Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ‘అంటే సుందరానికీ’

By:  Tupaki Desk   |   10 Jun 2022 9:32 AM GMT
మూవీ రివ్యూ : ‘అంటే సుందరానికీ’
X
మూవీ రివ్యూ : ‘అంటే సుందరానికీ’

నటీనటులు: నాని-నజ్రియా నజ్రీన్-నరేష్-రోహిణి-నదియా-అళగం పెరుమాళ్-హర్షవర్ధన్-అనుపమ పరమేశ్వరన్-రాహుల్ రామకృష్ణ తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
ఛాయాగ్రహణం: నికేత్ బొమ్మి
నిర్మాతలు: నవీన్ ఎర్నేని-రవిశంకర్
రచన-దర్శకత్వం: వివేక్ ఆత్రేయ

యువ కథానాయకుల్లో నటుడిగా మంచి పేరు సంపాదించడమే కాక.. తాను చేసే సినిమాలతో ఒక అభిరుచిని చాటుకున్నాడు నేచురల్ స్టార్ నాని. గత ఏడాది ‘శ్యామ్ సింగ రాయ్’తో మెప్పించిన అతను.. ఇప్పుడు ‘అంటే సుందరానికీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మెంటల్ మదిలో.. బ్రోచేవారెవరురా చిత్రాలతో ఆకట్టుకున్న వివేక్ ఆత్రేయ ఈ చిత్ర దర్శకుడు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

సుందర్ (నాని) ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుర్రాడు. ఆచారాల విషయంలో చాలా కట్టుదిట్టంగా ఉండే కుటుంబం నుంచి వచ్చిన అతను.. తన చిన్ననాటి స్నేహితురాలైన లీల (నజ్రియా నజ్రీన్)ను ఇష్టపడతాడు. ఆమెది సంప్రదాయ క్రిస్టియన్ కుటుంబం. వాళ్ల ఇంట్లోనూ తమ మత సంబంధిత ఆచారాలకు చాలా విలువ ఇస్తారు. లీల కూడా సుందర్‌ను ఇష్టపడుతుంది. కానీ ఇరువురి కుటుంబాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వీరి పెళ్లికి అంగీకరించే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో తమ పెళ్లి కోసం సుందర్-లీల ఒక ప్రణాళిక రచిస్తారు. ఆ ప్రణాళిక ఎంతమేర సఫలమైంది.. దీని వల్ల రెండు కుటుంబాల్లో ఎలాంటి పరిణామాలు తలెత్తాయి.. చివరికి వీరి పెళ్లి జరిగిందా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

వెయ్యి అబద్ధాలాడైనా ఒక పెళ్లి చెయ్యమన్నారు పెద్దలు. ఐతే ‘అంటే సుందరానికీ’లో హీరో-హీరోయిన్ తమ ఇళ్లలో వేర్వేరుగా రెండు అబద్ధాలు చెబుతారు. ఇలా పెళ్లి కోసం అబద్ధాలు చెప్పేయడం తేలిక కానీ.. ఆ అబద్ధాల తాలూకు తర్వాతి పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అంచనా వేయడం కష్టం. నిజం తెలిశాక అన్నీ సర్దుకుపోతాయి అన్న మాట కరెక్టే కావచ్చు కానీ.. అబద్ధాలు చెప్పడంతో తలెత్తే సమస్యలు.. ఆ క్రమంలో ఎదురయ్యే సంఘర్షణ ఏ స్థాయిలో ఉంటాయి అనే పాయింట్ మీదే నడుస్తుంది ‘అంటే సుందరానికీ’. ఈ సినిమా కథ చాలా సింపుల్. దాని పరిధి కూడా చాలా చిన్నది. కానీ చిన్న పాయింట్ మీదే దాదాపు మూడు గంటల సినిమాను నడిపించి ప్రేక్షకులను కుదురుగా కూర్చోబెట్టగలిగాడు యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ. వేర్వేరు కులాలు లేదా మతాలకు చెందిన అబ్బాయి-అమ్మాయి ప్రేమలో పడడం.. ఈ క్రమంలో అబద్ధాలు చెప్పి తమ పెళ్లి జరిగేలా చూడడం అన్నది కొత్త పాయింటేమీ కాదు. ఐతే తెలిసిన కథనే కాస్త భిన్నంగా.. సరదాగా.. ట్రెండీగా చెప్పే ప్రయత్నం చేశాడు వివేక్. ఈ క్రమంలో కామెడీ.. ఎమోషన్లు బాగానే పండినప్పటికీ.. కథ పరిధి చిన్నదిగా ఉండి ఒకే పాయింట్ చుట్టూ చాలాసేపు నడవడం.. నరేషన్ నెమ్మదిగా ఉండటం.. నిడివి ఎక్కువైపోవడం.. సమస్యలుగా మారి ‘అంటే సుందరానికీ’ కొంత ఇబ్బంది పెడుతుంది. కానీ ఈ ప్రతికూలతల్ని దాటి.. మంచి అనుభూతిని ఇవ్వడంలో ‘అంటే సుందరానికీ’ విజయవంతం అయింది.

