Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: 'అంతరిక్షం'

By:  Tupaki Desk   |   21 Dec 2018 6:29 PM GMT
మూవీ రివ్యూ: అంతరిక్షం
X
చిత్రం : 'అంతరిక్షం'

నటీనటులు: వరుణ్ తేజ్ - అదితి రావు హైదరి - లావణ్య త్రిపాఠి - అవసరాల శ్రీనివాస్ తదితరులు
ఛాయాగ్రహణం: రాజశేఖర్
నిర్మాతలు: రాజీవ్ రెడ్డి - సాయిబాబా జాగర్లమూడి
రచన - దర్శకత్వం: సంకల్ప్

తెలుగులో వస్తున్న తొలి పూర్తి స్థాయి స్పేస్ సినిమాగా ‘అంతరిక్షం’ అందరి దృష్టినీ ఆకర్షించింది. ‘ఘాజీ’తో దర్శకుడిగా పరిచయం అయిన సంకల్ప్ రెడ్డి.. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కించిన చిత్రమిది. మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

దేవ్ (వరుణ్ తేజ్) ఆంధ్రప్రదేశ్ నుంచి నడిచే ఇండియన్ స్పేస్ సెంటర్లో శాస్త్రవేత్త. రష్యాలో శిక్షణ తీసుకుని వచ్చి కీలకమైన ప్రాజెక్టుల్లో పని చేసిన అతను తన చేతుల మీదుగా తయారైన విప్రియాన్ అనే శాటిలైట్ ను చంద్రుడి మీదికి పంపించే చేపడతాడు. ఐతే అనుకోని కారణాలతో అది విఫలమవుతుంది. అదే సమయంలో దేవ్ ప్రేమించిన అమ్మాయి పారు (లావణ్య త్రిపాఠి) ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతుంది. దీంతో దేవ్ తన ఉద్యోగం విడిచిపెట్టి తమిళనాడులోని మారుమూల ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా మారతాడు. ఐతే ఐదేళ్ల విరామం తర్వాత స్పేస్ సెంటర్లో ఒక ప్రాజెక్టు విషయంలో సమస్య తలెత్తి దేవ్ సాయం కోరతారు. ఆ స్థితిలో దేవ్ ఏ నిర్ణయం తీసుకున్నాడు.. సమస్యను పరిష్కరించాడా లేదాఅన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘ఘాజీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్నే కాక.. ఇతర భాషల ఆడియన్స్ ను కూడా విస్మయానికి గురి చేశాడు సంకల్ప్. ఒక కొత్త దర్శకుడు అలాంటి కథను ఎంచుకుని తొలి ప్రయత్నంలోనే అంత పకడ్బందీ సినిమా తీయడం అనూహ్యమే. తన రెండో ప్రయత్నంలో కూడా సంకల్ప్ అలాంటి సాహసోపేత కథనే ఎంచుకున్నాడు. తొలి సినిమాలో ప్రేక్షకుల్ని నీటిలోకి తీసుకెళ్లి ఉక్కిరిబిక్కిరి చేసిన సంకల్ప్.. ఈసారి అంతరిక్షంలో విహరింపజేశాడు. ఎంచుకున్న జానర్.. కథ విషయంలో సంకల్ప్ ను అభినందించవచ్చు. సినిమా చూస్తున్నంతసేపూ.. ఈ డైరెక్టర్ ఎంత కష్టపడ్డాడురా.. ఎంత పరిశోధన చేశాడురా అన్న భావన కలుగుతూనే ఉంటుంది. ఐతే కాన్సెప్ట్ పరంగా సంకల్ప్ మరోసారి మెప్పించినా.. ‘ఘాజీ’ తరహా బిగిని చూపించలేకపోయాడు. పైగా అందులో ఉన్న ఎమోషనల్ కనెక్ట్ కూడా ఇక్కడ మిస్సయింది. మరీ ఎక్కువ సినిమాటిక్ లిబర్టీ తీసుకుని అంతరిక్షంలో హీరో అండ్ టీంతో చేయించిన విన్యాసాలు నమ్మశక్యంగా లేకపోవడం వల్ల ‘అంతరిక్షం’ అనుకున్నంత ప్రత్యేకమైన అనుభూతిని మిగల్చలేకపోయింది.

