Begin typing your search above and press return to search.

ఫేక్ వ్యూస్ కుంభ‌కోణంలో మ‌రో సెల‌బ్రిటీ

By:  Tupaki Desk   |   10 Aug 2020 4:15 AM GMT
ఫేక్ వ్యూస్ కుంభ‌కోణంలో మ‌రో సెల‌బ్రిటీ
X
మార్కెట్లో ప్ర‌తిదీ ఫేక్. ఒరిజిన‌ల్ కి న‌కిలీలు ఎన్నో పుట్టుకు రావ‌డం చూస్తున్న‌దే. ఉప్పు ప‌ప్పు కారం నూనెలు చివ‌రికి బీర్ బ్రాందీల్లోనూ నకిలీల గోలే. ఈ జ‌బ్బు ఇటు సోష‌ల్ మీడియాల‌కు అంటుకుంది. ఇక్క‌డ పెను ప్ర‌మాద‌క‌రంగా మారింది ప‌రిస్థితి. వ్యూవ‌ర్ షిప్ ని బ‌ట్టి.. అనుచ‌రులు ఎంత‌మంది ఉన్నారు? అన్న‌దానిని బట్టి కార్పొరెట్ కంపెనీలు త‌మ ఉత్ప‌త్తుల ప్ర‌చారానికి సెల‌బ్రిటీల్ని ఎంచుకుంటున్నాయి. భారీ మొత్తాల్ని చెల్లిస్తున్నాయి. అయితే అస‌లు సెల‌బ్రిటీలు ఇన్ స్టా.. ట్విట్ట‌ర్ లో లేకుండానే వారి పేరుతో ర‌క‌ర‌కాల న‌కిలీలు చెలామ‌ణి అయిపోతున్నాయి. వీటిలో బోలెడంత త‌ప్పుడు ప్ర‌చారం సాగిపోతోంది. స్టార్లు సైతం సొంత ప్రాప‌కం కోసం త‌ప్పుడు విధానాల్లో న‌కిలీ ప్ర‌చారం చేయించుకోవ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. సైబ‌ర్ క్రైమ్ పోలీస్ స‌మాచారం ప్ర‌కారం.. ఈ వేదిక‌ల‌పై పెను ప్ర‌మాదాల‌కు ఆస్కారం ఉందని తెలుస్తోంది.

స‌రిగ్గా ఇలాంటి పెను పోక‌డ‌ల‌పై ఫోక‌స్ చేసిన సైబ‌ర్ క్రైమ్ ఇటీవ‌ల న‌కిలీల్ని ఏరి వేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ భోగోతంలో సినిమా స్టార్ల పేర్లు వెలుగు చూస్తున్నాయి. ఇంత‌కుముందు దీపిక ప‌దుకొనే .. ప్రియాంక చోప్రా లాంటి బాలీవుడ్ క‌థానాయిక‌లను ప్ర‌శ్నించేందుకు సైబ‌ర్ క్రైమ్ పోలీస్ రెడీ అవుతున్నార‌ని తెలిసి అంతా షాక్ తిన్నారు. ఇక ఈ జాబితాలో చాలా మంది సెల‌బ్రిటీల పేర్లు ఉన్నాయ‌ని ప‌లువురు సౌత్ స్టార్లు కూడా ఉండొచ్చ‌ని అంచ‌నా వెలువ‌డింది.

నకిలీ ఫాలోవ‌ర్స్‌ కుంభకోణంలో తాజాగా హిందీ పాప్ గాయకుడు కం రాపర్ బాద్షా పేరు వెలుగులోకి వ‌చ్చింది. యూట్యూబ్ వీడియోల ప్ర‌మోష‌న్ కోసం అత‌డు న‌కిలీ వ్యూస్ ని కొనుగోలు చేశాడ‌ట‌. అత‌డు రిలీజ్ చేసిన పాగ‌ల్ హై కోసం ఈ అప‌రాధానికి పాల్ప‌డి పోలీసుల‌కు చిక్క‌డం సంచ‌ల‌న‌మైంది. ఇదంతా ప్ర‌పంచ రికార్డుకోస‌మేన‌ని ఇందుకోసం ఏకంగా రూ.72 లక్షలు చెల్లించాన‌ని అంగీక‌రించాడ‌ట‌. టేలర్ స్విఫ్ట్ .. కె-పాప్ బాయ్ బ్యాండ్ బిటిఎస్ నెలకొల్పిన రికార్డులను అధిగమించాలని ప్లాన్ చేశాడ‌ట‌. కేవ‌లం 24 గంట‌ల్లో 75 మిలియ‌న్ వ్యూస్ రావ‌డం సంచ‌ల‌న‌మైంది. అయితే ఇదంతా ఎలా సాధ్యం? అని సైబ‌ర్ క్రైమ్ వాళ్లు కూపీ లాగ‌డంతో అస‌లు గుట్టు తెలిసిపోయింది.

మ‌రోవైపు అత‌డు ఇలాంటిదేదీ అంగీక‌రించ‌లేద‌ని కూడా మ‌రో వ‌ర్గం ప్ర‌చారం చేస్తోంది. దాదాపు 9 గంట‌ల పాటు త‌న‌ని ప్ర‌శ్నిస్తే అన్నివిధాలా పోలీసుల‌కు స‌హ‌క‌రించాన‌ని తాను ఎలాంటి కుంభ‌కోణాల‌కు పాల్ప‌డ‌లేద‌ని బాద్షా అన్నార‌ట‌. ఇక‌పోతే ఈ త‌ర‌హా గూడు పుటానీపై ప‌ని చేస్తున్న టీమ్ ల‌ను వెతికి వేటాడి ప‌ట్టేస్తున్నారు పోలీసులు. ఇప్ప‌టికే 20 మంది వ్యక్తుల వాంగ్మూలాల్ని పోలీసులు నమోదు చేశారు. ఫేక్ న్యూస్ ని ప్ర‌చారం చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నిస్తున్నారు. ఇంత‌కుముందు బాలీవుడ్ గాయని భూమి త్రివేది పైనా ద‌ర్యాప్తు సాగిన సంగ‌తి తెలిసిందే. సంఘంలో ప్ర‌భావ‌వంత‌మైన సెల‌బ్రిటీలు ఇలా చేయ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బు? అన్న‌ది ఇప్పుడు ప్ర‌జ‌ల్లో త‌లెత్తిన ప్ర‌శ్న‌. వీటికి స‌మాధానం చెబుతారా అన్న‌ది చూడాలి.