Begin typing your search above and press return to search.

నా డెత్ కి డేట్ లాకైంద‌న్న‌ ఏకైక న‌టుడు?

By:  Tupaki Desk   |   22 Jan 2023 6:05 AM GMT
నా డెత్ కి డేట్ లాకైంద‌న్న‌ ఏకైక న‌టుడు?
X
తెలుగు సినీ ప‌రిశ్ర‌మ లెజెండ్స్ గా ఎన్టీఆర్- ఏఎన్నార్ రెండు కళ్లు. ఎప్ప‌టికీ ప్ర‌జ‌లు మ‌రువ‌ని గొప్ప తార‌లు. భార‌తీయ చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ వందేళ్ల చ‌రిత్ర‌లో ఆ ఇద్ద‌రూ దాదాపు 50ఏళ్లు పైగా ఏలారు. మ‌ద్రాస్ ప‌రిశ్ర‌మ హైద‌రాబాద్ లో స్థిర‌ప‌డ‌డానికి ఆ ఇద్ద‌రూ చేసిన కృషి అంత తేలిగ్గా మ‌రువ‌లేనిది. అప్ప‌ట్లోనే హైద‌రాబాద్ న‌గ‌రంలో ఎన్టీఆర్ రామ‌కృష్ణ స్టూడియోస్ ని నిర్మిస్తే.. ఏఎన్నార్ అన్న‌పూర్ణ స్టూడియోస్ ని ప‌రిశ్ర‌మ‌కు అంకిత‌మిచ్చారు. సినిమా స్టూడియోల నిర్మాణం వ‌ల్ల పెద్ద‌గా క‌మ‌ర్షియ‌ల్ గా ఒరిగేదేమీ ఉండ‌ద‌ని తెలిసి ఈ మ‌హానుభావులు ఆనాడు సినిమా అనే క‌ళ‌ను బ‌తికించేందుకు వీటిని నిర్మించారు. క‌ళారంగానికి ఇక‌ ఎన్టీఆర్-ఏఎన్నార్ ల‌తో పాటు మూవీ మొఘ‌ల్ డా. డి. రామానాయుడు - దాస‌రి వంటి వారి కృషిని అభిమానులు ఎప్ప‌టికీ గుర్తుంచుకుంటారు.

నిజానికి మ‌ద్రాసు నుంచి ప‌రిశ్ర‌మ హైద‌రాబాద్ రాజ‌ధానికి వ‌స్తుందా వైజాగ్ వెళుతుందా? అన్న మీమాంస కొన‌సాగుతున్న క్ర‌మంలోనే ఏఎన్నార్ - ఎన్టీఆర్ హైద‌రాబాద్ లో నిర్మించిన‌ స్టూడియోల నిర్మాణానికి పురికొల్పారు. దీని వ‌ల్ల‌నే సినిమాల నిర్మాణం పెరిగి.. ఉపాధి పెరిగి మద్రాస్ నుంచి టాలీవుడ్ ని హైదరాబాద్ కు తీసుకురాగ‌లిగారు. ఎన్టీఆర్ సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఏఎన్నార్ రాజకీయాలవైపు మొగ్గు చూపకుండా .. చివరి శ్వాస వరకు సినిమాలే లోకంగా జీవించారు.

బ‌యోపిక్ లేనే లేదు!

లెజెండ్ ఏఎన్నార్ బయోపిక్ తెర‌కెక్కిస్తార‌ని వార్త‌లు వ‌చ్చినా వాటిని గ‌తంలో కింగ్ నాగార్జున ఖండించారు. ఏఎన్నార్ బయోపిక్ చేసే సాహ‌సం చేయ‌లేమ‌ని ఆయ‌న సినిమాలు రీమేక్ లు కూడా చేయ‌లేమ‌ని అన్నారు నాగార్జున‌.

లెజెండ్ అక్కినేని నాగేశ్వర రావు ప్ర‌త్యేక‌త గురించి ఎన్న‌ని చెప్పాలి. ఆయ‌నో న‌ట శిఖ‌రం మాత్ర‌మే కాదు గొప్ప ప్ర‌ణాళికా బ‌ద్ధ‌మైన జీవితానికి బ్రాండ్ అంబాసిడ‌ర్. క్ర‌మ‌శిక్ష‌ణ క‌ఠోర సాధ‌న అనిత‌ర సాధ్య‌మైన పోరాట ప‌టిమ ధైర్యం ఇలా ఎన్నో గొప్ప ల‌క్ష‌ణాలు ఆయ‌న సొంతం అని త‌న‌ని ద‌గ్గ‌ర‌గా చూసిన స‌న్నిహితులు కితాబిచ్చారు. నీతి నియ‌మాల‌తో బ‌తుకు వెల్ల‌దీసిన గొప్ప విజ్ఞాని ఆయ‌న‌. మాన‌సిక ప‌రివ‌ర్త‌నలో ఆయ‌న ఎవ‌రూ అందుకోలేని శిఖ‌రం.

స‌రిగ్గా అక్కినేని మ‌ల్టీస్టార‌ర్ `మ‌నం` రిలీజ్ స‌మ‌యంలోనే ఆయ‌న త‌న‌కు క్యాన్స‌ర్ ఉంద‌ని ఎంతో కాలం బ‌త‌క‌ను అని ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ చెప్పిన‌ప్పుడు ఔరా! అంటూ మీడియా వాళ్లే ముక్కున వేలేసుకున్నారు. అంత తెలిసీ ఆయ‌న చూపించిన తెగువ‌ ధైర్యం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. మ‌ర‌ణం అని తెలిసీ మీటింగు పెట్టారు పెద్దాయ‌న‌! అంటూ ఆ ధైర్యానికి కించిత్ గ‌ర్వించాల‌ని కామెంట్లు చేసిన‌వారు ఉన్నారు. స్వ‌త‌హా నాస్తికుడు అయిన ఆయ‌న స్వ‌ర్గం న‌ర‌కం గురించి మాట్లాడ‌రు. చివ‌రి నిమిషంలోనూ సినిమాల గురించే మాట్లాడారు.