‘అంటే సుందరానికీ’ ప్రధాన పాత్రల క్యారెక్టరైజేషన్ మీద.. సిచువేషనల్ కామెడీ మీద నడిచే సినిమా. అందుకే అసలు కథలోకి వెళ్లడానికి ముందు పాత్రల్ని ప్రేక్షకులకు బాగా అలవాటు చేయడానికి ప్రయత్నించాడు వివేక్ ఆత్రేయ. ఇందుకోసం అతను కావాల్సినంత సమయం తీసుకున్నాడు. కథను స్ట్రెయిట్ గా చెప్పకుండా.. నాన్ లీనియర్ స్టయిల్లో చెప్పడంతో అసలు పాయింట్ మనకు అర్థం కావడానికి టైం పడుతుంది. ఈలోపు చిన్నప్పట్నుంచి మొదలుపెట్టి హీరో హీరోయిన్ల నేపథ్యాల్ని.. వారి వ్యక్తిత్వాల్ని చూపించారు. ఈ వ్యవహారం కొంచెం నెమ్మదిగానే సాగుతుంది. ఆచారాలకు విపరీతమైన ప్రాధాన్యం ఇచ్చే సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అబ్బాయి జీవితం ఎలా ఉంటుందో.. మూఢ నమ్మకాల వల్ల అతనెంత ఇబ్బంది పడతాడో చూపిస్తూ సాగే సరదా సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. నాని-నరేష్ లాంటి మంచి ఆర్టిస్లుల చేతుల్లో పడ్డ ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు మంచి వినోదాన్నిస్తుంది. హీరోయిన్ బ్యాక్ స్టోరీకి కూడా ఇంతే ప్రాధాన్యం ఇచ్చారు కానీ.. అది కొంచెం బోరింగ్ గానే అనిపిస్తుంది. ఇక హీరోయిన్ తో హీరో వన్ సైడ్ లవ్ స్టోరీ కూడా ఆకట్టుకుంటుంది. హీరోయిన్ లవ్ స్టోరీ.. దాని చుట్టూ నడిపిన డ్రామాతో కొంచెం ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేసినప్పటికీ.. కాసేపటి తర్వాత సస్పెన్స్ వీడిపోయి హీరో హీరోయిన్ల ప్రేమకథను పట్టాలెక్కించడంతో అసలు సినిమా ట్రాక్ ఎక్కేస్తుంది.

