదంతా చేశానా?'

By:  Tupaki Desk   |   11 Sep 2020 9:50 AM GMT
2 సెకన్ల ఫేమ్ కోసమే ఇదంతా చేశానా?
X
బాలీవుడ్‌ యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్ పుత్ మృతి కేసులో కీలక విషయాలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి గర్ల్‌ ఫ్రెండ్‌ రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో మొదటి నుంచి సుశాంత్‌ మాజీ గర్ల్‌ ఫ్రెండ్‌ అంకిత లోఖండే.. సుశాంత్ కుటుంబానికి మద్దతుగా నిలుస్తూ రియా తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు. రియా అరెస్ట్ తర్వాత ఇదంతా ఆమె కర్మ అని చెప్తూ 'సుశాంత్ ది హత్య అని నేను ఎప్పుడూ చెప్పలేదని.. నా స్నేహితుడు సుశాంత్ కు న్యాయం జరగాలని కోరుకున్నానని.. డిప్రెషన్ లో ఉన్న వ్యక్తి డ్రగ్స్ తీసుకోవడానికి ఆమె ఎలా ప్రోత్సహించిందని?' అని అంకిత పోస్ట్ పెట్టింది. అయితే నటి శిబానీ దండేకర్‌ రియాను విడుదల చేయాలంటూ డిమాండ్‌ చేస్తూ.. అంకితపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అంకిత పితృస్వామ్య భావజాలానికి రాకుమారి వంటిదని.. 2 సెకన్ల ఫేమ్ కోసం ఇలా చేస్తోందంటూ వ్యాఖ్యానించింది. దీనిపై రియాక్ట్ అయిన అంకిత.. చనిపోయిన తన స్నేహితుడికి న్యాయం జరగాలని డిమాండ్‌ చేస్తేనే తనకు ప్రచారం లభిస్తుందని అనుకోవడం లేదని చెప్పుకొచ్చింది.

''రెండు సెకన్ల ఫేమ్ - ఈ పదం నన్ను ఆలోచింపజేసింది. టైర్ 2 సిటీలోని మర్యాదగల కుటుంబం నుంచి వచ్చాను. నన్ను నేను ప్రమోట్‌ చేసుకునే ఫ్యాన్సీ ఎడ్యుకేషన్‌ నాకు లేదు. 2004లో 'జీ సినీ స్టార్ కే ఖోజ్' అనే షో ద్వారా టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. అయితే 2009లో 'పవిత్ర రిష్తా' సీరియల్‌ తో నా నిజమైన ప్రయాణం మొదలైంది. ఆ సీరియల్‌ 2014 వరకు కొనసాగింది. వరుసగా ఆరేళ్లపాటు అత్యధిక టీఆర్పీతో కొనసాగిన విషయాన్ని నేను ఇక్కడ ప్రస్తావించక తప్పడం లేదు. ఫేమ్ అనేది ప్రేక్షకుల నుంచి లభించే ప్రేమ అభిమానానికి అదనపు హంగు‌ మాత్రమే అనుకుంటున్నాను. ప్రేక్షకుల్లో నాకున్న గుర్తింపు కారణంగానే 'మణికర్ణిక' 'భాగీ3' వంటి చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. 17 ఏళ్లుగా టీవీ ఇండస్ట్రీలో ఉన్న నేను నా స్నేహితుడికి న్యాయం జరగాలని డిమాండ్‌ చేయడం కేవలం 2 సెకన్ల చీప్‌ పబ్లిసిటీ కోసమే అనడం ఎందుకో నాకైతే అర్థం కావడంలేదు. నేను ఎక్కువగా బాలీవుడ్‌ లో కాకుండా టెలివిజన్‌ లో పనిచేశాననా? బాలీవుడ్‌ అయినా టీవీ ఇండస్ట్రీలోనైనా నటీనటులకు సమానమైన కృషి మరియు అంకితభావం అవసరం. టీవీ నటిని అయినందుకు గర్విస్తున్నా. నేను ఇష్టపడే మరియు కేర్ చూపించే వ్యక్తుల కోసం నేను ఎల్లప్పుడూ నా గొంతును వినిపిస్తాను'' అంటూ నటి శిబానీ కి కౌంటర్‌ ఇచ్చారు అంకిత.