Begin typing your search above and press return to search.

RRR విడుదలపై మ‌రో సందేహం?

By:  Tupaki Desk   |   12 Feb 2022 3:47 AM GMT
RRR విడుదలపై మ‌రో సందేహం?
X
RRR ఏ ముహూర్తాన ప్రారంభ‌మైందో కానీ ఆరంభం నుంచి ఎన్నో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంది. ఈ చిత్రాన్ని పూర్తి చేసేందుకు ఎస్.ఎస్.రాజ‌మౌళి ఎంతో శ్ర‌మించాల్సి వ‌చ్చింది. అయినా ఆయ‌న ఎంతో ప‌ట్టుద‌ల‌తో త‌న హీరోల్ని మౌల్డ్ చేసుకుని టీమ్ ని ముందుకు న‌డిపించారు. ఇక శ్ర‌మ‌కు త‌గ్గ ప్ర‌తిఫ‌లం విజువ‌ల్స్ లో క‌నిపించింది. ఇక‌పైనా పాన్ ఇండియా బాక్సాఫీస్ క‌లెక్ష‌న్ల రూపంలో వ‌స్తుంది అని అనుకుంటే కోవిడ్ మ‌హ‌మ్మారీ అంత‌కంత‌కు స‌తాయిస్తూనే ఉంది. ఇప్ప‌టికీ ఇదే టెన్ష‌న్. అయితే ఈ మూవీ రిలీజ్ ఖాయ‌మైన‌ట్టేనా? అంటే ఇంకా సందేహ‌మేనంటూ ప‌లువురు క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు.

ఇంత‌కుముందు రెండు రిలీజ్ తేదీల‌ను ప్ర‌క‌టించి అనంత‌రం ఒక డేట్ ని ఫిక్స‌య్యారు రాజ‌మౌళి అండ్ కో. ఇటీవ‌ల నిర్మాతలు ఈ చిత్రం 2022 మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు. అనేక వాయిదాల తర్వాత టీమ్ ఎట్టకేలకు దానిని అధికారిక విడుదల తేదీగా నిర్ణయించింది. అయితే ఇప్పుడు మరో సమస్య టీమ్ ని కలవరపెడుతోంది. ప‌రీక్ష‌ల సీజ‌న్ ఒక‌వైపు ఐపీఎల్ సీజ‌న్ మ‌రోవైపు హీట్ పుట్టిస్తున్నాయ‌న్న టాక్ వినిపిస్తోంది.

నిజానికి ప్ర‌తియేటా ఏప్రిల్ మాసం ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌తో సంక్లిష్ట‌మైన‌ది. ఆ త‌ర్వాతే సెల‌వులు ఉంటాయి. మార్చి -ఏప్రిల్ లను పరీక్షా సీజన్ లుగా పరిగణిస్తారు. అందువల్ల చాలా పెద్ద సినిమాలు ఆ సమయంలో విడుదల కావు. ఈ సంవత్సరం విషయాలు మరింత క్లిష్టంగా మారాయి. ఇప్పటికే క‌రోనా మూడవ వేవ్ కారణంగా జనవరిలో చాలా విద్యా సంస్థలు మూసివేసారు. తిరిగి తెరిచిన తర్వాత మే వరకు సంస్థలను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే మార్చి- ఏప్రిల్ లో విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. పైగా మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈసారి 10 జట్లు ఆడ‌తాయి. టోర్నమెంట్ చాలా పెద్దదిగా మారింది.

అది RRR క‌లెక్ష‌న్ల‌ను కొంత ప్రభావితం చేయవచ్చు. ఇవ‌న్నీ ఈ సినిమాకి అవ‌రోధాలుగా మార‌తాయ‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. RRR వాటిని అధిగమించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందో లేదో చూడాలి.

టిక్కెట్ రేట్లు తేల‌లేదింకా!

మ‌రోవైపు ఆర్.ఆర్.ఆర్ క‌లెక్ష‌న్ల‌కు గండి కొట్టే మ‌రో అంశం కూడా ఉంది. అది ఏపీలో టిక్కెట్టు రేటు. ఎంత‌మంది సినీపెద్ద‌లు వెళ్లి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని క‌లిసినా.. దీనిపై స‌రైన క్లారిటీ రావ‌డం లేదు. క‌మిటీలు వేశారు. కానీ ఇంకా ఏదీ తేల్చ‌లేదు. ప‌లు ద‌ఫాలు చ‌ర్చ‌లు సాగిస్తున్నా అంతిమంగా టిక్కెట్టు రేటు పెర‌గ‌డం లేదు. ఇది నిజంగా నిరాశ‌ను పెంచుతోంది. ఆర్.ఆర్.ఆర్ స‌హా పెద్ద సినిమాల‌న్నిటికీ అద‌న‌పు షోల‌కు బెనిఫిట్ షోల‌కు ఆస్కారం లేదు. ఐదో ఆట‌కు మాత్ర‌మే ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తినివ్వ‌నుంది. టిక్కెట్టు రేట్ల విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీనివ్వ‌లేదు. సీఎం పాజిటివ్ గా స్పందించార‌ని మెగాస్టార్ చిరంజీవి స‌హా ప‌లువురు వ్యాఖ్యానించినా దానిని ఎవ‌రూ న‌మ్మ‌డం లేదు. ఏపీలో టిక్కెట్టు రేట్లు పెరిగితేనే ఆర్.ఆర్.ఆర్ పంపిణీ దారులు సేఫ్ కాగ‌ల‌ర‌ని విశ్లేషిస్తున్నారు.