Begin typing your search above and press return to search.

ఆ మూడ్రోజులు బాలీవుడ్ ఖాళీ!!

By:  Tupaki Desk   |   6 March 2019 2:30 AM GMT
ఆ మూడ్రోజులు బాలీవుడ్ ఖాళీ!!
X
ఫోర్బ్స్ జాబితా రారాజు.. వ‌ర‌ల్డ్ రిచెస్ట్ బిజినెస్‌ మేన్ మేఖేష్ అంబానీ ఇంట పెళ్లి బాజా అంటే మామూలుగా ఉంటుందా? రాజుగారే త‌లుచుకుంటే దెబ్బ‌ల‌కు కొద‌వా? అన్న‌ట్టే ఉంటుంది. ముఖేష్ అంబానీ గ‌త ఏడాది త‌న కుమార్తె వివాహాన్ని అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిపించిన సంగ‌తి తెలిసిందే. సాక్షాత్తూ ఇంద్రుడే నేల‌కు దిగి వ‌చ్చి ఆశీర్వ‌దించి వెళ్లేలా అంబరాన్ని తాకేలా కుమార్తె వివాహం జ‌రిపించారు. ఆ పెళ్లి కోసం దాదాపు 700 కోట్లు ఖ‌ర్చు చేశార‌ని అప్ప‌ట్లో ప్ర‌చార‌మైంది. దీనిపై నిరంత‌రం చర్చించుకుంటూనే ఉన్నారు. ఆ పెళ్లిని మ‌ర్చిపోక ముందే మ‌రో పెళ్లి. ఈసారి 1000 కోట్ల బ‌డ్జెట్ గ్యారెంటీ అన్న ముచ్చ‌టా సాగుతోంది.

ప్ర‌స్తుతం అంబానీల ఇంట బ్యాండు బాజా మోగనుంది. ఈసారి కొడుకు ఆకాష్ అంబానీ వివాహానికి ముహూర్తం ఫిక్స‌య్యింది. ప్రీవెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన సంబ‌రం ఇప్ప‌టికే గ‌త ఆర్నెళ్లుగా సాగుతూనే ఉంది. నిశ్చితార్థం మొద‌లు వివాహానికి సంబంధించి ఏదో ఒక సెల‌బ్రేష‌న్ తో అంబానీల అంటిల్లీ భ‌వంతి రంగుల మ‌యం అవుతూనే ఉంది. ప్ర‌స్తుతం దేవ‌త‌ల స్వ‌ర్గం స్విట్జ‌ర్లాండ్ లోని సెయింట్ మోర్టిజ్ లో ప్రీవెడ్డింగ్ సంబ‌రాల్ని ప్రారంభించారు. అక్క‌డే వివాహం మార్చి 9న‌ జ‌ర‌గ‌నుంది. ఆకాష్ అంబానీ - శ్లోకా మెహ‌తా జంట వివాహానికి ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. స్విట్జ‌ర్లాండ్ లో వివాహానంత‌రం .. మార్చి 10 - 11 తేదీల్లో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ జియో వ‌ల‌ర్డ్ సెంట‌ర్ లో భారీగా రిసెప్ష‌న్ కార్య‌క్ర‌మం ఉంటుంది.

రాజుగారి విందులో వ‌డ్డ‌న‌లు చేసేది .. బ‌రాత్ స్టెప్పులేసేది బాలీవుడ్ సెల‌బ్రిటీలే కాబ‌ట్టి ఆ మూడు రోజులు ముంబై ఖాళీ అయిపోవాల్సిందే. ఖాన్ లే వ‌డ్డించేది .. వాళ్లే అతిధుల్ని రిసీవ్ చేసుకునేది. పార్టీల్లో చిందులు వేసేది వీళ్లే కాబ‌ట్టి ఆ మూడు రోజులు ఎవ‌రికీ దొర‌క‌రు అన‌డంలో సందేహం లేదు. స్విట్జర్లాండ్ లో పెళ్లికి వెళ్ల‌క‌పోయినా బాలీవుడ్ లో మెజారిటీ పార్ట్ సెల‌బ్రిటీలంతా అంబానీల రిసెప్ష‌న్ లో వాలిపోవ‌డం ఖాయం అన్న చ‌ర్చా సాగుతోంది.