Begin typing your search above and press return to search.

అంటే.. ఇప్పుడైనా సుందరానికి కత్తెర వేస్తారా..??

By:  Tupaki Desk   |   11 Jun 2022 11:56 AM GMT
అంటే.. ఇప్పుడైనా సుందరానికి కత్తెర వేస్తారా..??
X
నేచురల్ స్టార్ నాని నటించిన 'అంటే సుందరానికి' సినిమా శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రానికి మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ వచ్చింది. సినీ విశ్లేషకుల రివ్యూలు కూడా సానుకూలంగా వచ్చాయి. అయితే ఫస్ట్ డే బాక్సాఫీస్ లెక్కలు చూస్తే.. టాక్ కి వస్తున్న కలెక్షన్స్ కి అసలు పొంతనలేకుండా పోయింది.

తెలుగు రాష్ట్రాల్లో 'అంటే.. సుందరానికి' సినిమా తొలి రోజు రూ. 3.87 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 30 కోట్లకు పైగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన సినిమా.. ఫస్ట్ డే ఇలాంటి ఓపెనింగ్స్ తెచ్చుకోవడంతో.. అప్పుడే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో అనే చర్చలు మొదలయ్యాయి. ఇక నాని సినిమాకు 'ఎ' సెంటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందనే వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే లెంగ్త్ బాగా ఎక్కువైందని.. సినిమా చాలా స్లోగా నడిచిందనే నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

'అంటే.. సుందరానికి' సినిమా దాదాపు మూడు గంటల నిడివితో వచ్చింది. ఈరోజుల్లో అన్ని గంటలు ప్రేక్షకులను థియేటర్ లో కూర్చోబెట్టడం అంత ఈజీ పనికాదు. ఎంత పెద్ద స్టార్స్ చేసిన సినిమా అయినా.. ఎంత మంచి కంటెంట్ తో వచ్చినా 3 గంట‌లు సేపు జనాలకు సినిమా చూపించడం అంటే చాలా క‌ష్టం. అందులోనూ ఇలాంటి ఎంటర్టైనర్లకు మరీ కష్టం. సినిమా చూసిన వాళ్లలో మెజారిటీ ఆడియన్స్ అంత లెన్త్ అవసరం లేదని అంటున్నారు.

తొలి రోజు వసూళ్లను బట్టి చూస్తే 'అంటే..' సినిమాకు ఈ వీకెండ్ తో పాటుగా రాబోయే వారం రోజులు చాలా కీలమనే చెప్పాలి. మౌత్ టాక్ మరియు రివ్యూలు బాక్సాఫీస్ వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి.. ఇప్పటికైనా నాని సినిమాకు కత్తెర వేసే మంచిదని.. అనవసరపు ఎపిసోడ్స్ ట్రిమ్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కంటెంట్ మీద నమ్మకంతోనో.. ఎమోష‌న్ మిస్స‌యిపోతుంద‌నో దర్శకుడు మూడు గంటల నిడివితో సినిమాను రెడీ చేసి వదిలారు. అయితే ఇప్పుడు క‌నీసం 20 - 25 నిమిషాల ర‌న్ టైమ్ త‌గ్గిస్తే బాగుంటుంద‌ని అంటున్నారు. నాని కూడా అంటే.. ని కాస్త త‌గ్గిస్తే బెట‌ర్‌ అనే స‌ల‌హా ఇచ్చాడ‌ట‌. దీంతో ఇప్పుడు మేకర్స్ ఆలోచ‌న‌లో ప‌డిన‌ట్టు టాక్‌ వినిపిస్తోంది.

ఒకవేళ నిడివి తగ్గించాలని అనుకుంటే మాత్రం వీలైనంత త్వరగా ఆ పని చేయాలి. లేట్ చేస్తే మాత్రం ఇది సినిమాపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అందులోనూ రెండో వారంలోనూ 'మేజర్' 'విక్రమ్' సినిమాలు స్ట్రాంగ్ గా ఉన్నాయి. కాబట్టి సినిమాలో కొన్ని సీన్లకు కత్తెర వేసి.. దూకుడుగా ప్రమోషన్స్ చేసి జనాల దృష్టిని ఆకర్షించాల్సిన అవసరముంది. మరి 'అంటే.. సుందరానికి' మేకర్స్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.