Begin typing your search above and press return to search.

ప్రేమ‌, పెళ్లిపై నోరువిప్పిన అను.. ఇంత‌కీ ఏమంది..?

By:  Tupaki Desk   |   23 Oct 2022 8:31 AM GMT
ప్రేమ‌, పెళ్లిపై నోరువిప్పిన అను.. ఇంత‌కీ ఏమంది..?
X
ఆక‌ట్టుకునే అందం, అంత‌కుమించిన టాలెంట్ ఉన్నా.. స‌క్సెస్ లేని ముద్దుగుమ్మ‌ల్లో అను ఇమ్మాన్యుయేల్ ఒక‌రు. `మజ్ను` మూవీ తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అక్కినేని నాగచైతన్య వంటి అగ్ర హీరోలతో సినిమాలు చేసింది. కానీ, ఆమెకు బ్రేక్ మాత్రం రాలేదు.

అను తొలి సినిమా `మజ్ను` మినహా మిగిలిన చిత్రాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. చాలా కాలం నుంచి సరైన హిట్‌ కోసం ఎదురు చూస్తున్న అను ఇమ్మాన్యుయేల్ త్వరలోనే `ఊర్వశివో రాక్షసివో` అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతోంది. రాకేశ్ శశి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రంలో అల్లు శిరీష్ హీరోగా న‌టించారు.

మొద‌ట ఈ చిత్రానికి `ప్రేమ కాదంట‌` అనే టైటిల్ ను పెట్టారు. ఆ త‌ర్వాత ఏమైందో ఏమో గానీ.. `ఊర్వశివో రాక్షసివో`గా టైటిల్ ను మార్చి సినిమాను ప్ర‌మోట్ చేస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ న‌వంబ‌ర్ 4న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.

ఈ నేప‌థ్యంలోనే చిత్ర టీమ్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు. అయితే ప్ర‌మోష‌న్స్ లో భాగంగా అను ఇమ్మాన్యుయేల్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ఆమె ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకుంది. అలాగే ప్రేమ‌, పెళ్లిపై సైతం అను నోరు విప్పింది.

గ‌త కొద్ది రోజుల నుంచి అల్లు శిరీష్‌తో అను ఇమ్మాన్యుయేల్ ప్రేమ‌లో ఉంద‌ని, వీరిద్ద‌రూ డేటింగ్ చేస్తున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ వార్త‌లు నిజం కాద‌ని.. తామిద్ద‌రం మంచి ఫ్రెండ్స్ అని ఇప్ప‌టికే అల్లు శిరీష్ స్ప‌ష్టం చేశాడు. ఓ కొత్త సినిమా వస్తున్నప్పుడు ఇలాంటి వార్తలు రావ‌డం సహజమేనని శిరీష్ పేర్కొన్నారు.

అయితే తాజా ఇంట‌ర్వ్యూలో అను ఈ వార్త‌ల‌పై ప‌రోక్షంగా స్పందించింది. తాను ఎవ‌రితోనూ ప్రేమ‌లో లేన‌ని, డేటింగ్ కూడా చేయ‌డం లేద‌ని అను చెప్పుకొచ్చింది. అలాగే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని.. ప్ర‌స్తుతం తన ఫోక‌స్ మొత్తం కెరీర్ పైనే ఉంద‌ని ఆమె వెల్ల‌డించింది. మొత్తానికి అల్లు శిరీష్ తో ప్రేమ‌, దోమ అన్న వార్త‌ల‌కు అను పులిస్టాప్ పెట్ట‌క‌నే పెట్టేసింది. మ‌రి స‌క్సెస్ కోసం అరాట‌ప‌డుతున్న ఈ భామ‌.. `ఊర్వశివో రాక్షసివో` సినిమాతో అయినా హిట్ కొడుతుందా..? లేదా..? అన్నది చూడాలి.