సాధారణంగా జలాంతర్గామి పైకి కిందికి కదలదని.. ఐతే ‘ఘాజీ’ సినిమాలో ఓ కీలక సన్నివేశంలో సినిమాటిక్ లిబర్టీ తీసుకుని అది కిందికి పైకి వెళ్లేలా చూపించామని.. ‘అంతరిక్షం’లోనూ అలాంటి స్వేచ్ఛ తీసుకున్నామంటూ విడుదలకు ముందే ప్రేక్షకుల్ని ఈ సినిమా విషయంలో ప్రిపేర్ చేసే ప్రయత్నం చేశాడు సంకల్ప్. ఐతే అతనెంత ప్రిపేర్ చేసినప్పటికీ సినిమాలో జరిగే తంతు చూస్తే కన్విన్సింగ్ గా అనిపించదు. నేల మీద తెలుగు హీరో ఎన్ని విన్యాసాలు చేసినా ఓకే కానీ.. అంతరిక్షంలో కూడా అప్పటికప్పుడు ప్రణాళికలు మార్చేసి విన్యాసాలు చేసేయడం అసంబద్ధంగా అనిపిస్తుంది. ఈ ఆలోచనే ఆమోదయోగ్యంగా లేనపుడు.. ఆ తర్వాత జరిగే తంతంతా కూడా ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. తెలుగులో ఇప్పటిదాకా చూడని జానర్ కాబట్టి ఇందులో చూపించే చాలా విషయాలు కొత్తగా అనిపిస్తాయి. ఉత్కంఠ రేకెత్తిస్తాయి. కథ వరకు ఆసక్తికరంగానే అనిపిస్తుంది. కానీ ఎగ్జిక్యూషన్ అనుకున్నంత పకడ్బందీగా లేకపోయింది. ముఖ్యంగా ‘ఘాజీ’లో మాదిరి ఎమోషనల్ కనెక్ట్.. హై పాయింట్స్ ఇందులో మిస్సయ్యాయి.

హాలీవుడ్ స్పేస్ సినిమాలు చూడని వాళ్లకు ‘అంతరిక్షం’లో జరిగేదంతా కొత్తగా అనిపించవచ్చు. కొన్ని చోట్ల ఎగ్జైట్మెంట్.. ఉత్కంఠ కలగొచ్చు. ఐతే జానర్ సంగతలా వదిలేస్తే.. ప్రేక్షకుల్ని ఎమోషనల్ గా కనెక్ట్ చేసే అంశాలు ఇందులో మిస్సయ్యాయి. ఇందుకు హీరో పాత్రను సరిగా తీర్చిదిద్దకపోవడమే కారణం. తన కలల ప్రాజెక్టు ఫెయిలైనంత మాత్రాన హీరో ఉన్నట్లుండి అన్నీ వదిలేసి ఎవరికీ చిక్కకుండా ఐదేళ్ల పాటు ఎక్కడో దూరంగా ఉండటం.. తర్వాత ఉన్నట్లుండి సమస్య తలెత్తగానే వచ్చే హీరోయిజం చూపించేయడం సహేతుకంగా అనిపించదు. ఇక్కడ బలమైన కారణాల్ని చూపించడంలో.. కన్విన్స్ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు.

