Begin typing your search above and press return to search.

విశాల్ కు ఎదురు తిరిగిన అసమ్మతి

By:  Tupaki Desk   |   19 Dec 2018 5:30 PM GMT
విశాల్ కు ఎదురు తిరిగిన అసమ్మతి
X
రాజకీయాల్లోనే కాదు సినిమా రంగంలోనూ అసమ్మతి ప్రతిపక్షం ఎలా ఉంటుందో తెలియాలంటే కోలీవుడ్ కు వెళ్లాల్సిందే. ఒకడు ఎదుగుతుంటే ఓర్వలేనితనం అక్కడ ఎక్కువ కనిపిస్తుంది. అందులోనూ వివాదాన్ని పెంచాలన్నా అణచాలన్నా అక్కడ కొందరికి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. ఈ రోజు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆఫీస్ వద్ద పెద్ద రచ్చ జరుగుతోంది. కారణం విశాల్ ప్రెసిడెంట్ గా ఎంపికయ్యాక అతి ముఖ్యమైన 18 సమస్యలను పరిష్కరించకపోవడమేనట. దానికి నిరసనగా ఆఫీస్ మీదకు వచ్చిన విశాల్ అసమ్మతి వర్గం ఏకంగా తాళాలు వేసుకుని అక్కడే తిష్ట వేసుకుని కూర్చుంది.

కౌన్సిల్ అంతా మోనోపోలీ అయిపోయిందని ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారని సదరు సభ్యులు మండి పడుతున్నారు. ఈ వర్గానికి అధ్యక్షత వహిస్తున్నది జెకె రితీష్- సురేష్ కామాక్షి-రాధా కృష్ణన్. వీళ్లకు మద్దతు ఇస్తున్న వాళ్ళ సంఖ్య కూడా భారీగానే ఉంది. వీళ్లందరి కంప్లయింట్ విశాల్ అమలు పరుస్తున్నవి ఏ మాత్రం బాగాలేవని. వైస్ ప్రెసిడెంట్ కదిరేసన్ ఎంత కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు.

21న తమిళనాట ఏకంగా 5 సినిమాలు క్లాష్ అయ్యేలా విడుదల కావడానికి విశాలే కారణమంటూ ఇటీవలే కొందరు ట్విట్టర్ లో నిరసన ప్రకటించిన కొద్దిరోజులకే ఇలా వీధికెక్కడం విశేషం. విశాల్ మద్దతుదారులు మాత్రం ఏ పరిశ్రమలోనూ లేని మార్పును అభివృద్ధిని విశాల్ తెస్తుంటే ఓర్వలేకే ఇలా తెగిస్తున్నారని అంటున్నారు. దీనిపై వెంటనే స్పందించడానికి విశాల్ ఇంకా అందుబాటులోకి రాలేదు. చూస్తుంటే ఈ రచ్చ కొంత పెద్ద ఎత్తున జరిగేలా కనిపిస్తోంది