పాత్రల ఎస్టాబ్లిష్మెంట్ కు సమయం తీసుకోవడం.. కొన్ని అనవసర సన్నివేశాల వల్ల నెమ్మదిగా అనిపించినా.. ఓవరాల్ గా ప్రథమార్ధం ఓకే అనిపిస్తుంది. ద్వితీయార్ధంలో మాత్రం ఇలాంటి సమస్యలు పెద్దగా కనిపించవు. హీరో హీరోయిన్లు చెప్పిన అబద్ధాలతో తలెత్తే పరిణామాలు.. ఇరు కుటుంబాల రియాక్షన్... ఈ నేపథ్యంలో నడిచే క్రేజీ సన్నివేశాలతో కథనం పరుగులు పెడుతుంది. సన్నివేశాలు కొంచెం రిపిటీటివ్ గా అనిపించినప్పటికీ.. వినోదానికైతే ఢోకా లేదు. సన్నివేశాల్లో కొంచెం బలం తగ్గినా ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ ఆ లోటు కనిపించనివ్వకుండా చేసింది. ‘‘పెళ్ళి చేసుకుందాం. నీకు ఓకేనా’’ అని హీరోయిన్ అడిగితే.. ‘‘నువ్వు చెప్పు నాకు ఓకేనా కాదా’’ అంటూ నాని ఇచ్చే రియాక్షన్.. ‘‘ఏం సాధించావని నిన్ను పెళ్లి చేసుకుంటుందా అమ్మాయి’’ అని తండ్రి అడిగితే.. ‘‘ఎవరో ఏదో సాధించారనే అందరమ్మాయిలు పెళ్లి చేసుకోరు. కావాలంటే అమ్మనడుగు’’ అంటూ నాని ఇచ్చే సమాధానం.. ఇలాంటి మెరుపులతో అటు ఎమోషన్లూ పండాయి. ఇటు కామెడీ కూడా వర్కవుట్ అయింది. దీంతో ద్వితీయార్ధం పూర్తిగా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. చివరి అరగంటలో కొన్ని హార్ట్ టచింగ్ సీన్లతో సినిమాకు మంచి ముగింపునే ఇచ్చాడు వివేక్ ఆత్రేయ. కాకపోతే ముందే అన్నట్లు ప్లాట్ పాయింట్ చాలా చిన్నది కావడం.. దాని చుట్టూనే పెద్ద నిడివితో సినిమాను నడిపించడం కొంత సమస్యగా మారింది. కథనం ఆద్యంతం ఎంగేజింగ్ గా అనిపించినా.. ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ అదిరిపోయినా.. టెక్నీషియన్లందరూ ప్రతిభ చాటుకున్నా.. నాని-వివేక్ ఆత్రేయ-నజ్రియా-మైత్రీ మూవీ మేకర్స్.. ఇలాంటి కాంబినేషన్ నుంచి ఇంకా ఎక్కువే ఆశిస్తారన్నది వాస్తవం.

నటీనటులు:

చాలా సాధారణమైన పాత్రలను కూడా తనదైన నట కౌశలంతో మరో స్థాయిలో నిలబెట్టగల నైపుణ్యం నాని సొంతం. ఇక సుందర్ లాంటి ఆథర్ బ్యాక్డ్ టిపికల్ రోల్ ఇస్తే.. తగ్గుతాడా? సుందర్ పాత్రను నాని కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోగల పాత్రల్లో ఒకటనడంలో సందేహం లేదు. డిఫరెంట్ ఎమోషన్స్ పండించే అవకాశమున్న ఈ పాత్రలో నాని చెలరేగిపోయాడు. నాని మాత్రమే ఇలాంటి క్యారెక్టర్ చేయగలడు అనిపించాడు. ఇలాంటి అచ్చతెలుగు పాత్రలో నానిని చూసి ప్రేక్షకులు బాగా ఐడెంటిఫై అవుతారు. నరేష్ కాంబినేషన్లో నాని చేసిన సన్నివేశాలన్నీ భలేగా పేలాయి. ఆ సన్నివేశాల్లో వారిలోని నటులు ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. తాను ఎంత మంచి నటుడో.. పాత్రను ఓన్ చేసుకుంటే ఎంత బాగా దాన్ని పండిస్తారో నరేష్ మరోసారి ఈ సినిమాలో రుజువు చేశారు. హీరోయిన్ నజ్రియా లుక్స్ పరంగా చూస్తే యావరేజ్ అనిపిస్తుంది. పాత్రకు అవసరమైనంత క్యూట్నెస్ తనలో కనిపించలేదు. కానీ తనెంత మంచి పెర్ఫామరో ప్రతి సన్నివేశంలోనూ తెలుస్తూనే ఉంటుంది. నానితో ఆమె కెమిస్ట్రీ బాగా పండింది. అన్ని రకాల ఎమోషన్లనూ ఆమె బాగా పలికించింది. నదియా.. రోహిణి తమ అనుభవాన్ని చూపించారు. తమిళ నటుడు అళగం పెరుమాల్ కూడా బాగా చేశారు. అనుపమ పరమేశ్వరన్ చిన్న పాత్రలో మెరిస్తే.. హర్షవర్ధన్.. రాహుల్ రామకృష్ణ తక్కువ స్క్రీన్ టైంలోనే తమ ప్రత్యేకతను చాటుకున్నారు.

సాంకేతిక వర్గం:

వివేక్ సాగర్ టాలెంట్ ఏంటో చాలా సినిమాల్లో చూశాం. అయినప్పటికీ చాలా వరకు చిన్న మీడియం రేంజ్ సినిమాలకే పని చేస్తూ వచ్చాడు. తన కెరీర్లో కాస్త పెద్ద స్థాయి సినిమా ఇది. ఇలాంటి సినిమాలో సంగీత పరంగా తనదైన ముద్ర వేస్తాడని ఆశిస్తాం. ఐతే నేపథ్య సంగీత పరంగా అతను అదరగొట్టేసిన మాట వాస్తవం. హరీష్ శంకర్ ప్రి రిలీజ్ ఈవెంట్లో అన్నట్లు ఒక నృత్యరూపకం చూస్తున్నట్లుగా ప్రతి సన్నివేశాన్నీ నేపథ్య సంగీతంతో ఎలివేట్ చేసే ప్రయత్నం చేశాడు. కొన్ని చోట్ల మాత్రం ఆర్ఆర్ మరీ లౌడ్ అనిపిస్తుంది. పాటల విషయంలో మాత్రం వివేక్ కొంత నిరాశ పరిచాడు. సాంగ్స్ ఇంకా మెరుగ్గా ఉండాల్సిందనిపిస్తుంది. సినిమాలో అలా అలా నడిచిపోయాయే తప్ప గుర్తుంచుకునేలా లేదు. నికేత్ బొమ్మి ఛాయాగ్రహణం బాగుంది. చక్కటి ఫ్రేమ్స్ తో ఆకట్టుకున్నాడు. నిర్మాణ విలువలు మైత్రీ మూవీ మేకర్స్ స్థాయికి తగ్గట్లే ఉన్నాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్.. వివేక్ ఆత్రేయ తాను టేకింగ్ పరంగా ఈ తరానికి చెందిన న్యూ యేజ్ ఫిలిం మేకర్ అని చాటుతూనే.. భాష మీద.. మన సంస్కృతి సంప్రదాయాల మీద పట్టు చూపించి తన విలక్షణతను చాటాడు. అతడిలోని రచనా ప్రతిభ మరోసారి కనిపించింది. కాకపోతే తొలి సినిమా ‘మెంటల్ మదిలో’ తరహాలోనే కథ.. పాత్రల ఎస్టాబ్లిష్మెంట్ కోసం బాగా సమయం తీసుకోవడం.. కొన్నిచోట్ల నరేషన్ స్లోగా ఉండడం మైనస్ అయ్యాయి. ఈ కథ పరిధి కూడా చిన్నదైపోవడంతో అతను తనకు తాను బంధనాలు వేసుకున్నట్లు అనిపిస్తుంది. ఓవరాల్ గా వివేక్ మంచి సినిమానే తీశాడు. తన దర్శకత్వ ప్రతిభను చాటాడు.

చివరగా: అంటే సుందరానికీ.. సరదాలున్నాయ్ సమస్యలున్నాయ్

రేటింగ్-2.75/5