అంతరిక్షంలో నడిచే కొన్న సీన్లు ఎగ్జైటింగ్ గానే అనిపిస్తాయి కానీ.. వాటిలో లాజిక్ మిస్సయింది. ఎంత లిబర్టీ తీసుకున్నప్పటికీ.. ప్రేక్షకులకు కన్విన్సింగ్ గా అనిపించాలి. శాటిలైట్ లాంచింగ్ దగ్గర అంతరిక్షంలో జరిగే వ్యవహారాల గురించి ఎంతో పరిశోధించి అనేక విషయాలు చెప్పే ప్రయత్నం చేసిన సంకల్ప్.. మరీ కొంచెం కన్విన్సింగ్ గా ఉండేట్లు కథను నడిపించాల్సింది. ఇదేమైనా షేర్ ఆటోనా ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్లి ఆపేయడానికి అంటూ ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది. కానీ హీరో విన్యాసాలు చూస్తుంటే ఇలాంటి భావనే కలుగుతుంది. కమర్షియల్ సినిమాల్లో నేలమీద నిలబడి ఎన్ని విన్యాసాలు చేసినా ఓకే కానీ.. ఇలాంటి జానర్ సినిమాలో అంతరిక్షంలో హీరో చేసే విన్యాసాలే మరీ అతిగా అనిపిస్తాయి. దీనికి తోడు కథనంలో ఆశించినంత వేగం లేకపోవడం కూడా మైనస్సే. కాకపోతే తెలుగులో మనకున్న పరిమితుల్లో ఇలాంటి ఒక ప్రయత్నం జరగడం మాత్రం మెచ్చదగిందే. హాలీవుడ్ స్పేస్ సినిమాలు చూడని వాళ్లు ఒకసారి చూసేందుకు ‘అంతరిక్షం’ ఓకే అనిపిస్తుంది. కానీ ‘ఘాజీ’ తరహాలో అద్భుతాలు ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు.

నటీనటులు:

వరుణ్ తేజ్ ను ముందు అతనెంచుకున్న సినిమాల విషయంలో అభినందించాలి. ‘అంతరిక్షం’తో మరోసారి అతను తన అభిరుచిని చాటుకున్నాడు. దేవ్ పాత్రకు అతను కరెక్టుగా సూటయ్యాడు. అదితి రావు హైదరి పరిణతితో కూడిన నటనతో మెప్పించింది. లావణ్య ఉన్నది కాసేపే అయినా బాగానే చేసింది. అవసరాల శ్రీనివాస్.. సత్యదేవ్ తమ ప్రత్యేకత చాటుకున్నారు. రెహమాన్.. రాజా కూడా బాగా చేశారు. నటీనటులందరూ వారి వారి పాత్రలకు బాగా సెట్టయ్యారు. తమ పరిధిలో చక్కగా నటించారు. సినిమాలో చాలా వరకు ఏమీ లేని చోట ఊహించుకుని నటించడమే. ప్రధాన పాత్రధారులందరూ ఈ విషయంలో అభినందనీయులే.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రానికి టెక్నీషియన్స్ సపోర్ట్ కీలకం. అందరూ మంచి ఔట్ పుట్ ఇచ్చారు. సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారిఇచ్చిన రెండు పాటలూ బాగానే ఉన్నాయి. నేపథ్య సంగీతం అసెట్. సన్నివేశాల్లో ఉత్కంఠ పెంచడంలో బ్యాగ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషించింది. కెమెరామన్ రాజశేఖర్ అనుభవం సినిమాకు బాగా ఉపయోగపడింది. ఏది ఎఫెక్ట్.. ఏది రియల్ అనే కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ.. అక్కడక్కడా కెమెరా పనితనం కనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నంతలో బాగానే ఉన్నాయి. దీనికున్న పరిమితుల్లో బాగానే చేశారు. కొన్నిచోట్ల వీఎఫెక్స్ బాగున్నాయి.. కొన్ని చోట్ల స్థాయికి తగ్గట్లు లేవు. ఇక దర్శకుడు సంకల్ప్.. మరోసారి భిన్నమైన జానర్ ప్రయత్నించి ప్రత్యేకత చాటుకోవాలనుకున్నాడు. రాకెట్ సైన్స్ గురించి సాధ్యమైనంత వరకు అర్థమయ్యే రీతిలో చెప్పాడు. ఎక్కడా డీవియేట్ కాకుండా కథకు కట్టుబడి తాను చెప్పాలనుకున్నది చెప్పాడు సంకల్ప్. కాకపోతే ఈసారి అతను ‘ఘాజీ’ తరహా బిగిని చూపించలేకపోయాడు. ఎక్కువ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్లు కూడా అనిపిస్తుంది. ఓవరాల్ గా సంకల్ప్ తొలి సినిమా స్థాయిలో ఇంప్రెస్ చేయలేకపోయాడు.

చివరగా: అంతరిక్షం.. మంచి ప్రయత్నమే కానీ..!

రేటింగ్-2.5/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre